ప్రజాశక్తి- సీతంపేట
రుణాలు మంజూరు చేయాలని గిరిజనులు పలు వినతిపత్రాలు అందజేశారు. సోమవారం శంకరన్ సమావేశ మందిరంలో పిఒ ఎల్.శివశంకర్ అధ్యక్షతన గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డంగి గ్రామానికి చెందిన కూర్మారావు మేకలు రుణం మంజూరు చేయాలని, చినరాజపురం గ్రామానికి చెందిన సవర సుమన్ చీపుర్లు రుణం మంజూరు చేయాలని కోరారు. సొర్లంగి గ్రామానికి చెందిన లింగమూర్తి జీడిసాగు పనిముట్లు ఇప్పించాలని, కొల్లివలసకు చెందిన గేదెల చిట్టమ్మ తట్టలు, బుట్టలు అల్లుటకు రుణం ఇప్పించాలని విన్నవించారు. సీది గ్రామానికి దుసమయ్య చేపపిల్లల రుణం ఇప్పించాలని, మోహన్‌కాలనీకి చెందిన సవర అడ్డాయి రచ్చబండ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. బక్కిరిపేటకు చెందిన నినత్ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని, దంజుపాయికి చెందిన బిడ్డిక రోజ వినికిడి యంత్రం మంజూరు చేయాలని కోరారు. వజ్జాయిగూడకు చెందిన సరోజిని డైజ్ చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని, పెద్దసంకిలికి చెందిన రాజశేఖర్ కిరాణాషాపు రుణం ఇవ్వాలని విన్నవించారు. డెప్పిగూడకు చెందిన రాజయ్య సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, సవరకురుడింగికి చెందిన యోగేంద్ర నీట్ కోచింగ్ ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
చిన్నతంబయ్యపేటకు చెందిన వెంకటేష్ స్కాలర్షిప్ మంజూరు చేయాలని, అడ్డాయిగూడకు చెందిన రాజేష్ తాగునీటి సదుపాయం కల్పించాలని విన్నవించారు. కోతంగూడకు చెందిన రంగారావు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. దర్బార్‌లో ఇఇ అశోక్, డిఇఇ సింహాచలం, డిడి భవానీశంకర్, ఎఒ ఆనందరావు, ఎపిడి డైజీ, డి.లక్ష్మి, లావేటి రామారావు, డిప్యూటీ డిఇఒ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
మందస మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌కు అధునాతన జిమ్ పరికరాలు ఏర్పాటుకు రూ.2 లక్షల చెక్కును పిఒ ఎల్.శివశంకర్ ఐటిడిఎలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిమ్‌లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసుకుని వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో మందసలో పర్యటించినప్పుడు జిమ్ పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సహాయం చేస్తానని ఇచ్చిన హామీమేరకు రూ.2 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మందస యువకులు యోగేసు, ఐటిడిఎ ఎఒ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
రుణాలు మంజూరు చేయాలని వినతి
