- చట్టాన్ని క్రిమినలైజ్ చేయడంలో బిజెపి కపటనీతి
- దేశంలో మరేం సమస్యలు లేవా?
- మోడీ సర్కార్‌ను నిలదీసిన సిపిఎం సభ్యుడు ఎ.ఎం ఆరీఫ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
'త్రిపుల్ తలాక్' చట్ట రూపకల్పనలో బిజెపి సర్కారు కపటనీతి దాగి ఉందని సిపిఎం లోక్‌సభ సభ్యుడు ఎ.ఎం ఆరీఫ్ మండిపడ్డారు. అటువంటి సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం ఎందుకు క్రిమినలైజ్ చేస్తుందని ప్రశ్నించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సభలో తొలిరోజునే ఆ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టాల్సిన తొందర ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చిన్న పిల్లలు, మహిళలు, దళితులు, గిరిజనులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని, దానిపై ప్రభుత్వ స్పందన ఏంటని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన సోమవారం సభలో జరిగిన చర్చలో సిపిఎం తరపున ఎ.ఎం ఆరీఫ్ పాల్గన్నారు. కేరళలో శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొని బిజెపి ద్వందనీతి ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. కేరళ ప్రజానీకం ఆరాధ్యదైవంగా భావించే నారాయణ గురుదేవన్ స్ఫూర్తితో ముందుకు వెళ్ళామన్నారు. ఆయన తన జీవితమంతా మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అక్కడ హిందూత్వానికి స్థానం లేదని అన్నారు. తొలి విడతలో మోడీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, . అయినప్పటికీ, కుహనా జాతీయవాదంతో దేశ ప్రజానీకం దృష్టిని మరల్చగలిగారని పేర్కొన్నారు. ఈ విషయంలో బిజెపిని అభినందించ వచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు బిజెపి ఇచ్చిన హామీలను మరచిపోయారని అనుకుంటే పొరపాటేనని అన్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడిన ప్రజలను పుల్వామా దాడి, అటు తరువాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌తో సమర్థవంతంగా పక్కదోవ పట్టించగలిగారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, అయితే రైతాంగానికి మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అయితే ఎన్నికల ముందు మాత్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కొంతమేర ఖర్చు చేసినా, అది రైతు సాగుకు ఎంతమాత్రం సరిపోదని అన్నారు. ఇటువంటివి కంటితుడుపు చర్యలని అభివర్ణించారు. ఇక ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' విధానం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. భారత్ బలమైన రాష్ట్రాలున్న ఒక సమాఖ్యని, అందుకే మన రాజ్యాంగ రాష్ట్రాల హక్కులకు పెద్దపీట వేసినట్లు వివరించారు. అందుచేత, సిపిఎం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం దేశాన్ని అధ్యక్ష తరహా పాలనలోకి తీసుకెళ్ళేందుకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ విధానంతో లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో తమ ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రో ధరల విషయంలో ఎటువంటి భారం వేయలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే, పెట్రో ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన తరుణంలో ఇక్కడ కూడా తగ్గించాలన్న విషయాన్ని విస్మరించి ప్రజలపై భారం వేశారని విమర్శించారు.. దేశంలోని యువత, విద్యార్థులకు ఈ మోడీ సర్కార్ ఏరకమైన భవిష్యత్ ఇస్తుందన్న విషయం రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనలేదని, గత ఐదేళ్ల పాలనలోనూ విద్యారంగానికి నిధులు ఎంతమాత్రం పెంచలేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి అణగారిన వర్గాలకు ఉపయోగపడాలన్నారు. ఈ చర్చను ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ప్రారంభించగా అధిర్ రంజాన్ చౌదరి(కాంగ్రెస్), టిఆర్.బాలు(డిఎంకె), సౌగత్ రారు(టిఎంసి), సెల్వరాజ్(సిపిఐ), మిథున్ రెడ్డి(వైసిపి), మినయక్ రావత్(శివసేన), రాజీవ్ రంజన్ సింగ్(జెడియు), పినాకి మిశ్రా(బిజెడి), డనీష్ అలీ(బిఎస్పీ), నామా నాగేశ్వరావు(టిఆర్ఎస్), ఎ.రామ్‌సింగ్ కోల్హీ(ఎన్సీపి), కున్హలా కుట్టీ(ఐయుఎంఎల్), పి.రవీంద్రనాథ్ కుమార్(అన్నాడిఎంకె), అజం ఖాన్(ఎస్పీ), అసదుద్దీన్ ఒవైసి(ఎంఐఎం) తదితరులు మాట్లాడారు.
'త్రిపుల్ తలాక్'పై సర్కారుకు తొందరెందుకు?
