పూర్వం ఓ రాజు వ్యాహ్యాళికెళ్లాడు. బక్కచిక్కిపోయి...ఇవాళో రేపో అన్నట్టున్న ఆ వృద్ధుడు ... మొక్కలు నాటుతూ కన్పించాడాయనకు. దేశాధినేతనైన తనే వచ్చి పక్కన నిలబడినా పట్టించుకోలేనంత శ్రద్ధగా మొక్కలు నాటుతున్న ముసలయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. 'ఎందుకు తాతా ఇంత దీక్షగా మొక్కలు నాటుతున్నావు? అవి పెరిగేదెప్పుడు? పూసేదెప్పుడు? కాసేదెప్పుడు? పండేదెప్పుడు? నువ్వు తినేదెప్పుడు?' అనడిగాడట. దానికా తాత తల కూడా ఎత్తకుండానే... తను చేస్తున్న పని ఆపకుండానే ... 'ఇప్పుడు మనం తింటున్న కాయలు, పళ్లు ... మనం నాటిన చెట్లవేనా! పూర్వం తాతలు నాటిన వృక్షాల ఫలాలు! ముందు తరాల వాళ్ల కోసం మొక్కలు నాటుతున్నాను' అన్నాడట తాత. చెట్ల రామయ్య సరిగ్గా అలాంటివాడే. ఒక్క మొక్క కూడా నాటడానికి ఆసక్తి చూపని మనం ... దాదాపు కోటి మొక్కలు నాటిన రామయ్య గురించి తప్పక తెలుసుకోవాలి.
ఖమ్మం జిల్లాలో 'చెట్ల రామయ్య' తెలీని వారుండరేమో! ఆయన పూర్తి పేరు దారిపల్లి రామయ్య. సైకిల్ ఆయన ప్రియ నేస్తం అనుకోవాలి. సైకిల్ క్యారేజీ మీద, హ్యాండిల్‌కు మొక్కలు కట్టుకుని ఇంటి నుంచి బైటకొస్తాడు. ఇంట్లో నిల్వ చేసిన... రావి, నిద్ర గన్నేరు, కానుగ, వేప, ఎర్ర చందనం, బిళ్వ చెట్ల విత్తనాలను ... చొక్కా జేబులో పోసుకుంటాడు. ఏదో వెతుకుతున్నట్టు పరిసరాలను పరిశీలిస్తూ సైకిల్ మీద ముందుకు సాగుతుంటాడు. ఎక్కడ బోసి నేల కనిపించినా... మొక్కలు నాటేస్తాడు. జేబులో విత్తులు నాటి నీళ్లు పోసేస్తాడు. అలా ఎన్నో ఏళ్లగా నేలతల్లిని హరితమయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఖమ్మం పల్లెగూడ బ్రిడ్జి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు తను నాటిన...మొక్కలు ఎదుగుతూ వుంటే చూసి అలౌకికానందం పొందుతుంటాడు.
తల్లే తొలి గురువు
బాల్యంలో అమ్మ వెనకే వుండేవాడు చిన్నారి రామయ్య. ఆమె చేసే ప్రతి పనినీ పరిశీలిస్తుం డేవాడు. ముందునాటికి నాటడానికి పనికొస్తాయని బీర విత్తనాలను జాగ్రత్తగా నిల్వ చేస్తుండేది తల్లి. విత్తులోనే మహత్తంతా వుందని...అది మొలకై. ..మొక్కై...మహా వృక్షమౌతుందని ... మనిషికి ఎనలేని సేవ చేస్తుందని పసితనంలోనే తెలుసు కున్నాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి మొక్కలు నాటసాగాడు. తన చేతి మీదగా జీవం పోసుకుని. ..దినదిన ప్రవర్థమానమౌతున్న మొక్కలను చూసి ఎంతగానో సంతోషించేవాడు. ఆ సంతోషమే అతనిని వృద్ధాప్యంలోనూ ఇప్పటికీ నడిపిస్తోంది. నిస్వార్థంగా పనిచేసేలా ప్రోత్సహిస్తోంది.
అధ్యయనం...ఆచరణం...
తన చుట్టూ వున్న మొక్కల గురించి... వాటి ప్రత్యేకతలు, పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత రామయ్యలో చాలా ఎక్కువ. అందుకే వీలు దొరికినప్పుడుల్లా... స్థానిక గ్రంథాలయాల్లో...ఆలయాల్లో వున్న పుస్తకాలు తీసుకుని చదువుతుంటాడు. ఇవి చాలవన్నట్టు... సెకెండ్ హ్యాండ్ బుక్‌స్టాళ్లలో మొక్కలకు సంబంధించిన పుస్తకాలు కొని అధ్యయనం చేస్తుంటాడు. దాదాపుగా... తన చుట్టూ వున్న మొక్కలన్నిటి చరిత్ర ఆయనకు తెలుసు.
సొంత స్థలంలో బాగా ఏపుగా పెరిగిన టేకు, ఎర్ర చందనం వృక్షాలను నరికి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు కదా... అని బంధువొకాయన రామయ్యకు సలహా ఇచ్చారట. దానికి ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా తను విత్తనా లను సేకరిస్తున్నానని, అందుకా చెట్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జవాబిచ్చాడు. సొంత నర్సరీలో ... ప్రతి సీజన్లో సేకరించిన విత్తనాలను నాటి ... వాటి ఆలనా పాలనా చూడడమంటే రామయ్యకు మహా ఇష్టం. వాటినే ప్రతి రోజూ సైకిల్ మీద సర్దుకుని దూర ప్రాంతాలకు వెళ్లి మరీ నాటుతుంటాడు. ప్రకృతి పట్ల, మొక్కల పెంపకం పట్ల రామయ్యకున్న ఆసక్తిని గురించి తెలిసిన ఓ పెద్దమనిషి ... తన కుమారుడి పెళ్లి సందర్భంగా రామయ్యకు 5 వేల రూపాయలు అందించాడు. ఆ పైకాన్ని సొంతానికి కాక... విత్తనాలు, మొక్కల కొనుగోలుకే వినియోగించాడనుకోండి.
రామయ్య గొప్ప ప్రచారకుడు కూడా. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని...తద్వారా మానవజాతిని కాపాడుకోవాలని చెప్తుంటాడు. అందుకోసం వీధి గోడలను, కొండ రాళ్లను చక్కగా ఉపయోగించు కుంటాడు. వృక్షో రక్షతి రక్షిత: వంటి సూక్తులను గోడల మీద రాస్తుంటాడు. పోకిరి పిల్లలు వెంటపడి తరిమినప్పుడు సైకిల్ మీద నుంచి పడి కాలు విరిగింది. ఇంటికి పరిమితమైన ఆ సమయంలో రాళ్ల మీద ఉలితో అక్షరాలు చెక్కడం నేర్చుకున్నాడు. అలా బండరాళ్ల మీద మొక్కల రక్షణకు సంబంధిం చిన సూక్తులు రాస్తుంటాడు.
నేటి బాలలే రేపటి పౌరులని ఎలాగైతే చెప్తున్నామో... నేటి మొక్కలే రేపటి వృక్షాలని... ఈ వృక్ష ప్రేమికుడి విశ్వాసం.
చెట్ల రామయ్య
