వెలసిపోయినా రాఖీ దారాన్ని ముంజేతికి చాన్నాళ్లు మిగుల్చుకునే అన్నదమ్ముల్ని మీరు చూసే ఉంటారు. సోదరుడి చేతికి శోభనిచ్చే రక్షాబంధన్ కోసం రోజుల తరబడి వెదికి.. తమ చేతులతోనే అనుబంధాన్ని గట్టిగా లాగి ముడివేసే అక్కచెల్లెళ్ల గురించి మాట్లాడే ఉంటారు. ఒట్టి రంగుల దారపు పట్టీ అయితే... రాఖీ తళుకుబెళుకుల కొత్త వ్యాపారంలో ఎప్పుడో కొట్టుకుపోయేది. అంతకుమించి ప్రేమలు, అనుబంధాలు, బాధ్యతలు కలగలసి ఆడబిడ్డల రక్షణకు ప్రతీకగా అల్లుకోబట్టే రాఖీది అనురాగాల వేడుకైంది. సోదరులిచ్చే బహుమతికి వెలకట్టకుండా గట్టి బంధాన్ని ఇంకా మిగల్చబట్టే అన్నింటికీ మించిన మానవ సంబంధాల పెద్ద పండగైంది. ఆ పండుగను అనేకచోట్ల వేర్వేరు విధానాల్లో జరుపుకోవచ్చు.. కానీ, రక్షాబంధనం స్ఫూర్తి మాత్రం ఆడపిల్లను కాపాడుకో మనే చెబుతుంది.
రాఖీ పండుగరోజున అక్కచెల్ళెళ్ళు.. సోదరులకు రాఖీలు కట్టడంతోపాటు రోజంతా కుటుంబం అంతా కలిసి హాయిగా గడిపేసే ఒక పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఉత్తరాఖండ్, ఒడిశా, బంగ్లా, జమ్మూ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మనకంటే కాస్త భిన్నంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు. అలా జరుపుకునే ఈ పండుగకు విభిన్నమైన పేర్లు కూడా ఉన్నాయి.
ఇరువురూ కడతారు..
ఉత్తరాఖండ్‌లోని కుమౌన్ ఒక ఎత్తైన పర్వత ప్రాంతం. ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రాఖీ ఒకటి. సాధారణంగా అక్కచెల్లెళ్ళు సోదరులకి రాఖీలను కడుతుంటారు. అయితే, ఇక్కడ మాత్రం స్త్రీ, పురుషులు ఇరువురూ రక్షాబంధనాల్ని కట్టుకుంటారు. ఈ వేడుక ఎలా మొదలయ్యిందనేది ఎవరికీ తెలీదు. కానీ, ఇలా ఇరువురూ రక్షాబంధాల్ని కట్టుకోవడం అక్కడ చాలాకాలం నుంచే కొనసాగుతోంది. అంతేకాదు, ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున అక్కడి చంపావత్ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
తల్లిని పూజిస్తారు..
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ణాల్లో రాఖీ పూర్ణిమను కజారి పూర్ణిమగా నిర్వహిస్తుంటారు. ఈ కజారి పూర్ణిమ ఎక్కువగా రైతు కుటుంబాల్లో జరుపుకునే పండుగ. ఈ పండుగ రోజున ముఖ్యంగా కుటుంబ పెద్దగా ఉండే తల్లుల్ని పూజిస్తుంటారు. కజారీ పూర్ణిమ రోజున రైతులు తమ పొలం నుంచి చిన్న చిన్న మొక్కల్ని తెచ్చి మట్టికుండలు లేదా ఏదైనా మట్టి పాత్రల్లో వాటిని ఉంచుతారు. వాటిలో బార్లీ గింజల్లి జల్లుతారు. రాఖీ పూర్ణిమ రోజున ఇంటి చుట్టూ ఆ మొక్కలతో అందంగా అలంకరించుకుంటారు. ఇలా రాఖీ పౌర్ణిమనాడు ఇంటికి తెచ్చిన కొత్త మొక్కల్ని ఇంట్లోనే నాటుకునే వారు కొందరైతే ఈ పండుగ తర్వాత వాటిని నదీ పరివాహక ప్రాంతాల్లో నాటొస్తుంటారు ఇంకొందరు. కజారీ పూర్ణిమ జరుపుకోడానికి చాలా కారణాలు అక్కడ ప్రచారంలో ఉన్నా ఇలా మొక్కల్ని పెంచడం ఓ మంచి పరిణామం.
ఇరుగు-పొరుగు బంధం
జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణిమను ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కేవలం తమ కుటుంబసభ్యులకే కాకుండా ఎంతో ఆత్మీయంగా ఉండే ఇరుగు పొరుగు వారికి కూడా ఈ రోజున రక్షాబంధనాల్ని కడుతుంటారు. అలా జమ్మూలో ఆ రోజున ఒక పండుగ వాతావరణమే కనబడుతుంది. ఇక రాఖీ పౌర్ణిమ రోజు సాయంత్రం గాలిపటాల్ని ఎగరేసే ఒక వేడుకను కూడా నిర్వహిస్తుంటారు. ఇలా, గాలిపటాల్ని ఎగరేసే ఈ వేడుకకు పతంగుల పండుగ అని పేరు. ఈ పండుగ అక్కడ రాఖీ పౌర్ణిమకు నెల రోజుల ముందే మొదలవుతుంది. అలా, ఈ నెల మొత్తం రకరకాల ఆకృతుల్లో, డిజైన్లలో తయారుచేసే పతంగులకు మంచి గిరాకీ ఉంది. ఇక చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఇలా అంతా కలిసి ఈ పతంగుల వేడుకలో భాగమవుతుంటారు. రాఖీ పౌర్ణిమ రోజుతో ఈ గాలిపటాలు ఎగరేసే వేడుక ముగుస్తుంది.
ప్రకృతి రక్షాబంధం
మహారాష్ట్ర్టలోని కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణిమను నారాళీ పూర్ణిమ అని పిలుస్తారు. స్థానిక జాలరుల ద్వారా ఈ పేరు వాడుకలో కొచ్చింది. రాఖీ పౌర్ణిమ రోజున సముద్రాన్ని కొలిచే ఒక ఆచారం ఉంది. అలానే ఆ రోజున జాలరులంతా సముద్రతీరానికి చేరి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా కొబ్బరి బోండాల్ని అందరూ సముద్రంలోకి వదులుతారు. కొబ్బరి భూమ్మీద విస్తరించింది ఇలా సముద్రాల్లో తేలి వేరే తీరాలకు కొట్టుకెళ్లే..! అలానే కొబ్బరితో వండిన రకరకాల వంటకాలు, తీపి పదార్ధాలను వండి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ వేడుక తర్వాత రాఖీలను కట్టుకునే తంతు మొదలవుతుంది. ఇలా మత్య్స కారులంతా ఆ రోజు మొత్తం సముద్రతీరంలోనే ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు.
పాటల రాఖీలు
రాఖీల్లో నెమలి పింఛం రాఖీలు, లోటస్ బెల్స్, పెరల్ బీడెడ్, సాండల్ ఉడ్, రేష్మా, కలర్ బెల్స్ రాఖీలు చాలా ఫేమస్ అయ్యాయి. ఇలా పెద్దవారికి మాత్రమే కాదు, పిల్లలకోసం రకరకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. ప్రతి సంవత్సరం వీటి తయారీలో ఏదో ఒక కొత్త ట్రెండ్ ఉంటూనే డుంటుంది. ఇలా రాఖీల తయారీలో చిన్నారుల ఇష్టపడే యానిమేటెడ్ క్యారెక్టర్లు చోటాభీమ్, సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బెన్ టెన్ వంటివి కూడా చేరిపోయాయి. ఈ బొమ్మల రాఖీలో మ్యూజిక్, పాటలు పాడేవి కూడా ఉన్నాయి. రాఖీ అయిపోయిన తర్వాత బొమ్మకి ఉన్న లింక్‌ను తీసేస్తే ఆ తర్వాత ఎంచక్కా చోటా భీమ్ లాంటి బొమ్మలతో ఆడుకోవచ్చు.
పెద్దల అనుబంధం...
పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగకు జూలన్ పూర్ణిమ అనే పేరుంది. కొన్ని మతపరమైన ఆచారాలు ముడిపడి పడి ఉన్న ఈ పండుగను ఇక్కడ కాస్త అట్టహాసంగానే జరుపు కుంటారు. అక్కచెళ్ళెళ్ళు తమ సోదరులకు రాఖీలు కట్టిన తర్వాత బంధువులను సైతం భోజనానికి ఇళ్ళకు పిలిచే ఆచారం ఉంది. ఇలా మన దేశంలోనే కాదు నేపాల్లోనూ రాఖీ పండుగను జరుపుకోవడం ఒక ప్రాచీన సాంప్రదాయంగా ఉంది. నేపాల్‌లో రాఖీ పండుగ రోజున అన్ని కుటుంబాల్లో పెద్దవారు తమ బంధువుల్ని తప్పనిసరిగా కలిసి వారికి రక్షాబంధాన్ని కడుతుంటారు. ఇక ప్రతి ఇంట్లో ఆడ పిల్లలు తమ సోదరులకు రాఖీలను కట్టే వేడుకా ఉంటుంది. ఇక ఈ రోజునే ఏడు రకాల ధాన్యాలతో తయారుచేసే క్వాతి వంటకాన్ని నేపాలీలు తప్పనిసరిగా తీసుకుంటారు. ఇలా విభిన్న రీతుల్లో రాఖీ పండుగను జరుపుకున్నా రక్షాబంధనాల్ని మాత్రం అందరూ తప్పనిసరిగా కడుతుంటారు. ఇలా ఈ రాఖీ పండుగను మరిన్ని బంధాలతో మనమూ ముడేసుకుందాం!.
- అద్దేపల్లి శర్వాణి