ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమానికి 15 వినతులు అందాయి. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్డిఎ పీడీ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యాన డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బూర్జ మండలంలోని పెద్దపేట నుంచి ఎ.రామకృష్ణ నాయుడు ఫోన్ చేసి పాలకొండ ఆంధ్రా బ్యాంకులో ఆధార్ కేంద్రం నిర్వహిస్తున్న జె.శ్రీనివాస్ ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు తీసుకుంటూ... ఆధార్‌లో వయసులను ఎక్కువగా చూపించి పింఛనుకు అర్హులుగా పరిగణిస్తున్నారని, ఈ విధంగా సుమారు 500 మందికి ఆధార్ కార్డులు మంజూరు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రాజాం నుంచి బి.గౌరినాయుడు ఫోన్ చేసి జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల్లో 1, 3 శనివారాల్లో నో బ్యాగ్ డే అమలుకావడం లేదన్నారు. గుర్తింపు లేని పాఠశాలలు చాలా ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజాంలోని ఈశ్వరనారాయణ కాలనీకి చెందిన వి.విజయకుమార్ ఫోన్‌చేసి తమ వార్డులో గృహ స్థలాలకు సంబంధించిన సర్వే మాపింగ్ సక్రమంగా లేదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పలువురు ఫోన్‌చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వివి కృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టరుకు 15 వినతులు
