వేడిని కొలిచేది థర్మామీటర్. బాడీలోని శక్తికి కొలబద్ద ఎండ వేడి. మే మండే ఎండల్లో మిట్ట మధ్యాహ్నం ఆటో కోసం రెండు నిమిషాలుగా చెట్టు కింద ఎదురుచూస్తున్న కుర్రాడి ఆలోచనది. చెట్ల మీద ప్రేమ పొంగుకొచ్చి ఓ కౌగిలింతివ్వాలి. నుదుటి నుంచి రాలుతున్న చెమట చుక్కల్ని ఒడిసిపట్టి మొదలుకు కాళ్లు కడగాలి. పచ్చగా కాపుకాసి నీడనందిస్తున్న ఆకుల్ని ఇంకెప్పుడూ సరదాకి తుంచకుండా సుతారంగా నిమరాలి. దారికి అడ్డొస్తున్నాయని కొమ్మల్ని విరవకుండా పక్కకు కట్టాలి. చెట్టు ఎంత మంచి చుట్టం. వడగాడ్పు నుంచి తలదాచుకునేంత ఆ పెద్ద చెట్టుని చూస్తూ ఇలా ఎన్ని రెజల్యూషన్లు తీసుకున్నాడో ఆ కుర్రాడు. మరో పదినిమిషాలు గడిచింది. చెట్టు నీడ కోసం ఓ కుక్క కూడా తోడొచ్చింది. అది వస్తూ వస్తూనే మొదాల కూలబడింది. దాన్నెంత చీదరించుకున్నా.. రాయి పెట్టి కొట్టినట్టు చేసినా కదల్లేదు, మెదల్లేదు. అక్కడే కళ్లను గట్టిగా మూసుకుని నాలికాడిస్తూ పడుంది. కుర్రాడికి చిర్రెత్తుకొచ్చింది. అంతకు ముందు ఆలోచనలన్నీ చెల్లాచెదురైనాయి. చుట్టూ చూసి దాన్ని తరిమేందుకు ఏం లేక చివరకు చెట్టు కొమ్మనే విరిచి అదిలించాడు. కొమ్మను విరిచేప్పుడు నలిగి పసరు కక్కిన ఆకులన్నీ విచారంగా మట్టికరిచాయి. ఆ కుక్క ఎంతకీ కదలక పోవడంతో విరిచిన కొమ్మతో చెట్టునే బలంగా గట్టి శబ్దం వచ్చేలా కొట్టాడు. ఆ తాకిడికి చెట్టు చీరుకుని కన్నీటి పాలని కార్చింది. కుక్క ఓపికంతా కూడదీసుకుని తల నేలకీడ్చుకుంటూ ఎదుటి సందు వైపు అడుగు వేసింది.. వెనక్కు తిరిగి ఆ కుర్రాడిని చూస్తూ. తారు రోడ్డు మీద కాళ్లు అంటుకోవడంతో అది షాక్ కొట్టినట్టు విచిత్రంగా ప్రవర్తించి వడివడిగా నడకందుకుంది.
హమ్మయ్య... అనుకుంటూ చెట్టుకైన గాయాన్ని గుర్తించకుండా ఆ కుర్రాడు దాని మీదే కాలానించి నిల్చున్నాడు. అంతకుముందు విరిచిన కొమ్మ సందులోంచి ఇప్పుడు సూరీడి బాణాలు ఆకుల మధ్య సందుల్లోంచి సర్రున దూసుకొస్తూ కుర్రాడి నడినెత్తిని సర్రుమనిపిస్తున్నాయి. చెట్టు చుట్టుతా ప్రదక్షిణ చేసినా అతడికి చాటు దొరకలేదు. మరీ వెనక్కు నక్కి నిల్చుంటే ఆటోలు అక్కడ ఆపరనే సందేహం. అసలే ఆ రోడ్డెంట ఆటోలు తిరిగేది అరకొరే. బైక్‌ల వాళ్లను లిఫ్ట్ అడగటం అక్కడ షరామామూలే. కానీ, మిట్ట మధ్యాహ్నం వడదెబ్బాయత్నానికి ఎవరు పాల్పడతారు..! తానంటే ఏదో అర్జెంటు పని ఆఫీసులో రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరుగుతూ ఎదురుచూస్తోందని వెళుతున్నాడుగాని. అరగంట దాటిపోయింది. బనీను తడిసిపోయి షర్ట్లోంచి బయటపడింది. తల కాస్త దిమ్మెక్కింది. ఆటోలు వస్తున్నాయి గానీ, ఆగడం లేదు. అన్నీ కిరాయివే అనుకుంటా అస్సలో మనిషి ఎండలో కరిగిపోతున్నాడనే జాలేమాత్రం లేకుండా అస్సలు పట్టించుకోకుండా దూసుకుపోతున్నాయి. తన అవస్థను అర్థం చేసుకుని ముందు సీట్లో పక్కన కూర్చోబెట్టుకున్నా సరిపోద్ది కదా అనుకుని అన్ని ఆటోలకు చేయి ఊపుతున్నాడు. కొందరు కుదరదని చేతులాడిస్తూ వెళ్లిపోతున్నారు. కొందరు ఎండకు తాళలేక ఇంటికెళ్లే మూడ్‌లో ఉన్నారేమో ఖాళీగా బండెళుతున్నా ఆపట్లేదు.
కుర్రాడికి నీరసం వచ్చేసింది. నీరసమనగానే గుర్తొచ్చింది ఆఫీసులో కొలీగ్స్‌లో తానే ఫిట్ అనే స్టాంప్ వేయించుకున్నాడు. ప్రియురాలు కూడా ఓసారి 'నువ్వు ఇంత ఎనర్జిటిక్ ఏంట్రా? అస్సలు నీరసం రాదా!' అని తరచూ అనడం గుర్తొచ్చింది. ఓ పావు కిలోమీటర్ దూరంలోని కిరాణా కొట్టుకు అతడి కాళ్లు సహకరించవు గానీ, పొద్దున లేచిందే తడవు అక్కడే నిలబడి కిలోమీటర్లు కిలోమీటర్లు జాగ్ చేస్తుంటాడు. టీవీలో చూపించే అవేవో ఎక్సర్సైజ్ మెషీన్లు కొనుక్కుని గిరి దాటకుండా ఒళ్లు పెంచుతుంటాడు. 'ఇంట్లో ఇచ్చిన బిల్డప్ చాలుగానీ, నాలుగడుగులు నడిచి చూడు తెలుస్తుంది నీ స్టామినా' అని ఆటపట్టించే సహజ శత్రువు ఇంట్లో ఉండనే ఉంది. ఇవన్నీ వాకర్ బెల్టులా తిరిగాయేమో తన స్టామినా కొలుచుకునేందుకు ఈ మిట్ట మధ్యాహ్నపు ఎండను టెస్ట్‌కు తీసుకున్నాడు. ఆ ఎండలో ముందు వీధి మలుపు రోడ్డు వరకు వెళితే తానంతా బాగునట్టే అని బ్యాగుని వీపుకు రాసుకుంటూ భుజాల్ని సర్దుకున్నాడు. చిల్లులు పడిన నీడలోంచి కాళ్లు బయట పెట్టగానే సెగ తగిలింది. బెల్ట్ చెప్పులు మిగిల్చిన ముందరి వేళ్లు అగ్గిపుల్ల అంటుకున్నట్టు భగ్గుమనేసరికి వాటిని పైకి కిందకు విరుస్తూ అక్కడే నిలబడిపోయాడు. లేట్ అయితే అయ్యింది గానీ, ఈ ఎండన పడితే 108 ఎక్కి ఓ వారం సెలైన్లు ఎక్కించుకోవాల్సి ఉంటుందని జంకాడు.
తానంత నీరసుడిని కాదని మళ్లీ ఊపొచ్చి అడుగు ముందుకేశాడు. ఆ అడుగుని అక్కడే ఆపేసింది ఓ బైక్. అంతదూరం నుంచి రయ్యిమని దూసుకొచ్చి తనకు కాస్త దగ్గరకొచ్చేసరికి చాలా నిదానమైపోయి తారు రోడ్డు నుంచి మట్టి దారిన పడింది. ఇలాంటోళ్లు ఉండబట్టే ఇంకా ఎండల్లో తనలాంటి వాళ్లు వండర్లు చేయగలుగుతున్నారని.. కళ్లెంట వెలుగులు నింపుకుని లిఫ్ట్ పిడికిలి బైక్‌కు అడ్డంగా పెట్టాడు. బండి ఆపిన వ్యక్తి ఆ పిడికిలిని పట్టించుకోకుండా జేబులోని ఫోను తీసి చూసుకున్నాడు. ఆ( పనికిరాని కాల్ అనుకుని రింగ్ కట్ చేసి ఆయన క్లచ్ వదిలేశాడు. కుర్రాడికి ఠారెత్తిపోయింది. లిఫ్ట్ అడగడమే ఓ నామోషీగా భావించి ఓసారి ఓ ఫ్రెండ్‌ని విసుక్కున్నాడు కూడా. కానీ, ఎండకు అన్నీ మరచిపోయి లిఫ్ట్ అడిగి భంగపడ్డట్టైైంది. ఇక లిఫ్ట్‌ని కాక తన స్టామినానే నమ్ముకోవాలని డిసైడైపోయాడు. ముందు వీధి మలుపుని అంత దూరం నుంచి ఓ లుక్కేశాడు. ఎండమావికి అది మరీ మలుపు తిరిగి కనిపించింది. రోడ్డో తారు నదీ ప్రవాహంలా కనిపించింది. ఆ ప్రవాహంలోంచి ఓ సన్నని రూపం కదిలినట్టైంది. మధ్యమధ్యన సన్నగిల్లుతూ అస్పష్టంగా ఉన్నదో పిల్ల రూపమని గ్రహించాడు. ఆ అమ్మాయే ఆ తారు ప్రవాహంలో కలిసిపోతే.. తానెందుకు వెళ్లలేనని కుర్రాడికి అనిపించింది.
ఆ సన్నటి రూపం క్రమంగా దగ్గరై ఆ దారి మధ్యన ఏదో సందులోకి మళ్లింది. ఆ రూపాన్ని క్లియర్ చేసుకుంటూ అతడలా నాలుగు అడుగులు వేశాడో లేడో ఎవరో అమ్మాయి బండి మీద అటే వస్తోంది. స్కార్ఫ్‌కు తోడు పెద్ద పెద్ద నల్ల కళ్లద్దాలు, మోచేతిని దాటిన గ్లౌజులతో ఎండవీర్ణిగా తోచింది. ఎప్పటి నుంచో ఓ అమ్మాయిని లిఫ్ట్ అడిగితే ఎలా ఉంటుందనే తుంటరి ఆలోచన మెదిలింది. ఏంటో ఆ ఆలోచనతో ఎండ కూడా చల్లగానే తాకినట్టై ఒళ్లు జలదరించింది. అతడా ఆలోచనల్లో మునిగి ఉండగానే ఆమె అతణ్ని దాటేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయినా లిఫ్ట్ అంటూ చేయి లేచింది. మరిదిచ్చిన బూస్టో ఏమో చకచకా ముందు వీధి మలుపు రోడ్డుకి చేరిపోయాడు. ఒళ్లంతా చెమట కడిగేసింది. ఆ నిర్మానుష్య రోడ్డు మీద తానొక్కడే నిలబడి నీడచాటు కోసం వెదుకుతున్నాడు. ఎక్కడా చెట్టు జాడలేదు. వెనక్కు తిరిగి తన పాదయాత్ర గురించి తనను తానే భుజం చరుచుకున్నాడు. స్టామినా.. ఎండ్యురెన్స్... ఇంకేవో బూస్టింగ్ మాటలు చెవుల్లో మార్మోగినట్టయ్యాయి. శభాష్.. అనుకుంటూ చెమట్లను దస్తీతో తుడుచుకున్నాడు. తన నడక గురించి ఆఫీసులో వెళ్లివెళ్లగానే చిట్్చాట్ పెట్టేయాలనుకున్నాడు. రాత్రికి లేటుగా ఇంటికొచ్చినా అందర్నీ లేపి మరీ కథలు కథలుగా ప్రతి అడుగులోని కష్టాన్ని వివరించాలనుకున్నాడు. అతడి అత్యుత్సాహాన్నంతటినీ మరో పావుగంట ఎదురుచూపులు అణచేశాయి.
ఆ మలుపులోను ఏ బండీ రావడం లేదు. మెయిన్ రోడ్డులోని బస్ పాయింట్‌కి వెళ్లాలంటే.. గంట నడవాల్సిందే. అంత ఎండలో మరో పావుగంట నడిచినా ఇక అంతే..! ఏంటీ రోజు ఇలా ఉంది.. వీక్లీ ఆఫ్ అప్పుడూ ఆఫీసుకి వెళ్లాల్సొచ్చింది.. ఎండకు తడుస్తూ అంత దూరం నడవాల్సొచ్చింది. చెట్టు నీడ వదిలేసి ఎడారిలోకి వచ్చినట్టైంది. ఇంకొంచెం సేపైతే సొమ్మసిల్లి పడిపోతాడనుకునే టయానికి ఓ ఆటో వచ్చింది. ఆటో ఆగగానే 'అన్నా! వాటరున్నాయా..!' అని అడిగి తాగేశాడు. 'ఇంత ఎండలో ఎక్కడకు బయల్దేరావయ్యా..!' కొంచెం చనువు తీసుకుని మందలించాడు ఆటో పెద్దాయన. ఏదో మాట్లాడబోయి కుర్రాడి గొంతు పొలమారడంతో సర్లే.. సర్లే ముందెక్కు అంటూ బాటిల్ అందుకున్నాడు. కుర్రాడు ఆటో ఎక్కి కళ్లు మూసుకున్నాడు. ఆటో టాప్ మీద నార పట్టాలేవో వేసున్నాయి. వడగాడ్పు కాస్త చల్లారేలా సైడ్ పట్టాలూ వేసున్నాయి. సన్నగా లోనికి ప్రవేశిస్తున్న గాలి చల్లబడి కుర్రాడికి ఉపశమనాన్నిస్తోంది. చొక్కా నుంచి బనీను వెనక్కుపోయింది. చొక్కా కాస్త ముందుకు లాగి ఉఫ్‌మని గుండెల్ని ఊదుకుని వెనక్కు కూలబడ్డాడు. 'ఎక్కడి వరకూ..' అని పెద్దాయన అడిగేసరికి.. ముందుకు చేతులు చాపి సెంటర్ బస్టాప్ వరకు అని ముందుకువాలి దారిని చూశాడు. ఒక్కరు కూడా రోడ్ల మీద కనిపించలేదు. ఆటో మరో మలుపు తిరిగింది. ఎండమావిలో మరోసారి ఆ సన్నని రూపం కనిపించింది. అది ఇందాక చూసిందే. ఆ అమ్మాయిని కొన్ని క్షణాల్లోనే దాటేస్తూ ఆటో ముందుకెళ్లిపోయింది. కుర్రాడు నివ్వెరపోయాడు.. ఓ పది, పన్నెండేళ్లు కూడా ఉండవేమో ఆ చిన్నారికి. ఆ అమ్మాయి ఆ సందు ఈ సందు దాటుతూ మళ్లీ మెయిన్ రోడ్డెక్కింది. అంత ఎండలో అక్కడే నిలబడి ఆటో కోసం వేచిచూస్తేనే ప్రాణం పోయినంత పనైంది. ఆ అమ్మాయి అంతస్సేపటి నుంచి నడుస్తూనే ఉంది. అరె.. అనుకున్నాడు కుర్రాడు. ఆటో మరో మలుపు తిరిగేలోపు ఆ అమ్మాయి రోడ్డు దిగి పక్కనున్న మురికివాడ వీధిలోకి అడుగేసింది. 'ఫర్లేదబ్బాయి.. ఎండలో బానే నిలబడ్డావ్' అని ఆటో ఆయన మళ్లీ మాట కలిపాడు.
- అజై
95023 95077
పాదచారి
