మార్కెట్లో దొరకడుగానీ
తూకంతో తూగుతాడు
ఇంటికాళ్లకు చెప్పులవుతాడు
ప్రతిపూటా నాలుగు గిద్దల బియ్యమవుతాడు
కాసేపాగితే నాన్నొస్తాడని అమ్మ భయపెట్టడం ఉత్త అబద్దం
నిన్నూ, నన్నూ ముద్దుపెట్టుకోవడం కోసం మొదటిసారి మీసాలు తీశాడు
మనం నిద్దురపోతున్నప్పుడు కోపాన్ని మింగటం నేర్చుకున్నాడు
ప్రపంచమంతా గుండె గుప్పెడే ఉంటుందంటారు
నువ్వసలు నమ్మకు
నాన్న గుండె మాత్రం ఇల్లంత ఉంటుంది
నీకెప్పుడన్నా కవిత్వం రాద్దామనిపిస్తే
నాన్న పేరో పదిసార్లు రాయి
ఆ కాగితం ఎందుకు కవిత్వం కాదో చూద్దాం
నాన్న మనలోకి ప్రవహిస్తాడు
నది పాయలై చీలడం చూసుంటావు కానీ
నది పాయలో కలవడం ఇక్కడే చూస్తావు
బాధల పుస్తకానికి నవ్వుల అట్టేసుకుంటాడు
ఓ ఇంటికి తనను తాను కట్టేసుకుంటాడు
నాన్నిచ్చిన నోట్లపై గాంధీ ఉండటం బానే ఉంది కానీ
నాన్నే ఉండుంటే ఇంకెంత బావుండేదో కదూ...
నాకు తెలిసీ నాన్నంటే
చెమట చుక్క దేహం
ఆకలే తెలియని శ్రామికుల సమూహం
నాన్నలకు ఆకలవ్వదని గిన్నిస్‌బుక్‌లో ఎలానూ రాయలేదు
కనీసం గుండెల మీద రాసుకుందాం
నాన్నలూ, వాళ్ల నాన్నలూ అసలు నాన్నలంతా
యుద్ధం కోసం సిద్ధం చేయబడ్డ ప్రేమలనీ
నగ స్వేద బిందువుల సమూహమనీ రాసుకుందాం...
- సిద్దార్థ కట్టా
9642108756
నాన్న.. చెమట చుక్క దేహం (కవిత)
