- గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
- హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఇందుకు నగర ప్రజలందరూ సహకరించాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కోరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు అదనపు సిబ్బందితో పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొన్ని సూచనలు జారీ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేశ్ ఉత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో.. బాణసంచా పేల్చడం, వాటిని ఇతరుల మీదికి విసరేయడం లాంటి చర్యలను పూర్తిగా నిషేధించారు. బాణసంచా పేల్చడం పై ఉత్సవాలు సాగే... సెప్టెంబర్ 2 ఉదయం 6 నుంచి 12 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ముందుగా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి డివిజన్‌లోనూ, ప్రతీ విగ్రహానికీ ఏసీపీ కార్యాలయం నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని చెప్పారు. దానికి సంబంధించి అనుమతి కోరే పత్రాలు ఈ నెల 22 నుంచి 26 వరకు అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు ఈ నెల 29 లోపు సమర్పించాలన్నారు. విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనానికి సంబంధించి పోలీసులు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.
1. విగ్రహ ప్రతిష్టాపన జరిగే స్థలం, సమయం, తేదీతో పాటు నిమజ్జనం చేసే తేదీ, సమయం, వెళ్లే రూట్, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారనే విషయాలను స్పష్టంగా దరఖాస్తులో రాయాలి.
2. పోలీస్ క్లియరెన్స్‌కు దరఖాస్తు చేసేముందు ప్రతిష్టాపన చేసే స్థలానికి సంబంధించి ఆ స్థల యజమాని తో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందుపరచాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఉంటుంది.
3. విగ్రహ ప్రతిష్టాపన స్థలంలో ఎలాంటి వివాద ముండకూడదు. ఏదైనా వివాదముంటే అనుమతి లభించదు.
4. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి. అక్రమ విద్యుత్ వాడకాన్ని అనుమతించం.
5. విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన వివరాలు కూడా ప్రత్యేక దరఖాస్తు ద్వారా సంబంధిత ఏసీపీ లకు తెలియజేయాలి.
6. ఇళ్లలో విగ్రహాలను ప్రతిష్టించే వారికి ఈ నిబంధన లు వర్తించవు. సెల్లార్లలో విగ్రహాలు ప్రతిష్టించి నిమజ్జనానికి తరలించే వారు పోలీస్ క్లియరెన్స్ తీసుకోవాలి.
బలవంతపు చందాలు వద్దు ...
గత అనుభవాల దఅష్ట్యా ఉత్సవాల మాటున అసాంఘిక శక్తులు పేట్రేగిపోయే ప్రమాదం ఉండటంతో బలవంతపు చందాల వసూళ్లపై నిషేధం విధిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. చందాల పేరిట కలహాలకు ఆస్కారముండటంతో.. బలవంతంగా చందాలు వసూళ్లు చేయకూడదని సూచించారు. డొనేషన్, చందా లేదా వేరే ఏ ఇతర పేరుతో పిలిచినా వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తమకు తాముగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే వారికి ఈ నిబంధన వర్తించదని సీపీ తెలిపారు.
గణేశ్ విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి తేదీల ఖరారు
