* లోధా సంస్కరణలకు మార్పు
* ఎంఎస్కె ప్రసాద్ సెలెక్షన్ కమిటీకి ముగింపు
* గంగూలీ నేతృత్వంలో తొలి ఎజిఎం
ముంబయి : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా 2024 వరకూ సౌరవ్ గంగూలీ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికైన తర్వాత ఆదివారం తొలిసారిగా బిసిసిఐ సర్వసభ్య సమావేశం (ఎజిఎం) నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ ద్రావిడ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సులపై ప్రధానంగా చర్చ జరిగింది. రెండు పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పిరియడ్), క్రికెట్ సలహాదారుల కమిటీ (సిఎసి) ఐసిసి బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై చర్చ జరిగింది. వీటన్నింటికీ సభ్యులు ఆమోదం తెలిపారు. బిసిసిఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్లపాటు పదవిలో ఉంటే మూడేళ్లపాటు తప్పనిసరిగా విరామం తీసుకోవాలని లోధా కమిటీ పేర్కొంది. ఆదివారం సమావేశంలో లోధా సంస్కరణల మార్పునకు సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ నిబంధన తొలగనుంది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం వేస్త్తే గంగూలీతోపాటు, బిసిసిఐ కార్యదర్శి జై షా కూడా పూర్తి కాలం తన పదవిలో కొనసాగవచ్చు. లోధా నిబంధన ప్రకారం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేయడంతో బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ తొమ్మిది నెలలు మాత్రమే పదవి ఉండాలి. ఇప్పుడు ఈ నిబంధన మార్పుకు ఎజిఎం ఆమోదం తెలపడంతో గంగూలీ 2024 వరకు బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సుప్రీంకోర్టు అమోదమే ఇక మిగిలిఉంది. 'లోధా సంస్కరణల మార్పుకు ఆమోదం తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు ఆమోదించాల్సి ఉంది' అని ఎజిఎం అనంతరం సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎంఎస్కె ప్రసాద్ సెలెక్షన్ కమిటీ పదవీ కాలం ముగింపు
ఆదివారం జరిగిన బిసిసిఐ 88వ సర్వ సభ్య సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెలెక్షన్ కమిటీ పదవీ కాలం నాలుగేళ్లుగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ సెలెక్షన్ కమిటీకి ఐదేళ్లు పదవీ కాలం ఉన్న విషయం తెలిసిందే. దీన్ని నాలుగేళ్లుకు కుదించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎంఎస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసింది. ఎంఎస్కె ప్రసాద్ సెలెక్షన్ కమిటీ 2015లో బాధ్యతలు స్వీకరించింది. ఎంఎస్కె ప్రసాద్ సెలెక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసిన విషయాన్ని గంగూలీ స్వయంగా ప్రకటించారు. ఆదివారం సమావేశం అనంతరం గంగూలీ మాట్లాడుతూ 'సెలెక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసింది. మీకు ఇంక పదవీ కాలం లేదు. వారు సమర్థవంతంగా పని చేశారు' అని తెలిపారు. 'సెలెక్టర్లుకు నిర్థిష్టమైన పదవీకాలాన్ని నిర్ణయించాం. అలాగే ప్రతీ ఏడాది సెలెక్టర్లను నియమించలేం. అని గంగూలీ తెలిపారు.
బిసిసిఐ ప్రతినిధిగా జై షా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కమిటీ సమావేశాల్లో బిసిసిఐ ప్రతినిధిగా జై షా పాల్గొననున్నాడు. ఆదివార సమావేశంలో బిసిసిఐ ప్రతినిధిగా జై షాను ఎంపిక చేశారు. 'భవిష్యత్లో జరిగే ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో బిసిసిఐ ప్రతినిధిగా జై షా పాల్గొంటాడు' అని గంగూలీ చెప్పారు.