ఒంగోలు: ఏపీలో ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సీఎం జగన్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతోంది.
నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కార్యక్రమ పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం జగన్ మాట్లాడారు. తొలి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే భవిష్యత్ ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 శాతం మంది పిల్లలకు చదువు రాని పరిస్థితి ఉందన్నారు. పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని సిద్ధం చేయాలా వద్ద అని ప్రశ్నించారు. ఓ మంచి నిర్ణయం తీసుకోకపోతే తలరాతలు మారవన్నారు. పేదలు చదువుకునే బడులను దేవాలయాలుగా మార్చొద్దా? అని ప్రశ్నించారు. మార్పు రావాలంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకం కానున్నాయన్నారు. ప్రపంచంతో పోటీపడేలా పరిస్థితులు సృష్టించకపోతే మన పిల్లలు డ్రైవర్లు, కూలీలుగా మారుతారన్నారు.
రాష్ట్రంలోని 47వేల స్కూళ్లలో నాడు-నేడు అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో 15వేల స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గతంలో స్కూళ్లకు, ఇప్పుడున్న స్కూళ్ల తీరుకి మధ్య వ్యత్యాసం చూపడమే నాడు నేడు లక్ష్యమన్నారు. ప్రతీ స్కూళ్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, అదనపు తరగతులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు వస్తాయన్నారు. ప్రతీ స్కూల్లో పేరెంట్స్ కమిటీలు వేస్తామన్నారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అంటే ఛాలెంజేనన్నారు. ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తామన్నారు.