కావాల్సిన పదార్థాలు
పచ్చి మామిడి ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు
వేప పువ్వు - 1 టేబుల్ స్పూన్
నీరు - 1 1/2 కప్పు
బెల్లం- 3 టేబుల్ స్పూన్లు
ఎండు కారం పొడి- 1 టేబుల్ స్పూన్
చింత పండు గుజ్జు- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చింత పండును అర కప్పు నీటిలో నానబెట్టాలి. వేప పువ్వును వలిచి పక్కన పెట్టుకోవాలి. మామిడి కాయలను చిన్న సన్న ముక్కలుగా తరగాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా లేదా పొడి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింత పండును గుజ్జుగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో తరిగిన మామిడి ముక్కలు, బెల్లం వేసి
బాగా కలుపుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, వేప పువ్వు వేసి మరోసారి కలిపితే రుచులొలికే ఉగాది పచ్చడి రెడీ! ఈ మిశ్రమంలో అరటి పండు, కొబ్బరి ముక్కల్ని, పుట్నాల పప్పును కూడా అదనంగా చేర్చవచ్చు.
పెసర పప్పు పాయసం
కావాల్సిన పదార్థాలు
పాలు - 1 1/2 లీటర్లు
పెసర పప్పు - 2 కప్పులు
బెల్లం - 1 కప్పు
యాలకుల పొడి - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
కిస్మిస్ - 1 టేబుల్ సూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా స్టౌపై పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో పెసర పప్పు వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు పెసర పప్పును ఉడక పెట్టి పక్కన పెట్టుకోవాలి. మందపాటి పాత్రలో కప్పు నీరు పోసి అందులో బెల్లాన్ని వేసి కరిగే వరకు మరగనిచ్చి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు పోసి బాగా మరగనివ్వాలి. అందులో ఉడకబెట్టిన పెసరపప్పును చేర్చి బాగా కలపాలి. బెల్లం పాకాన్ని అందులో వేసి చిన్న మంటపై పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత స్టౌ ఆపేసి అందులో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి అతిధులకు సర్వ్ చేయండి.
మామిడి పులిహోర
కావాల్సిన పదార్థాలు
మామిడి తురుము - 2 కప్పులు
వేయించిన పల్లీలు - 5 టేబుల్ స్పూన్లు
జీడి పప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఉడికించిన అన్నం - 3 కప్పులు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
శెనగ పప్పు -1 టేబుల్ స్పూన్
మినప పప్పు -1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 4
పచ్చి మిర్చి - 6
అల్లం ముక్కలు
(సన్నగా తరిగినవి) -1 టీ స్పూన్
ఇంగువ - 1/4 టీ స్పూన్
పసుపు - 1/2 టీ స్పూన్
కరివేపాకు - 20 రెమ్మలు
తయారుచేసే విధానం
స్టౌపై మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, శెనగ పప్పు, మినప పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చి మిర్చి, ఎండు మిర్చి, అల్లం, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కొద్ది నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మామిడి తురుము, వేయించిన పల్లీలను వేసి మరికొంతసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో పరిచినట్టు ఉంచాలి. అందులో తగినంత ఉప్పు చల్లి మామిడి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే పుల్ల పుల్లటి మామిడి పులిహోర రెడీ! దీన్ని వడియాలతో గాని తియ్యటి పచ్చడితో గాని తీసుకుంటే రుచిగా ఉంటుంది.
ఉగాది పచ్చడి
