బుందేల్‌ఖండ్‌లో రోటీ బ్యాంకు ఉంది. నగదు బదులు అక్కడ రొట్టెలను జమ చేస్తారు. ఇంటి ముందుకే వచ్చిన బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకుని లెక్కలు రాసుకుంటారు. అక్కడ డిపాజిట్ అయిన రొట్టెలు అన్నార్తుల ఆకలి తీర్చి ఖాతాదారులకు మానవత్వ ఖాతాను, తృప్తిని వడ్డీతో సహా చెల్లిస్తోంది.
వెనుకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లోని మహోబా జిల్లాలో కొందరు యువకుల ఆలోచనే రోటీ బ్యాంకు. అక్కడి ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన పేదలు, నిరాదరణకు గురై రైల్వేస్టేషన్లలో మగ్గుతున్న వృద్ధులు, కాశీరాం కాలనీకి చెందిన బీదబిక్కీ వెతలు వారికి కొత్త విషయం కాదు. తాము కూడగట్టిన డబ్బుతో ఎంతమందికని ఆకలి తీర్చేది. వారిది మితాదాయమే. కళ్ల ముందే ఆకలితో నకనకలాడుతూ సోలిపోయిన వీధి బాలల నిస్సారమైన చూపులు వారి ప్రయాణాలకు టాటాలు, బైబైలు చెప్పేవి. ఆ చూపులు నిద్రపట్టనిచ్చేవి కావు. తమ ప్రాంతంలో ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రపోకూడదని నిర్ణయించుకున్నారు. రోటీ బ్యాంకును తెరముందుకు తెచ్చారు. బుందేలీ సమాజ్ పెద్ద హాజీ ముద్దాన్ వీరికి అండగా నిలిచాడు. మరో నలుగురు పెద్దలు 40 మంది యువత కలిసి రోటీ బ్యాంకును నెలకొల్పారు. ఇంటింటికీ తిరిగి వారి బ్యాంకు సేవలను వివరించారు. ఇంట్లో వృథాగా పోయే రోజుకు రెండు రొట్టెలను తమకు అందిస్తే వాటిని పాడుచేయకుండా అన్నార్తులకు అందిస్తామని, తప్పు లేకుండా జమలెక్కలు రాసుకుంటామని గృహిణులకు చెప్పారు. పాడైపోయిన వాటిని కాకుండా తాజాగా ఉన్న రొట్టెలను సేకరించేందుకు సరైన సమయానికి రొట్టెల బాక్సులను తీసుకుని స్వయంగా యువకులే ఇళ్లకు వెళతారు. తమ రిజిస్టర్లో నమోదైన ఇళ్ల తలుపులను తట్టి తమ బ్యాంకు నినాదాన్ని వినిపిస్తారు. వారిచ్చిన రొట్టెలను మొహల్లా మిల్కీపూర్‌లోని కార్యాలయంలో జమ చేస్తారు. వాటిని గుర్తించిన ప్రాంతాలకు తీసుకెళ్లేది మరో జట్టు. స్థానిక ఆస్పత్రులు, పేదల నివాసాలు, రైల్వే స్టేషన్, వీధి బాలల కేంద్రాలకు చకచకా వాటిని తరలిస్తారు. రొట్టెలు పాడవకుండా బ్యాంకులో నిల్వచేస్తారు. తొలుత 10 ఇళ్లవారు రొట్టెలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా 400 ఇళ్ల నుంచి రొట్టెలు అందుతున్నాయి. వీటన్నింటి నుంచి వచ్చిన 800 రొట్టెలు చాలామంది ఆకలిని తీరుస్తున్నాయి. రొట్టెలతో పాటు కూరగాయలను కూడా సేకరిస్తున్నారు. మహోబా పట్టణాన్ని 8 సెక్టార్లగా చేసుకుని, ప్రతి సెక్టార్‌కు ఒక కూడలిని ఎంచుకుని చాలా పక్కాగా ఈ కార్యక్రమాన్ని రోజూ ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్వహిస్తున్నారు. నీరసంతో చేయి నోటికి అందించలేనివారికి స్వయంగా యువతే రొట్టెలను తినిపించడం చూసి చలించిపోయిన వారు జట్టులో చేరుతున్నారు. ప్రతి గృహంలో ఏదో ఒక రకంగా ఆహారం వృథా అవుతోందని దీన్ని అన్నార్తులకు అందిస్తే చాలా వరకు ఆకలి సమస్య సమసిపోతుందని వారు చెబుతున్నారు. చాలా మంది గృహిణులకు వృథా ఆహారాన్ని పేదలకు అందించాలని ఉన్నా సమయం, అందుబాటు సమస్యలున్నాయని తాము గ్రహించామని వివరించారు. అలా ఇవ్వజూపినా కొందరు ఆత్మాభిమానం గల పేదలు దాన్ని భిక్షగా భావించి చేయి చాపరని అసలైన విషయాన్ని పట్టారు. అదే ఓ సంఘంగా అందరికీ చేర్చితే అది మానవతా కార్యక్రమంగా వస్తుందని, వాటిని తీసుకునేందుకు వెనుకాడరని రోటీ బ్యాంకు యువత వివరిస్తోంది. విజయవంతమైన తమ ఆలోచనను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోటీ బ్యాంకుపై దాతల విశ్వాసం సడలకుండా వారు అందించే ఆహారం వృథా కాకుండా ఓ జట్టు పట్టణంలో తిరుగుతూ అన్నార్తుల లిస్టును తయారుచేస్తుంది. పక్కా వ్యూహంతో ఒక్క రొట్టె కూడా వృథా పోకుండా అన్నార్తుల పొట్ట నింపడమే వీరి లక్ష్యం. బొట్టు బొట్టూ కలిసి సముద్రం అయినట్టు, రొట్టె రొట్టె కలిసి ఆకలిని ఆ ప్రాంతం నుంచి వెళ్లగొడుతోంది.



