'అసోంలో పౌర వివాదం'పై ఫేసుబుక్ లో ఇటీవల ఆసక్తికరమైన చర్చ సాగింది. 'ఆ 40 లక్షల మందిని ఏం చేయాలి? భారతదేశం నెత్తిన పెట్టుకొని పూజించాలా?' అని ఓ జర్నలిస్టు పెద్ద మనిషి పెట్టిన పోస్టుతో చర్చ మొదలైంది.
'ఆ 40 లక్షల మంది ఎవరు? భారతీయులా? బంగ్లాదేశీయులు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి భారతదేశంలో స్థిరపడినవారు. వీరి వల్ల రెండు, మూడు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఓట్ల ప్రయోజనాలు వున్నాయేమో కానీ.. జాతీయ ప్రయోజనాలు లేవు. ఆనాడు బంగ్లా విభజన సమయంలో, తాము భారత దేశంలో వుండలేమని బంగ్లా వెళ్లిన వారికి ప్రతిగా, ఈ తిరిగొచ్చిన వారికి తగినట్టుగా.. బంగ్లాదేశ్ కొంత భూభాగాన్ని భారత దేశానికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు లెక్క సరిపోతుంది' అన్న పోస్టుకు ఘాటైన ప్రశ్న వచ్చింది.
'బెంగాల్ విభజన జరక్కముందే అంటే బ్రిటీషు వారి పరిపాలనా కాలంలోనే వీరి పూర్వీకులు ఇక్కడ ఉన్నారు. చరిత్ర చదవండి. అయినా పదేళ్లు ఉంటేనే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. 48 ఏళ్లుగా ఉంటున్న వారిని ఎక్కడకు పంపుతారు' అని తొలి సమాధానం వెలువడింది. 'అఖండ భారత్ కావాలి కానీ ఆ ప్రజానీకం వద్దా' అని ప్రశ్నించాడో మిత్రుడు.
'వలసలు వేరు. అక్రమ చొరబాటు వేరు. ఏదైనా దేశం తమ దేశంలో వుండేందుకు అనుమతిస్తే అది వలస, దొంగతనంగా వస్తే చొరబాటు చాలా తేడా ఉంది' అంటూ రెండోవైపు ప్రశ్న వచ్చింది.
'అస్సాంలో టీ ప్లాంటేషన్లలో పని చేయించడానికి 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు తెలుగునాట ఏజెన్సీ ప్రాంతాలతో మొదలు పెట్టి బీహార్, బెంగాల్ వగైరా రాష్ట్రాల నుంచి వేలాది మందిని తరలించారు. అలా వెళ్లిన వారిలో బెంగాలీ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. 'అహౌం, కలిత, చౌతియా' తదితర జాతుల వారు అస్సామీలు కాగా, కూలీలుగా వెళ్లి తరతరాలుగా స్థిరపడ్డవారు ఈనాటికీ అస్సామేతరులన్న ముద్రతోనే కాలం గడుపుతున్నారు. మరి దీనికేమంటారు? వాళ్ళూ విదేశీయులా?' అని మరొకరు ఇంకో ప్రశ్న లేవనెత్తారు.
'రాఫెల్ డీల్, సెజ్‌లు, ఫ్యాక్టరీలు, ఉపాధి, ధర్మ కార్యాల పేర కొందరికి ఎంతో దోచిపెట్టాం. ఓ నాలుగు మిలియన్ల మందికి ఆశ్రయం కల్పించలేమా! కల్పించగలం. కల్పించి తీరాలి. 48 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఇపుడు వలస వచ్చిన వాళ్ళంటే ప్రపంచం ఉయ్యదూ' అని మరో మిత్రుడు ఘాటుగానే స్పందిచారు.
చర్చ ఇలా రసవత్తరంగా సాగుతుండగానే... 'నేను పన్ను రూపంలో కట్టే ప్రతి పైసా, నా దేశ ప్రజల కోసమే కానీ పొరుగు దేశాల ప్రజలను, అక్రమ వలసదారులను, రోహింగ్యాలను పెంచి పోషించటానికి కాదు. వీరు మన దేశస్తులు కాక పోవటం వల్ల వీరికి దేశభక్తి లేకపోవటం వల్ల దేశ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్రమ వలస దారులను ప్రభుత్వాలు వెంటనే మన దేశం నుండి తరిమి వేయాలి' అని 'పరివార్' మిత్రుడు రంగంలోకి వచ్చారు.
'40 లక్షల మందిని ఎలా వెళ్లగొడతారు? ఎక్కడికి వెళ్లగొడతారు? ఇదే కదా అసలు సమస్య. ఈ విషయాన్ని వదిలేసి కాంగ్రెస్‌ను తిట్టుకుంటే ఏం లాభం? రాజకీయ నాయకులు, రాజకీయాలు చేస్తూనే వుంటారు. వాళ్ళలో ముస్లింలు అధికంగా వున్నారు. దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి హిందువులను రెచ్చకొట్టటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. సరే వారి రాజకీయాలు పక్కన పెడితే వారు ఏ దేశస్తులైనా ముందు మనుషులు. వారిలో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, స్త్రీలు వున్నారు. సాటి మనుషులుగా మనం వారికి ఏం చెయ్యాలో ఆలోచించాలి' అని మరో మానవతావాది సమాధానం ఇచ్చారు.
మరో మిత్రుడు 'నాకు తెలిసి ఈ వలసలు ఎక్కువగా బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో రాజకీయ కోణంలో జరిగినవి. అందుకని ఈ సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం ఆలోచించాలి, అంతే కాని వారందరినీ గాలికి వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటే వారు ఇప్పటి వరకు భారత పౌరులుగానే ఉన్నారు.'
'మన దేశంలో ప్రజలు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. మన వాళ్ళు వేరే దేశాల్లో స్థిర పడవచ్చు కానీ ఇతరులను రానివ్వకూడదా! ఇదేం న్యాయం చెప్పండి' అంటూ ఇంకొకరు స్పందించారు.
ఇదీ గడచిన వారం చర్చలో హైలెట్‌గా నిలచిన ఫేస్బుక్ పోస్ట్ సారాంశం.
- కె యస్ రావు