* బెంగాల్లో బిజెపి పట్టుకోసమే పదవి
(ప్రజాశక్తి స్పోర్ట్స్‌డెస్క్):
సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షునిగా నామినేషన్ వేయడానికి ముందు ఈ నెల12న (శనివారం) అమిత్ షా కలుసుకున్నారు. ఆ సందర్భంగా అమిత్ షా 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి మద్దతునివ్వాలని గంగూలీని కోరినట్లు తెలిసింది. దీనికి గంగూలీ ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసన్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పేరును అధ్యక్షుడిగా తెరపైకి తెచ్చారు. అయితే బ్రిజేష్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికేందుకు చాలా సంఘాలు వ్యతిరేకించడంతో అమిత్ షా వెనక్కి తగ్గారు. దీంతో గంగూలీ ఒక్కరే అధ్యక్షునిగా రేసులో నిలిచారు. అధికారిక ప్రకటన అక్టోబర్ 23న ప్రకటించనుండగా... గంగూలీ అధ్యక్షునిగా ఎంపికైతే 10 నెలలపాటు మాత్రమే కొనసాగనున్నారు. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు.
ఐసిసిపై పోరాడతా: గంగూలీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అప్పుడే తన ఆట మొదలు పెట్టేశాడు. ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) నుంచి బిసిసిఐకి దక్కాల్సిన వాటాలో భారీగా కోతపడటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓవరాల్‌గా వచ్చే ఆదాయంలో తమకు ఎంత వాటా రావాలో అంత రావాల్సిందేనని ఐసిసికి కచ్చితమైన సందేశాన్ని పంపాడు. కొంతకాలం క్రితంవరకు బిసిసిఐ ప్రపంచక్రికెట్లో ఐసిసి నుంచి భారీ రెవెన్యూను దక్కించుకునేది. అయితే రెండేళ్ల క్రితం నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో భారత క్రికెట్ బోర్డు ఆదాయంలో భారీ కోత పడింది. 2016 నుంచి 2023 వరకూ ఉండే ఎనిమిదేళ్ల పరిధిలో 293 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకోనుంది. అయితే తమ వాటా ప్రకారం బిసిసిఐకి రావాల్సింది దానికి రెట్టింపు అనేది గంగూలీ వాదన. అందుకే ఇప్పుడు ఇదే అంశంపై గంగూలీ దృష్టి పెట్టబోతున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దాదా... తానెప్పుడూ ఈ పదవి గురించి ఆలోచించలేదని, భారత క్రికెట్‌కు తనవంతు కృషి చేయడానికి ఇదో మంచి అవకాశమని చెప్పాడు. ఈ విషయం పట్ల సంతోషంగా ఉన్నాని తెలిపాడు. బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చాడు. నూతన క్రికెట్ కోచ్, సహాయ సిబ్బందితోపాటు బిసిసిఐ అధ్యక్షుడు, ఇతర సభ్యులు రెండేళ్ల వరకూ ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఇప్పటివరకూ అధ్యక్షునిగా పనిచేసిన సికె ఖన్నా రెండేళ్లు బిసిసిఐ అధ్యక్షునిగా కొనసాగారు. అలాగే కొన్నేళ్లుగా ఐసిసి నుంచి బిసిసిఐకి రావాల్సినంతగా డబ్బు రావడం లేదు. ఇప్పుడొచ్చేదానికన్నా ఎక్కువగా వచ్చేందుకు మాకు అర్హతలున్నాయి. ఓవరాల్‌గా ఐసిసికి వచ్చే ఆదాయంలో భారత్ నుంచే 75-80 శాతం వెళుతోంది. మరి దీనికి తగ్గట్టుగానే మాకు పంచాల్సి ఉంటుంది. భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం' అని గంగూలీ తెలిపాడు.
శుభసూచికం: లక్ష్మణ్, సెహ్వాగ్
నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యే సౌరవ్ గంగూలీకి నాటి సహచరులు వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాట్స్ గంగూలీ... నీ నేతృత్వంలో భారత క్రికెట్ మరింత వృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. కొత్త బాధ్యతలో మీరు అన్నీ విజయాలే సాధించాలి' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఇక మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం 'భారత క్రికెట్‌కు ఇది శుభసూచికం. ఇదివరకే టీమిండియాకు ఎనలేని సేవలు అందించిన దాదా కొత్త బాధ్యతల్లో మరింత ముందుకు సాగాలి' అని ఆకాంక్షించాడు.
గంగూలీ ఎంపిక బాగుంది : వినోద్ రాయ్
బిసిసిఐ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ వేయడం తనకు సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వినోద్ రాయ్ దాదా నామినేషన్ వేశాడని తెలిసి మీడియాతో మాట్లాడారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పాలకునిగా, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా పనిచేసిన గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా నియామకం అయితే అది గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇది తనకు ఎంతో సంతోషంగా కూడా ఉందని చెప్పారు. ఐసిసి మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లాల గురించి మీడియా ప్రశ్నించగా ఆయన సరిగా స్పందించలేదు.