కరాచీ: పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ట్విటర్లో అక్మల్ పెట్టిన ఓ ఫొటోనే ఇందుకు కారణం. ఫిట్నెస్ మెరుగుపరుచుకునే క్రమంలో అక్మల్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో శిక్షణ పొందుతున్నాడు. తాజాగా అక్మల్ ఖరీదైన బెంట్లీ కారుతో దిగిన ఫొటోని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఎంతో కఠినమైన శిక్షణ అనంతరం లండన్లో ఎంజాయ్ చేస్తున్నాను’ అని అక్మల్ ఫొటో కింద పేర్కొన్నాడు.
అనంతరం అభిమానుల నుంచి అక్మల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. నువ్వు కష్టపడుతున్నావా? అని ఒక అభిమాని పేర్కొనగా, ‘బెంట్లీ కారు కొనేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇది నీ కారు కాదు. ఇతరుల కారు వద్ద నిల్చుని ఫొటో దిగావు’, ‘భవిష్యత్తులో క్యాబ్ డ్రైవర్గా స్థిరపడేందుకు శిక్షణ పొందుతున్నావా, ప్రస్తుత జట్టులో నువ్వు లేవు’, ‘క్రికెట్ పై దృష్టి పెట్టి జట్టులో స్థానం సంపాదించు’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అక్మల్ ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘నా అభిమానులందర్నీ ప్రేమిస్తున్నాను. మీ అందరికీ ఒక విన్నపం. దయచేసి నాపై నెగిటివ్ కామెంట్లు ఆపండి. మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో అవసరం’ అని పేర్కొన్నాడు.