- డక్‌వర్త్ పద్ధతిలో పాక్‌పై 89 పరుగులతో ఘన విజయం
- సెంచరీతో కదంతొక్కిన రో'హిట్'
- అర్ధసెంచరీలతో రాణించిన విరాట్, రాహుల్
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా నిర్ణయించారు. పాకిస్తాన్ 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారీ లక్ష్య సాధనకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించారు. భారీ చేధనకు దిగిన పాక్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. 5వ ఓవర్లో ఇమామ్ ఉల్ హక్(7) తొలి వికెట్‌గా అవుటయ్యాడు. ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న విజరు శంకర్ తొలి బంతికే వికెట్ దక్కించుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. ఐదో ఓవర్లో ముందుగా నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్ మైదానం వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయడానికి విజరు శంకర్ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్య తీసి శంకర్ తన సత్తా చాటాడు. ఈ తరువాత ఓపెనర్ ఫఖార్ జామాన్కు బాబార్ అజామ్ జత కలిశాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో 23 ఓవర్లుకు పాక్ స్కోరు 113కు చేరింది. అయితే తరువాత ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ (48) నిష్క్రమించాడు. 26వ ఓవర్లో ఫకర్ జామాన్ (62)ను కూడా కులీదీప్ అవుట్ చేశాడు. తరువాత ఓవర్లోనే 27వ ఓవర్లో చివరి రెండు బంతులకు మహమ్మద్ హఫీజ్ (9), షోయబ్ మాలిక్ (0)ను హార్థిక్ అవుట్ చేశాడు. తరువాత 35వ ఓవర్లో కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (12)ను విజరు శంకర్ బౌల్డ్ చేశాడు. దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి పాక్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయంతో పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లుకు 302గా నిర్ణయించారు. అంటే మిగిలిన 5 ఓవర్లలో 130 పరుగులు చేయాలి. పాకిస్తాన్ 46 పరుగులు మాత్రమే చేసింది.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బాట్స్మెన్ సత్తా చాటారు. రోహిత్ శర్మ సెంచరీతో (140 పరుగులు, 113 బంతుల్లో మూడు సిక్స్‌లు, 14 ఫోర్లు) కదం తొక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (77 పరుగులు, 65 బంతుల్లో ఏడు ఫోర్లు), కెఎల్ రాహుల్ (57 పరుగులు, 78 బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు) అర్థ సెంచరీ లతో విజృంభించారు. హర్థిక్ పాండ్య (26 పరుగులు, 19 బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు) మెరుపులకు తోడు చివరిలో విజరు శంకర్ (15 పరుగులు, 15 బంతుల్లో ఒక ఫోరు), కేదార్ జాదవ్ (9 పరుగులు, ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు) రాణించారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో 46.4 ఓవర్ల వద్ద వర్షం సుమారు 40 నిమిషాలు సేపు ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం తరువాత మళ్లీ ఆటను కొనసాగించారు.
రోహిత్ జోరు
ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్-రాహుల్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆరంభం నుంచే పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఒకవైపు రాహుల్ ఇబ్బంది పడుతుంటే, రోహిత్ మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. దీంతో తొలి 10 ఓవర్లలో భారత్ స్కోరు 53 పరుగులు. 12వ ఓవర్లో మొత్తంగా 17 పరుగులు వచ్చాయి. షెహదాబ్ వేసిన ఈ 12ఓవర్లో చివరి బంతికి బౌండరీ సాధించిన రోహిత్ అర్ధశతకం చేరుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87. 20 ఓవర్లుకు స్కోరు 105 పరుగులు. 22వ ఓవర్లో రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. కానీ 24వ ఓవర్లో వాహబ్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో బాబర్ చేతికి చిక్కాడు. 78 బంతులు ఆడిన రాహుల్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లుతో 57 పరుగులు చేశాడు. రోహిత్-రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించింది. రాహుల్ అవుట్‌తో రోహిత్‌కు కోహ్లి జతకలిశాడు. 30ఓవర్లో రోహిత్ శతకం అందుకున్నాడు. అది కూడా కేవలం 85బంతుల్లోనే (9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రోహిత్ సెంచరీ పూర్తికావడం విశేషం. 30 ఓవర్లకు భారత్ స్కోరు వికెట్ నష్టానికి 172. సెంచరీ తరువాత కూడా రోహిత్ దూకుడుగా ఆడాడు. దీంతో 38 ఓవర్లుకు భారత్ స్కోరు 230 పరుగులు. అయితే తరువాత ఓవర్లోనే హసన్ బౌలింగ్‌లో రోహిత్ వెనుదిరిగాడు. జట్టు స్కోరు 234 పరుగుల వద్ద రోహిత్ రెండో వికెట్‌గా అవుటయ్యాడు. 113 బంతులు ఎదుర్కొన్న రోహిత్ మూడు సిక్స్‌లు, 14 ఫోర్లతో 140 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది రెండో శతకం. రోహిత్‌కు మొత్తంగా వరల్డ్‌కప్‌లో మూడో సెంచరీ. అలాగే పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. 2011 కప్‌లో పాక్‌పై విరాట్ కోహ్లి సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 24వ శతకం.
రోహిత్ అవుట్‌తో కోహ్లికి హర్థిక్ పాండ్య జతకలిశాడు. కోహ్లి-ప్యాండ దూకుడుతో 43వ ఓవర్లకు భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 274కు చేరుకుంది. అయితే తరువాత ఓవర్లో అమిర్ బౌలింగ్‌లో బాబర్ అజామ్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్య అవుట్ అయ్యాడు. 19 బంతులు ఆడిన పాండ్య సిక్స్, రెండు ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ఈ దశలో వచ్చిన ధోని (2 బంతుల్లో 1 పరుగు) నిరాశపర్చాడు. 47వ ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగిచింది. 48వ ఓవర్లో కోహ్లి అవుటయ్యాడు. కోహ్లి అవుట్‌తో విజరు శంకర్‌కు జాదవ్ జతకలిశాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
పాక్‌పై అత్యధిక భాగస్వామ్యం
ఆదివారం పాక్ మ్యాచ్‌లో భారత్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్‌లు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 1996 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్-నవజ్యోత్ సిద్ధూలు 90 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే ఇప్పటివరకూ పాక్‌పై వరల్డ్‌కప్‌ల్లో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. దాన్ని 23 ఏళ్ల తర్వాత రోహిత్-కేఎల్ రాహుల్ సవరించారు.
మాంచెస్టర్‌లో అత్యధిక స్కోరు
ఆదివారం మ్యాచ్ జరిగిన ఓల్డ్ ట్రెఫోర్డ్ స్టేడియంలో అత్యధిక స్కోరు (336) నమోదయింది. ఈ స్టేడియం లో ఇప్పటి వరకూ అత్య ధిక స్కోర్ ఇంగ్లాండ్ (318/7) పేరు మీద ఉంది.
అత్యంత వేగంగా 11 వేల పరుగులు
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి వన్డేల్లో 11 వేల పరుగులును పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా (222 ఇన్నింగ్స్‌ల్లో) 11వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా కోహ్లీ కొత్త చరిత్ర నెలకొల్పాడు. నేటి మ్యాచ్‌లో హసన్ ఆలీ వేసిన 45ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించి విరాట్ ఈ రికార్డును చేరుకున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో 11వేలు పరుగులు పూర్తి చేసు కున్న తొమ్మిదో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. 11 ఏళ్లలోనే కోహ్లి 11 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం. గతంలో సచిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులకు చేరుకోగా. కోహ్లీ అతడి కంటే 54 ఇన్నింగ్స్‌ల ముందే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల, 9 వేల, 10 వేలు పరుగులు రికార్డులు కూడా కోహ్లీ పేరు పైనే ఉన్నాయి.
కోహ్లి నాటౌట్..?
ఆదివారం మ్యాచ్‌లో కోహ్లి స్వీయ తప్పిదం కారణంగా అతని వికెట్‌ను చేజార్చుకున్నాడు. 48 ఓవర్లో మహ్మద్ ఆమిర్ నాలుగో బంతిని బౌన్సర్‌గా వేశాడు. దాన్ని కోహ్లి హుక్ షాట్‌కు ప్రయత్నించగా, అది కాస్తా మిస్ అయ్యి కీపర్ సర్ఫరాజ్ చేతుల్లోకి వెళ్లింది. కోహ్లి అవుట్‌కు సర్ఫరాజ్ బలంగా అప్పీల్ చేయకపోయినా, అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మాత్రం పెవిలియన్ బాట పట్టాడు. అయితే అది అవుట్ కాదని టీవీ రిప్లేలో స్పష్టంగా తేలింది. అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మైదానాన్ని వీడటం చర్చనీయంగా మారింది. బ్యాట్ హ్యాండిల్ బలహీనంగా ఉన్న కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు.
సిక్స్ల్లో ధోనిని దాటి...
ఆదివారం మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై రోహిత్ శర్మ మూడు సిక్స్‌లు సాధించాడు. దీంతో ఇప్పటివరకూ మహేంద్రసింగ్ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో(అన్ని ఫార్మాట్ లలో కలిపి) భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్ గా ధోనీ(355) పేరుతో ఉన్న రికార్డును తాజా గా పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ (358) అధిగమించాడు. భారత బ్యాట్స్మెన్ల అత్యధిక సిక్స్‌ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (264), యువరాజ్ సింగ్(251), సౌరవ్ గంగూలీ(247), వీరేంద్ర సెహ్వాగ్(243) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ధోని @ 341
ఆదివారం మ్యాచ్‌తో మహేంద్ర సింగ్ ధోని 341 అంతర్జాతీయ వన్డేలను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచంలో అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత్చే చెందిన సచిన్ 463 వన్డేలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌తో ధోని రాహుల్ ద్రావిడ్ (340 వన్డేలు)ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు.
పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆట గాడిగా రోహిత్ గుర్తిం పు పొందాడు. ఆది వారం మ్యాచ్‌లో రోహిత్ 140 పరు గులు చేశాడు. పాక్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు సైమండ్స్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. 2003 కప్‌లో పాక్‌పై సైమండ్స్ అజేయంగా 143 పరుగులు చేశాడు.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) బాబర్ అజామ్ (బి) వహబ్ రియాజ్ 57, రోహిత్ శర్మ (సి)వహబ్రియాజ్ (బి) హసన్ అలీ 140, కోహ్లి (సి) సర్ఫరాజ్ అహ్మద్ (బి) మహమ్మద్ అమిర్ 77, హర్థిక్ పాండ్య (సి) బాబర్ అజామ్ (బి) మహమ్మద్ అమిర్ 26, ధోని (సి) సర్ఫరాజ్ అహ్మద్ (బి) మహమ్మద్ అమిర్ 1, విజరు శంకర్ నాటౌట్ 15, కేదార్ జాదవ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం 336/5 (50 ఓవర్లు)
వికెట్ల పతనం : 1-136, 2-234, 3-285, 4-298, 5-314.
బౌలింగ్ : మహమ్మద్ అమిర్ 10-1-47-3, హసన్ అలీ 9-0-84-1, వహబ్ రియాజ్ 10-0-71-1, ఇమాద్ వసీమ్ 10-0-49-0, షదాబ్ ఖాన్ 9-0-61-0, షోయబ్ మాలిక్ 1-0-11-0, మహమ్మద్ హఫీజ్ 1-0-11-0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ : ఇమామ్ ఉల్ హక్ ఎల్బీ శంకర్7, ఫకార్ జమాన్ (సి) చాహల్ (బి) కుల్దీప్ 62, బాబర్ అజామ్ (బి) కుల్దీప్ 48, మహమ్మద్ హఫీజ్ (సి) శంకర్ (బి) పాండ్య 9, సర్ఫరాజ్ అహ్మద్ (బి) శంకర్ 12, షోయబ్ మాలిక్ (బి) పాండ్య 0, ఇమాద్ వాషీమ్ నాటౌట్ 46, షబాద్ ఖాన్ నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు 5 మొత్తం 212/6 (40 ఓవర్లు)
వికెట్ల పతనం : 1-13, 2-117, 3-126, 4-129, 5-129, 6-165
బౌలింగ్ : భువనేశ్వర్ 2.4-0-8-0, బుమ్రా 8-0-52-0, విజరు శంకర్ 5.2-0-22-2, హర్థిక్ పాండ్య 8-0-44-2, కుల్దీప్ యాదవ్ 9-1-32-2, చాహల్ 7-0-53-0