''ఊ... పళ్లు ఊడగొట్టండి, నాలుక తెగ్గొట్టండి'', ''మొన్నా మధ్య జుట్టు దాస్తుండగా చూశా... గుండు కొట్టండి'', ''అమావాస్య అర్థరాత్రి శ్మశానంలో కూర్చుని అగ్గి ముగ్గు వేశాడని చెప్పారు. కాల్చి బూడిద చేయండి....'' మంత్రగత్తెలు/మంత్రగాళ్లుగా ముద్ర పడినవారికి మూఢ సమాజం విధించే అమానుష శిక్షలివి. ''కోర్కె తీర్చకపోతే మంత్రగత్తెవని ప్రచారం చేసి ఊరి నుంచి తరిమి కొట్టిస్తా.'' ''భూమి అప్పగించకపోతే మంత్రగాడివని గ్రామంలో నమ్మించి చంపిస్తా.'' అమాయకులను లొంగదీసుకోడానికి ప్రయోగించే విషపు మనుషుల మృత్యు పావులివే. చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే పెద్ద మనుషుల నిజమైన కనికట్టు ఇదే. ఇలాంటి హత్యల్ని చూసి చలించిపోయింది అస్సాంకు చెందిన బీరుభలా రభా.
చేతబడి, బొమ్మ, చిల్లంగి, మందు ఇలా పేరు ఏదైనా అనాదిగా మనిషి భయాన్ని ఆశ్రయించి గూడు కట్టుకున్న మూఢ నమ్మకాలకు బలవుతోంది అవి లక్ష్యం చేసుకున్నా యని అనుకున్నవాళ్లు కాదు. వాటి పేరిట లక్ష్యం కాబడినవాళ్లు. మంత్రగత్తెలు, మంత్రగాళ్లన్న నెపంతో వారిపై జరుగుతున్న హత్యలకు లెక్కలేదు. అస్సాంలో ఈ విపరీత మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఎన్నో కుటుంబాలు ఈ దురాగతా లకు బలైపోయాయి. స్థానిక గిరిజన తెగలైన బోడోలు, రభాలు, మైసింగ్లలో ఈ అంధ విశ్వాసం ఎక్కువ.
ఈ ప్రభావంలో ఉన్న గోపాల్పురా గ్రామానికి 1954లో కోడలుగా వచ్చిన బీరుభలాకు అక్కడకు వచ్చిన కొద్దిరోజులకే ఓ దుర్ఘటన ఆమెను కలిచివేసింది. మంత్రగత్తె నెపంతో ఓ బడుగు మహిళను దారుణంగా కొట్టి చంపారు. పోలీసుల వరకు విషయం వెళ్లినా హత్య చేసినవారి వివరాలు వెల్లడి కాక కేసు దారితప్పింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల హత్యల్ని, వెలుల్ని ఆమె విన్నది, కన్నది. తీరా చూస్తే ఆ కుటుంబాల ఆస్తులు అన్యాక్రాంతమయ్యేవి. ఇంటి ఆడపిల్ల మీద కన్నుబడి అడ్డంగా ఉన్న ఇంటిపెద్దల్ని మంత్రగాళ్ల నెపంతో అడ్డుతొలగించుకోవడం ఆమె పసిగట్టింది. ఈ దారుణాలపై యుద్ధం ప్రకటించింది. ఐదో తరగతి వరకే చదివినా మంత్రాలకు ఎండుటాకును కూడా రాల్చే శక్తి లేదని తెలుసుకుంది. గ్రామాల్లో వచ్చే విష జ్వరాలకు, అంటు వ్యాధులకు కారణం విష కీటకాలు, సూక్ష్మ క్రిములనే విషయాన్ని తెలుసుకుని దాన్ని ప్రచారం చేసింది. జబ్బు పడినవారికి ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చేసి మంత్రాలకు విలువ లేదన్న స్పృహ కల్పించింది. తన గ్రామంలోనే మంత్రగాళ్ల ముద్రపడినవారిని 34 మందిని కాపాడింది. కొందరు పెద్దలు ఆమె ప్రాణాల్ని తీస్తామని బెదిరించినా వెనక్కు తగ్గలేదు. ముందు సామాన్యుల్లో మార్పు తీసుకువస్తే ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని గ్రహించి మరికొందరిని వెంట తీసుకెళ్లి ప్రచారోద్యమాన్ని ముమ్మరం చేసింది. ఆమె ఉద్యమం గురించి తెలుసుకున్న మహిళ సంఘాలు 1985లో ఠాకూర్ విల్లా మహిళ సమితికి సెక్రటరీని చేయడంతో ఆమెకు మరింత అండ తోడైంది. అలా తన పరిధి పెంచుకుంటూ అసోం మహిళ సమతా సొసైటీ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లింది. ఎక్కడ హత్య జరిగినా వెళ్లిపోయి ధర్నాలు, నిరసనలు చేసేది. ఎన్నో కేసుల్లో సాక్ష్యాధారాలు లేక బయటపడుతున్న హంతకుల వల్ల మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించి కేసులు నీరుగారకుండా పోలీసులకు సాయపడేది. గ్రామస్తుల్లో చైతన్యం తీసుకువచ్చి హంతకులను పట్టిచ్చేది. ఉన్నత చదువులు చదివినవారు కూడా చేతబడుల వంటి వాటిని నమ్మడాన్ని గుర్తించిన ఆమె పాఠశాలల్లో, కళాశాలల్లోను ప్రచారం నిర్వహించేది. గత ఇరవై ఏళ్లుగా రభా చేస్తున్న పోరాటం వృధా కాలేదు. చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. కేవలం దుష్ట విద్యలపై నమ్మకాన్ని వదిలేయడమే కాక రుగ్మతలకు చికిత్స చేయించుకునేందుకు కూడా మంత్ర విద్యలను ఆశ్రయించకుండా ఆస్పత్రులకు వెళుతున్నారు. నూతన వైద్య విధానాలను ఆహ్వానిస్తున్నారు. రభా సేవల్ని గుర్తిస్తూ నోబెల్ బహుమతికి కూడా స్థానికులు దరఖాస్తు చేశారు. ఎన్నో దాడుల్ని ఎదుర్కుని వందల మంది జీవితాల్ని కాపాడిన బీరుభలా గురించి తెలుసుకున్నవారు ఇతర రాష్ట్రాల్లోను ఆమె పోరాటాన్ని తీసుకెళుతున్నారు.
- ప్రసన్న