ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కార్పొరేషన్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మూడురోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన 450 మంది క్రీడాకారుల్లో 16 ఏళ్లలోపు వయస్సు కలిగిన బాలబాలికలు సబ్ జూనియర్ కేటగిరిలోనూ, 19 ఏళ్లలోపు బాలబాలికలకు జూనియర్ కేటగిరీల్లోనూ సెమీఫైనల్, ఫైనల్ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీల్లో బాలురకు ఫ్రీస్టైల్, గ్రీక్ రోమన్ స్టైల్, బాలికలకు ఫ్రీస్టైల్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అల్రౌండ్ ఛాంపియన్షిప్లను అందజేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సబ్ జూనియర్స్‌లో ఒకరు, జూనియర్స్‌లో ఒకరు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే పోటీల్లో నైపుణ్యతను కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుస్తీ జట్టుగా సబ్ జూనియర్స్ నుంచి 30 మందిని, జూనియర్స్ నుంచి 30 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన సబ్ జూనియర్స్ జట్టును ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు కటక్‌లో జరిగే ఆల్ ఇండియా రెజ్లింగ్ టోర్నమెంట్‌కు, జూనియర్స్ జట్టును ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా రెజ్లింగ్ టోర్నమెంట్‌కు పంపనున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఇన్‌ఛార్జి విసి సుంకరి రామకృష్ణారావు, రెక్టార్ ఆచార్య పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్ ఆచార్య ఎస్.టేకికి నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు
ముగిసిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు
