- 85 ఓవర్లలో 186 పరుగులే
- కుక్, అలీ అర్థసెంచరీలు
- ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ నత్త నడకలా సాగింది. తొలి రెండు సెషన్లలో రాణించని బౌలర్లు మూడు, నాల్గో సెషన్లలో విజృంభించారు. దీంతో కడపటి వార్తలందే సమయానికి 85 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదటగా బ్యాటింగ్‌కు దిగగా... ఆఖరి టెస్ట్ ఆడుతున్న అలెస్టర్ కుక్, జెన్నింగ్స్ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగుల విలువైన భాగ స్వామ్యాన్ని నిర్మించింది. రవీంద్ర జడేజా 24వ ఓవర్లో వీరి భాగస్వామ్యన్ని విడదీశాడు. మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మొయిన్ ఆలీ, కుక్ల జోడీ భోజన విరామా నికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో ఆతిథ్య జట్టు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేయగల్గింది. ఈ క్రమంలో అరంగేట్రం ఆట గాడు హనుమ విహారి కూడా ఒక ఓవర్ వేయాల్సి వచ్చింది.
రెండు క్యాచ్‌లు వృథా
లంచ్ అనంతరం కోహ్లీసేన రెండు విలువైన క్యాచ్‌లను జారవిడిచింది. ఇషాంత్ శర్మ వేసిన 30.5వ ఓవర్లో కుక్(38) బ్యాట్ అంచుకు తాకిన బంతి స్లిప్‌లో ఉన్న ఫీల్డర్వద్దకు వెళ్లగా ఆ బంతిని అందుకునే క్రమంలో ఇరువురు గందరగోళానికి గురై రహానె క్యాచ్‌ను జారవిడిచాడు. ఆ తర్వాత 31.2వ ఓవర్లో మొయిన్ అలీ(8)కి కూడా జీవనదానం లభించింది. బుమ్రా ఓవర్లో అలీ బ్యాట్‌కు తాకి స్లిప్లోకే వెళ్లగా కోహ్లీ చేతిలోంచి జారి కిందపడింది. దీంతో కుక్, ఆలీలకు జీవనాధారం లభించడంతో వీరిద్దరూ ఆ తర్వాత అర్ధసెంచరీలతో చెలరేగారు.
బుమ్రా మాయ...
టీ విరామానికి ముందు ఇంగ్లండ్ వెంటవెంటనే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. అర్ధశతకం సాధించి శతకం వైపు పయనిస్తున్న అలిస్టర్ కుక్(71) ను బుమ్రా 63.2వ బంతికి క్లీన్ బౌల్డ్ చేయగా... అదే ఓవర్ ఐదో బంతికి జో రూట్‌ను ఎల్‌బిగా పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ 64.4వ బంతికి జానీ బెయిర్ స్టోను డకౌట్చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేశాడు. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు 59 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసి పటిష్టంగా ఉన్నా... 65 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని అశ్విన్‌ను తొలిగించి జడేజాకు అవకాశం కల్పించారు.
విహారి అరంగేట్రం
కాకినాడ కుర్రాడు హనుమ విహారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగిన కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారిని, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాలను తుదిజట్టులో స్థానం కల్పించింది. టెస్ట్‌మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి యువ ఆటగాడు విహారికి క్యాప్ అందజేయగా... జట్టు సభ్యులు చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. టీమిండియాకు మరో బ్యాట్స్‌మన్ అవసరమని భావించిన జట్టు యాజమాన్యం కరణ్ నాయర్‌ను పక్కన పెట్టి మరీ విహారికి అవకాశం కల్పించడం విశేషం. దీంతో విహారి భారత్ తరపున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన 292వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.