నగరాల్లో కాలుష్యం రోజురోజుకీ ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆక్సీజన్‌ని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారంటే కాలుష్యం తీవ్రత ఎంతనేది అర్థం చేసుకోవచ్చు. అసలు ఇలాంటి పరిస్థితులకి కారణం నగరాల్లో రోజురోజుకీ పెరుగుతులన్న వాహనాలే అనేది ఒక నివేదిక ఢిల్లీలో ఇప్పటికే ఈ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో 2014 నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో వుంది మన దేశ రాజధాని ఢిల్లీ. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు షట్ల్ మినీ బస్ ఆలోచనతో ముందుకొచ్చారు ఢిల్లీకి చెందిన ఇద్దరు ఐఐటి పూర్వ విద్యార్థులు. ఆ వివరాలేంటో మీరూ తెలుసుకోండి.
ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్, దీపాంశు మాల్వియా ఇద్దరూ ఐఐటి కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దేశంలోనే పేరొందిన ఒక ఈ కామర్స్ కంపెనీలో మేనేజింగ్ విభాగంలో ఉద్యోగం దక్కింది ఇద్దరికీ. వేలల్లో జీతం. జీవితంలో ఒక్కొక్కొరిదీ ఒక్కో లక్ష్యం. డబ్బు సాధించడం ఒకరి కలైతే మరొకరికి పేరు పరపతిని పొందడం, అందరికంటే భిన్నంగా ఏదో ఒకటి చేయాలనేది ఇంకొందరి తపన. డబ్బులు సంపాదించి ఒక సొంత కంపెనీ మొదలు పెట్టాలని అనుకున్నాడు అమిత్ సింగ్. ఈ కామర్స్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కస్టమర్స్ ఆర్డర్స్‌ని అందించడంలో టైమ్సెన్స్తో పాటు కస్టమర్ల అవసరాలనీ తెలుసుకోగలిగాడు. ఢిల్లీ లాంటి నగరంలో తక్కువ సమయంలో కాస్త సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారు ఎక్కువనే విషయం అర్థమయ్యింది తనకి. అప్పుడే సొంతగా ఓ ట్రాన్స్పోర్ట్ బిజినెస్‌ని మొదలు పెట్టాలనే ఆలోచన తట్టింది ఇద్దరికీ. అప్పటికే నగరంలో వోలా, ఉబెర్ సేవలు ఊపందుకు న్నాయి. అలాంటి పరిస్థితుల్లో రవాణా రంగంలో ప్రయివేటు వాహనాల పోటీని తట్టుకొని నిలబడడం అంటే అంత తేలికేంకాదు. అలాంటి పరిస్థితుల్లో అమిత్‌కి ఓ కొత్త ఆలోచన మొదలయ్యింది. మనదేశంలో తమలాంటి యువతంతా వ్యాపారం, డబ్బు గడించడం వైపే దృష్టిపెడుతోంది. అయితే సామాజిక సమస్యలనీ పరిష్కరించే దిశగా ఒక కొత్త ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాలనుకున్నాడు అమిత్. ఢిల్లీలో అప్పటికే వందల సంఖ్యలో క్యాబ్ సర్వీసులన్నీ ప్రయాణీకులకి చాలా అందుబాటులో ఉన్నా యి. అయితే ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం. ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే వాహనాలని తగ్గించి ఎక్కువమంది ప్రయాణించేలా చేయాలనే ఆలోచన తట్టింది. అలా ఎక్కువమంది ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించేలా ఏప్రిల్ 2015లో షట్ల్ మినీ బస్ సేవలు మొదలయ్యాయి. అందుకోసం 20 నుండి 40 సీట్లు కలిగుండే వాహనాలని అద్దెకు తీసుకున్నారు. ఇప్పుడు ప్రయాణీకులని ఎంచుకోవడం వీళ్ళ లక్ష్యం ఎందుకంటే ఈ సేవలన్నీ మామూలు క్యాబ్ సర్వీసుల్లా కాదు. ప్రయాణంతో పాటు కాలుష్యాన్నీ వీలైనంతగా తగ్గించడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశం. అందుకోసం నెలలో దాదాపు 20 రోజులు ట్యాక్సీల్లో ప్రయాణించేవారి వివరాలను సేకరించారు. అలాంటి వారిని కలిసి కాలుష్యంపై అవగాహన కల్పించడంతోపాటు షుట్టి సేవలని వినియోగించుకునేలా చేయడానికి కాస్త సమయం పట్టింది. అన్నింటికంటే మార్కెట్లో అప్పటికే వున్న వాహనాల పోటీని తట్టుకుంటూ ఇలాంటి సేవలు చేయడం పెద్ద సవాలులా నిలిచింది. అయితే ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఢిల్లీలోని అత్యంత కాలుష్య ప్రాంతాల్లో అవగాహనా సదస్సులని నిర్వహించేవారు. అలా కొన్నాళ్ళకి షట్ల్ సేవలు ఎక్కువ మందికి చేరువ కాగలిగాయి. ప్రయాణీకులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వుండేలా విశాలమైన సీటింగ్‌తో పాటు తగినంత గాలి, వెలుతురు చొరబడేలా రూపుదిద్దారు. టికెట్ చార్జీలు కూడా కాస్త తక్కువే కావడంతో సామాన్యులకి కూడా ఇవి చేరువయ్యాయి. ఇక తర్వాతి ప్రాజెక్ట్ సొంతకార్లలో వెళ్ళే వాళ్ళని సైతం ఇలా ఒకే బస్సులో ప్రయాణించేలా చేయడం. మొదట్లో అమితాబ్ దీపాంశులకి ఇది తలపట్టుకు నేలా చేసింది. అయితే పర్యావరణ పరిరక్షణపై పదే పదే అవగాహన కల్పించడంతో కొంతమంది ఈ బస్సుసేవలని ఉపయోగించు కునేందుకు ముందుకురావడం ఓ మంచి పరిణామం.. ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ మార్గాల్లో 75కు పైగా సాధారణ బస్సులతోపాటు 450 ఎసి బస్సులు నడుస్తున్నాయి. రోజుకి 300 పికప్ పాయింట్స్‌తో దాదాపు 20000 సార్లు నగరంలో షట్ల్ బస్సుసేవలని నిర్వహిస్తున్నారు. అలా ఢల్లీీలో కాలుష్య తీవ్రతని తగ్గించడంలో వీళ్ళు కృషి మంచి ఫలితాల నిచ్చింది. 2016 నాటికి కాలుష్య కారక నగరాల్లో ఢిల్లీ పదకొండవ స్థానానికి చేరుకుందంటే వీళ్ళ కృషి కూడా ఉందనేది కాదనలేం.
- శర్వాణి
