సిడ్నీ : ఆస్ట్రేలియాలోని స్పార్టన్ స్పోర్ట్స్ బ్యాట్ల తయారీ కంపెనీపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కోర్టులో దావా వేశారు. సదరు కంపెనీ తమ ఉత్పత్తుల కోసం తన పేరును వాడుకుందని కానీ అందుకు సంబంధించిన రాయల్టీ మాత్రం చెల్లించలేదని సచిన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న స్పార్టన్ స్పోర్ట్స్ అనే సంస్థ 2016లో సచిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు సచిన్‌కు చెల్లించాలి. కానీ 2018 నుంచి తనకు రావాల్సిన రెండు మిలియన్ డాలర్ల రాయల్టీ ఆ కంపెనీ తనకు చెల్లించలేదని సచిన్ ఆ ఫిర్యాదులో తెలిపారు. దీనిపై సంస్థ యాజమాన్యానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదని సచిన్ వివరించారు. దీంతో తన పేరును వాడుకోవడం ఆపేయాలని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కంపెనీకి తెలియజేశానన్నారు. అయినా వారు తన పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదులో వివరించారు. దీంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా, సచిన్ వేసిన దావాపై ఆ కంపెనీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
స్పార్టన్ స్పోర్ట్స్‌పై సచిన్ దావా
