'తెలుగు లాలిపాటలు'... 'ఏడవకు ఏడవకు నా చిట్టితండ్రి... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు...' పాట గుర్తుందా..! గుక్కపట్టిన పసిపిల్లల్ని ఊర్కోబెట్టి నిద్రపుచ్చే ఇలాంటి లాలిపాటలు, జోలపాటలెన్నో ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 'చందమామ రావే.. జాబిల్లి రావే...', 'జోజో పాపా ఏడవకు... జోల పాడుతా ఏడవకు...' వంటి పాటల్ని పూర్తిగా నేర్చుకోవచ్చు. లేదా ఆ కార్టూన్ వీడియోలు చూపించి చిన్నారుల్ని ఓదార్చొచ్చు. 'ఉయ్యాలా.. జంపాలా... ఊగాలా.. ఉయ్యాల' వంటి ఆటలపాటలు కూడా దొరుకుతున్నాయి. ఇలాగైనా మన కమ్మని తెలుగు పాటలు తర్వాతి తరాలకూ మిగులుతున్నాయి. చిన్నారులే కాదు మనం విన్నా హాయిగా అనిపించే ఈ పాటల్ని మీరు విని ఓసారి మీ పసిప్రాయాన్ని అందుకోండి. ఇన్ఫోబెల్స్ వారి వీడియో ఒకటి నాలుగు కోట్ల 20 లక్షల వీక్షణల్ని అందుకుందంటే ఎంత ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోండి.