* ఫ్లడ్‌లైట్లలో ఎస్జి పింక్ బంతులతో ప్రాక్టీస్
* బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో తొలిటెస్ట్‌కు టీమిండియా సిద్ధం
ఇండోర్: ఈడెన్‌గార్డెన్స్ వేదికగా 22 నుంచి 26 వరకు జరిగే చారిత్రాత్మక డే/నైట్ టెస్ట్ కోసం టీమిండియా పింక్బంతులతో ప్రాక్టీస్‌ను అప్పుడే ప్రారంభించింది. డే/నైట్ టెస్ట్ అలవాటుపడడానికి వీలుగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల క్రింద ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమివ్వాలని కోహ్లీసేన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపిసిఏ)ను మంగళవారం కోరింది. దానికి ఎంపిసిఏ అంగీకరించడంతో టీమిండియా ఆటగాళ్లు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సాధన చేశారు. ఈ సందర్భంగా ఎంపిసిఏ హెడ్ క్యూరేటర్ సమందర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఇండోర్‌లో ఫ్లడ్‌లైట్ల క్రింద ఆటగాళ్లుప్రాక్టీస్ చేయడానికి మమ్మల్ని సంప్రదించగా... కోహ్లీసేనకు పూర్తిగా సహకరిస్తామని మేం చెప్పాం. ఆటగాళ్లు రాత్రిపూట పింక్ బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఫ్లడ్‌లైట్ల క్రింద ప్రాక్టీస్ ఎంతో ఉపయుక్తం కానుందని ఆయన తెలిపారు.
ఇదే విషయంపై టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ... 'ఇదొక కొత్త ఛాలెంజ్. ఈ మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా... ఆటగాళ్లంతా చారిత్రాత్మక టెస్టకోసం ఎదురు చూస్తున్నా'రని చెప్పాడు. మేం రాత్రిపూట కొంతసేపు పింక్ బంతులతో ప్రాక్టీస్ చేస్తే మాకో అవగాహన వస్తుంది. అప్పుడే డే/నైట్ ఆటపై ఒక అంచనాకు రాగలుగుతాం. కొత్త పద్ధతిని అలవాటు చేసుకోవడం ఇబ్బంది కాకూడదు' అని పేర్కొన్నాడు. దులీప్ ట్రోఫీలో ఛటేశ్వర పుజరా పింక్ బంతులతో 2016-17లో మ్యాచ్ ఆడాడు. అది జరిగి చాలా కాలమైంది. అదిప్పుడు కలిసివస్తుందని ఆశించొద్దు. అయితే ఆ అనుభవం మాత్రం మాకు ఉపయోగపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పింక్‌బాల్‌తో ఆడి ఉంటే అవగాహన వస్తుంది. కొన్నిసార్లు ఇది ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు. కాస్త ప్రాక్టీస్ అవసరం. ఒకసారి పింక్‌బాల్‌తో ఆడటం మొదలుపెడితే దానికి అలవాడు పడగలరు. కాబట్టి తొలిసారి డే/నైట్ టెస్ట్ ఆడేముందు... ఇంకొన్ని ప్రాక్టీస్ సెషన్లు అవసరం ఉంది. వీలైనప్పుడల్లా నేను పింక్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తా' అని చెప్పుకొచ్చాడు.
మళ్లీ టాప్‌లో కోహ్లీ, బుమ్రా
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో 895 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో ఉండగా... బౌలర్ల జాబితాలో బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాట్స్మన్ల జాబితాలో రోహిత్ శర్మ(863) రెండోస్థానంలో, బాబర్ అజామ్(పాకిస్తాన్) 834పాయింట్లు, డుప్లెసిస్(ద.ఆఫ్రికా) 820 పాయింట్లు, రాస్ టేలర్(న్యూజిలాండ్) 817 పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నారు.
పింక్ బంతులతో ప్రాక్టీస్...
చారిత్రాత్మక టెస్ట్ బంతుల తయారీదారు అయిన ఎస్జి తన మొదటి బ్యాచ్ పింక్ బంతులను మంగళవారం ప్రాక్టీస్‌కు సిద్ధం చేసింది. డే/నైట్ టెస్ట్‌లకు ఎస్జి పింక్ బంతులను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 11 డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా... కూకబుర్రా లేదా డ్యూక్స్ పింక్ బంతులను ఉపయోగించడం జరిగింది. గతంలో జరిగిన దులీప్ట్రోఫీ సీజన్లో కూడా బిసిసిఐ కూకబుర్రా పింక్ బంతులను ఉపయోగించింది. తయారుదారు మార్పువెనుక ఒక కారణమేమిటంటే.. టెస్ట్ సిరీస్ కోసం ఎస్జి బంతులను ఉపయోగిస్తుండడంతో వేర్వేరు బంతులను ఉపయోగించడానికి బోర్డు ఇష్టపడకపోవడమే. టెస్ట్ సిరీస్ మొత్తం ఒకే బంతులతో ఆడవలసి వుంటుంది ఇది ఒకే సిరిస్‌లో రెండు వేర్వేరు బంతులు కాకూడదు' అని బిసిసి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తొలిటెస్ట్ భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం నుండి ఇండోర్ వేదికగా ప్రారంభం కానుండగా.. రెండోటెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా చారిత్రాత్మక డే/నైట్ టెస్ట్ ప్రారంభమౌతున్న విషయం తెలిసిందే.