పావురానికి పట్టెడు గింజలు వేస్తారు. చిలకమ్మకు జాంపండును అందిస్తారు. కాకి దర్జాగా వంటింట్లోకి దూరి మరీ నచ్చినవి ఎగరేసుకుపోతుంది. కానీ, గుడ్లగూబను చూస్తే చీదరించుకుంటారు. గ్రద్ద వాలితే రాయి విసిరి చెదరగొడతారు. ఇక డేగలు, రాబందుల లెక్కలు కాలం చెల్లాయి. పక్షుల్లోను మనిషికి పక్షపాతాలున్నాయి. కానీ, ఎవరూ పట్టించుకోని ఈ రెండో జాతి పక్షుల బాగోగులు చూస్తున్నారు ఢిల్లీకి చెందిన నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్. రెక్కలు తెగి, దెబ్బతిన్న వాటికి చికిత్స చేస్తున్నారీ వేట పక్షి ప్రేమికులు.
కుటుంబ వ్యాపార వారసత్వంగా వచ్చిన ఫౌంటెయిన్ నాజిల్స్, సోప్ డిస్పెన్షర్లను తయారు చేసే ఈ అన్నదమ్ములు వీలు కుదుర్చుకుని మరీ పక్షులకు సాయం చేస్తున్నారు. ఢిల్లీ చావ్రీ బజార్‌లోని తమ ఇంటి పైకప్పునే షెల్ట ర్ చేసి, తమ ప్రాంగణాన్ని వాటికి ఆస్పత్రిగా మార్చి వేల వేట పక్షులకు ప్రాణం పోశారు.పదేళ్లుగా సేవల్ని అందిస్తున్నవారి దయ వల్ల బతికి రెక్కగట్టినవి 5000కు పై చిలుకే. డబ్బు సమస్య వేధిస్తున్నా వ్యాపార సమయాన్ని తగ్గించుకుని 24 గంటల పక్షి పరిరక్షణ సంస్థను ప్రారంభించారు. హీనంగా, భయంగా సమాజం పక్కకు పెట్టేసిన ఈ పక్షి జాతికి సేవలు అందిస్తున్నారు. వీటినే ఎంచుకోటానికి కారణం మిగతా పక్షులను ఏదో రకంగా చాలామంది దగ్గరకు రానిస్తారు. వాటికి నాలుగు తిండి గింజలు దొరికితే చాలు. కానీ గుడ్లగూబలు, గ్రద్దలు లాంటివి ఎక్కువగా మాంసాహారం మీదే ఆధారపడే బతుకుతాయి. వాటిని పెంచుకునే వారూ అరుదు. ఇక వాటికి దెబ్బతగిలితే రక్షించేవారు ఎక్కడ ఉంటారనేది ఆ అన్నదమ్ములకు ఓ ఘటన వల్ల ఎదురైన ప్రశ్న. 2003లో వీరికి దెబ్బతిన్న ఓ నల్లరెక్కల గ్రద్ద కనిపించింది. రక్తమోడుతూన్న అది ఎగిరేందుకు విఫల యత్నం చేస్తోంది. దారి వెంట వెళ్తున్న ఎవరూ దాన్ని అవస్థను పట్టించుకోవడం లేదు. దాని పరిస్థితి చూసి చలించిపోయిన వారు చాంద్నీ చౌక్‌లో ఉన్న జైన్ ఆలయంలోని పక్షి వైద్యశాలకు తీసుకుపోయారు. మాంసాహార పక్షి కావడం వల్ల దానికి అక్కడ చికిత్స చేసేందుకు వైద్యులు వ్యతిరేకించారు. ఏం చేయాలో పాలుపోని వారు దాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి వైద్యున్ని పిలిపించి చికిత్స చేయించారు. ఆ తర్వాత వారికి అర్థమైంది ఆ తరహా పక్షుల్ని సమాజం పట్టించుకోదని. అప్పుడే నిర్ణయించుకుని ఆ తరహా వేట పక్షుల్ని సంరంక్షించే బాధ్యత తామే తీసుకున్నారు.
తమ ఇంటి పైకప్పునే వాటికి షెల్టర్ చేసి వెదికి మరీ దెబ్బతిన్న వేట పక్షుల్ని కాపాడటం ప్రారంభించారు. గుడ్లగూబలు, గ్రద్దలు, డేగలు, అంతరించిపోతున్న రాబందుల్ని కాపాడి తిరిగి వాటిని వదిలేసేవారు. వీరి గురించి తెలుసుకున్న పక్షి సంరక్షణ సంస్థలు వీరి సేవల్ని వినియోగించుకునేవి. పక్షి చికిత్సలో ఏ మాత్రం అనుభవం లేకున్నా శ్రద్ధగా వాటిని నేర్చుకుని కొత్త ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. కాలు విరిగిన వాటికి ఉక్కు తీగెలతో కృత్రిమ కాలిని అమరుస్తున్నారు. విరిగిన ఎముకల స్థానే ఉక్కు ముక్కల్ని ఉపయోగిస్తున్నారు. శరీరంలో కలిసిపోయే దారాన్ని వినియోగించి కుట్లు వేస్తున్నారు. శస్త్రచికిత్సల్ని చేస్తున్నారు. మందులూ స్వయంగా ఎంచుకుంటున్నారు. దీనికి కారణం సరైన పక్షి వైద్యుడంటూ ఎవరూ అందుబాటులో లేకపోవడం, ఉన్నవారికి వేట పక్షుల విషయంలో అవగాహన లేకపోవడం. రకరకాల వ్యవస్థల నుంచి సమాచారాన్ని సేకరించి చికిత్స పద్ధతుల్ని నేర్చుకున్నారు. ఏవీయెన్ ఆర్థోపేడిక్ సర్జరీల్లో మంచి పట్టు సాధించారు. కానీ, వారి వ్యాపారం ఆదరణ కోల్పోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పక్షులను కాపాడేందుకు డబ్బు దొరకడం లేదు. పదేళ్లుగా సేవలు అందిస్తున్నా ఆర్థికంగా తగిన ప్రోత్సాహం అందలేదు. ఇప్పటి వరకు అయిన ఖర్చులో 95 శాతం వీరు తమ సొంత డబ్బునే వినియోగించారు. అయినా సరే వెనక్కు తగ్గడంలేదు. అంతర్జాతీయ ప్రమాణాల్లో పక్షి వైద్యశాలను నిర్మించేందుకు శ్రమిస్తున్నారు. వీరి సేవల్ని గుర్తిస్తూ విప్రో ఎన్.ఎఫ్.ఎస్ స్పార్రో అవార్డు ఇచ్చింది.