* కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ : శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు బుధవారం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడోవారం నాటికి పూర్తి విధి విధానాలను రూపొందించాలని, పర్యాటకుల సంక్షేమ అంశాలు కూడా అందులోఉండాలని న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు కింద ఉన్న ఆలయాల పాలనకు సంబంధించి ప్రభుత్వం చట్ట సవరణల ముసాయిదాను రూపొందించినట్లు ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన న్యాయవాది తెలిపారు. ఆలయ సలహా కమిటీలో మూడింట ఒక వంతు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముసాయిదా చట్టం ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు.
దీంతో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి కోర్టు రూములో చర్చ జరిగింది. కేవలం 50 సంవత్సరాల పైబడిన మహిళలకు మాత్రమే సలహా కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతిపాదించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శబరిమల ఆలయ పాలన విషయాన్ని లేవనెత్తుతూ 2011లో దాఖలైన అభ్యర్ధనపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.