* ముఖ్యమంత్రికి రామకృష్ణ లేఖ
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
వైసిపి ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలు, భూములను అమ్మాలనే ఆలోచనను విరమించుకోవాలని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ, ముఖ్యమంత్రికి మంగళవారం ఓ లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు ఎన్బిసిసితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అమ్మకాలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జిల్లాపరిషత్ అతిథి గృహాల విస్తీర్ణం, తదితర వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని గుర్తుచేశారు. వీటన్నింటినీ అమ్మేసి లక్షల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకుని, వాటిని నవరత్నాల అమలుకు వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచించడం సమంజసం కాదని వివరించారు. రాజధాని నగరం విజయవాడ నడిబడ్డున ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, బందర్ రోడ్డులోని జిల్లాపరిషత్ అతిథి గృహం, ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లను కూడా అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తక్షణమే ఈ చర్యలను నిలిపేయాలని కోరారు. 22 మంది ఎంపిలను చేతిలో పెట్టుకుని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి, ఎపికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ భావిస్తుందని తెలిపారు. కేంద్రం నుండి ఎపికి రావాల్సిన నిధులను తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ భూములు అమ్మే ఆలోచన విరమించుకోవాలి
