సీడ్స్‌తో సరికొత్త స్వీట్స్‌..

Feb 4,2024 09:55 #Food, #Sneha
sweets with seeds

‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే నానుడి అందరికీ తెలిసినదే. అయితే ఈ స్పీడు యుగంలో ఏమి తయారు చేసుకోవాలన్నా కాస్త సమయం.. కొంచెం సంయమనం ఉండాల్సిందే. కానీ వర్క్‌చేసి అలసిపోయిన తర్వాత రొటీన్‌ వర్క్‌కు మించి మరొక్క పని చేయలేని పరిస్థితి. మరి అసలు ఆ నీరసం, అలసట రాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు.. చాలా తక్కువ సమయంలోనే పోషకాహారం తయారు చేసుకునేందుకు.. అనేలాంటి చిన్నపాటి ఆలోచనలే ఈ చిరు పదార్థాల తయారీకి మూలం. ఏ స్వీట్‌ తయారుచేయాలన్నా ఆరోగ్యానికి మంచిది కాదనే పంచదార, బెల్లంతోనే చేసుకుంటాం. మరి అవి లేకుండానే చేసుకోవచ్చునైతే..! అలా డ్రై ఫ్రూట్స్‌, డ్రై సీడ్స్‌తో చేసుకునే ఆహారాలు ఉన్నాయి. ఇలా కొన్ని తెలుసుకుంటే మరికొన్ని కొత్త రుచులూ మన ఊహకు అందుతాయి. ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది. మరి ఆ రుచులేమిటో.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

రోల్స్‌..

కావలసినవి : గుమ్మడి గింజలు – 50 గ్రా., వాల్‌నట్స్‌ – 75 గ్రా, గింజలు తీసిన ఖర్జూరాలు – 110 గ్రా., కమలా లేదా బత్తాయి తొక్క తురుము – 2 స్పూన్లు, వేయించిన నువ్వులు – 20 గ్రా

తయారీ : ముందుగా నువ్వులను దోరగా వేయించుకుని ఒక వెడల్పు ప్లేట్‌లో పక్కనుంచాలి. వాల్‌నట్స్‌ను చిన్నగా కట్‌ చేసుకోవాలి. గుమ్మడి గింజలు, వాల్‌నట్స్‌ దోరగా వేయించి, ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. పదిహేను నిమిషాలు నానబెట్టిన ఖర్జూరాలు విత్తనాలు తీసి మిక్సీ పట్టి ఆ ముద్దను, కమలా తొక్క తురుమును కూడా వాటిలో కలిపిన ముద్దను రోల్‌గా తయారుచేయాలి. ఈ రోల్‌కు వేయించిన నువ్వులు అద్దాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసి, సర్వ్‌ చేసుకోవడమే. అంతే బలవర్ధకమైన డ్రైఫ్రూట్‌ రోల్స్‌ తయారయినట్లే.

లడ్డూలు..

కావలసినవి : గుమ్మడి గింజలు – 150 గ్రా., ఖర్జూర – 100 గ్రా, నువ్వులు – 30 గ్రా

తయారీ : ముందుగా గుమ్మడి గింజలు, నువ్వులను విడివిడిగా దోరగా వేయించాలి. ఖర్జూర గింజలు తీసి పక్కనుంచుకోవాలి. వేయించిన గుమ్మడి గింజలు బరకగా మిక్సీ పట్టి, దానికి ఖర్జూర కలిపి మరల మిక్సీ పట్టాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి, నువ్వులు అద్దుకునేలా రోల్‌ చేయాలి. అంతే.. సింపుల్‌ డ్రైఫ్రూట్స్‌ లడ్డూ రెడీ. ఈ పదార్ధాల తయారీలో పైన అద్దేందుకు నువ్వుల స్థానంలో గసగసాలు, డ్రై సీడ్స్‌ పలుకులు, ఎండుకొబ్బరి పొడి ఇలా మన ఇష్టానికి అనుగుణంగా వేటినైనా ఉపయోగించుకోవచ్చు.

కుకీస్‌..

కావలసినవి : నువ్వులు – కప్పు, గుమ్మడి గింజలు- కప్పు, ఖర్జూరపండు గుజ్జు-140 గ్రా, ఉప్పు- చిటికెడు, బటర్‌ పేపర్‌

తయారీ : నువ్వులు, గుమ్మడి గింజలు, మిక్సీ పట్టిన ఖర్జూరపండు గుజ్జు, ఉప్పు అన్నింటినీ బాగా కలిపితే ముద్దగా తయారవుతుంది. దీనిని అప్పాలుగా చేసి బటర్‌ పేపర్‌పై ఉంచాలి. వీటిని ఒవెన్‌ కింది అరలో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ వద్ద 15-20 నిమిషాలు ఉడికించాలి. అంతే యమ్మీయమ్మీ నోరూరించే కుకీస్‌ రెడీ.

అప్పాలు..

కావలసినవి : ఖర్జూరాలు – 200 గ్రా, వేరుశనగ గుళ్ళు – 150 గ్రా, నువ్వులు – 30 గ్రా

తయారీ : నువ్వులు, వేరుశనగ గుళ్ళు వేయించాలి. వేరుశనగ గుళ్లు పొట్టు తీసి, మిక్సీ పట్టాలి. ఖర్జూరాలను పదిహేను నిమిషాలు నానబెట్టి గింజలు తీసి, వేరుశనగ పొడితో కలిపి మిక్సీ పట్టి ముద్దగా తయారుచేయాలి. ఈ ముద్దను చిన్న ఉండలు చేసి చిన్న అప్పాలు చేయాలి. ఒక ప్లేటులో వేయించిన నువ్వులు పరచి అప్పాలకు అద్దాలి. అంతే రుచి.. ఆరోగ్యాన్నిచ్చే డ్రైఫ్రూట్‌ అప్పాలు రెడీ.

 

➡️