మహారాష్ట్రలోని జాల్గాన్లో చెందిన చెత్త ఏరుకునే వీధి బాలలు మత్తు మందుకు బానిసలయ్యారు. అంతా పదిహేను ఏళ్ల లోపువాళ్లే..! కొందరి సొంత లాభం కోసం ఆ వీధి బాలలను మత్తులో దించి ఆ చెత్తతో వారు వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన అద్వైత్ దండ్వాట్ (29) ఈ దుస్థితికి కదిలిపోయాడు. అంత చిన్న వయసు పిల్లలు తన కళ్ల ముందు మత్తు మందుకు బానిసలవ్వడాన్ని చూసి బాధపడ్డాడు. భార్య ప్రణాలి సిసోడియాతో కలిసి వారి బాగోగుల్ని తమ బాధ్యతగా తీసుకున్నాడు. అలా ఆ చిన్నారులకు ఆప్తమిత్రుల్లా మారారు. నేడు 120 మంది వీధి బాలలు విద్యా బాటలో నడుస్తూ కొత్త బంగారు లోకాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారి చేతులు అక్షరాల్ని ఏరికూర్చి అందమైన పదాలు అల్లుతున్నారు.
అద్వైత్ ఎంబిఏ పూర్తిచేసి పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. తన భార్యతో కలిసి అదే జిల్లాలో ఉంటున్న వీధి బాలలందరినీ ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి కోసం 2013లో వర్థిష్ణు (Vardhishnu) అనే పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ నిరుపేద వీధి బాలలకు ఆసరాగా నిలిచి తమ జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించు కున్నారు.
ఓ సాయమే ప్రేరణ
అద్వైత్కు ప్రేరణ డాక్టర్ అభరు. అద్వైత్కు సమాజం పట్ల తనకున్న బాధ్యతను గ్రహించడంలో అతనికి సహాయపడిన వ్యక్తి అభరు. సెర్చ్ (ూజుA=జన) (సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్) వంటి కార్యక్రమాలకు బాధ్యత వహించిన సామాజిక కార్యకర్త డాక్టర్ అభరు బ్యాంగ్. సెర్చ్ ద్వారా మహారాష్ట్రలో శిశుమరణాల రేటు క్షీణింపచేయడంలో విజయవంతమైన ఈ ప్రాజెక్టుకు అద్వైత్ తనవంతు కృషిని అందజేశారు. ఆ తర్వాత వీధి బాలల గురించి ఈ ఆలోచన ముందుకు రావడానికి ఆ కృషే ప్రధాన కారణంగా నిలిచింది.
ఆనంద నిలయంగా...
ఈ సంస్థ ఆ పిల్లల విద్యా, ఆరోగ్య సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందుకు ముందుగా ఆ పిల్లలను మత్తు మందు నుంచి విముక్తి పొందేందుకు అనుభవం ఉన్న డాక్టర్లను సంప్రదించి హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఇలా నెల రోజులపాటు వారిని మామూలు స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు. పిల్లలకు ప్రాథమిక విద్యను అందించేందుకు ముందుగా 'ఆనంద్ ఘర్' అనే సంస్థను కలిసి వారి సహకారాన్ని తీసుకున్నారు. ఆ సంస్థ నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రణాలినే చూస్తారు. విద్యను అందించేందుకు మూడు గ్రూప్‌లుగా వర్గీకరించారు. పిల్లలను 5 నుంచి 12, 13 నుంచి 15 ఆపైన వయసు వారికి బోధనను అందిస్తున్నారు. పిల్లలు పగలంతా ఆ ఆవరణంలోనే విద్యను అభ్యసిస్తుంటారు. మాట్లాడే భాష, క్రమశిక్షణ వంటివి అలవరుస్తున్నారు.
మరో 12 మంది మిత్రుల తోడు..
అద్వైత్ పారిశ్రామిక వేత్త కావడం వల్ల మరి కొందర కంపెనీలను ఆశ్రయించి ఆ సంస్థకు ఆర్థిక, మానవ వనరులను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం వర్థిష్ణు సంస్థలో అద్వైత్, ప్రణాలితో పాటు 12 మంది మిత్రులు కలసి బృందంగా ఏర్పడి కృషి చేస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు పూర్తి సమయం కేటాయిస్తారు, ముగ్గురు పార్ట్‌టైమ్‌గా విద్యను బోధిస్తుంటారు. ఒక వైద్యులు, ఇద్దరు ఆయాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. గత ఐదేళ్లుగా ఈ బాలలకు విద్యను, ఆరోగ్యాన్ని, క్రమశిక్షణని అందిస్తోంది. 15 మంది వీధి బాలలతో ప్రారంభమై ప్రస్తుతం 120 మందికి చేరి విద్యను అందిస్తోంది ఈ సంస్థ.
వనరులను సమకూరుస్తూ...
ఆ వీధి బాలల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వారికి మధ్యాహ్న సమయాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అందుకోసం ఓ వ్యక్తిని నియమించి అక్కడే వండించి, మధ్యాహ్నం చపాతి, పప్పు, ఒక గుడ్డు ప్రతి పిల్లలకు అందజేస్తున్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం సాగుతోంది. ఆ ఆవరణంలో మరింత మెరుగైన సౌకర్యాలను అందజేయడానికి సంస్థ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తోంది. దీని ద్వారా వారికి అవసరమైన క్రీడా పరికరాలు, దుస్తులు, షూష్‌ను అందించనున్నారు. సామాజిక మార్పు కోసం ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా వీధి బాలలకు మెరుగైన జీవితాన్ని అందిస్తోన్న వీరి కృషి ఎందరికో ప్రేరణగా నిలవాలని కోరుకుందాం..! విద్యను అందిస్తోన్న ఆ ఆవరణంలోకి జాల్గాన్లోని ఉన్న మరిందరు వీధి పిల్లలూ అడుగుపెట్టి భవితను తీర్చిదిద్దుకోవాలని ఆశిద్దాం..!