న్యూఢిల్లీ : తనను 'ఐఎస్ఐ' ఏజెంటుగా పేర్కొంటూ అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ బిజెపి కార్యదర్శి సయంతన్ బసుకు బుధవారం సిపిఎం నేత మహ్మద్ సలీం లీగల్ నోటీసు పంపారు. సయంతన్ బసు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్విట్టర్ ఇండియా ఆయన ట్విట్టర్ ఖాతాను ఇటీవలే మూసివేసింది. ఆయన ఖాతాను మూసివేసి ట్విట్టర్ మంచి పనిచేసిందని సలీమ్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా సలీంపై పరువునష్టం దావా వేయనున్నట్లు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఇటీవల తెలిపారు. ఇటీవల జాదవ్పూర్ యూనివర్సిటీని సందర్శించిన సమయంలో తాను ఒక విద్యార్థినిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడానని సలీమ్ ఆరోపించారని, దీనిపై పరువునష్టం దావా వేయనున్నానని ఆయన అన్నారు.
బాబుల్ సుప్రియో యూనివర్సిటీిలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని సెప్టెంబరు 19న సలీం వెల్లడించారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ ''సుప్రియో విద్యార్ధులనుద్దేశించి వారు పొట్టి దుస్తులు ఎందుకు ధరించారు? యూనివర్సిటీికి ఎందుకు వస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఆయన ఒక విద్యార్థిని దగ్గరకు వెళ్ళి తన గదికి రావాలని కోరాడు. దీంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడ'' ని సలీమ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
దీనిపై సుప్రియో స్పందిస్తూ సలీంపై పరువునష్టం దావా వేస్తానన్నారు. ''సలీం తన అభియోగాలను నిరూపించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవాలి. ఆయన వ్యాఖ్యలు నా గౌరవానికి తగిన విధంగా లేవు'' అని ట్వీట్ చేశారు.
ప.బెంగాల్ బిజెపి కార్యదర్శికి సిపిఎం నేత సలీం లీగల్ నోటీస్
