ఆయనెవరో పెద్దమనిషి. పెద్ద మనిషంటే వయసులో కాదులేండి! ఢిల్లీ లోని పెద్ద కోర్టులో దేవుడికి కూడా హక్కులుంటాయని వాదించాడని పేపర్లో చదివినప్పటి నుండి ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నలు! అసలు దేవుడూ మనిషీ ఒక్కటేనా? ఇప్పటిదాకా మనిషికన్నా దేవుడు గొప్పనే కదా చదువుకున్నాం.. మత పెద్దలు, పురోహితులు చెబుతుంటే విన్నాం! కాదంటారా? అయినా, జంతువులకు కూడా హక్కులున్నాయని వాదిస్తున్న ఈ రోజుల్లో దేవుడికి హక్కులు లేకపోతే ఎలా అంటారా? అయితే, అదో న్యాయం ఉంది కదా... అదే అడవిలో తిరగాల్సిన పెద్దపులి మనిషి రక్తం మరిగి ఊర్ల మీద పడితే ఏం చేస్తాం? అంతెందుకు కుక్కకి పిచ్చి పట్టి కనపడ్డ వాళ్లందరినీ కరిచేస్తుంటే ఏం చేస్తాం? ఊళ్లో కోతులెక్కువైనా, పందులెక్కువైనా ఏం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు కదా! అయినా హక్కులున్నాయని మనుషులకైనా ఏం చేసినా చెల్లుతుందా? కుదరదు కదా! ఇన్ని చట్టాలు, సెక్షన్లు, రాజ్యాంగం ఉన్నది దేనికి? నియంత్రించ డానికే కదా! ఇంతకూ చెప్పొచ్చేదేమంటే హక్కులున్నచోట బాధ్యతలూ ఉంటాయి కదా! తప్పకుండా చేయవలసిన విధులూ ఉంటాయి కదా! దేవుడికైనా మనిషికైనా! ఇక్కడికొచ్చేటప్పటికి దేవుడు వేరు, మనిషి వేరంటే కుదరదు కదా! ఎక్కడైనా బావగాని, వంగతోట కాడ మాత్రం కాదని తప్పించుకు తిరగటానికి ఇదేమైనా అల్లాటప్ప విషయమా? అందులోనూ అత్యున్నత న్యాయస్థానమే 'న్యాయబద్ద మైన వ్యక్తి' అని గుర్తించిందంటూ వాదించిన తరువాత! మామూలు వ్యక్తుల సంగతేమో కానీ, న్యాయబద్దమైన వ్యక్తులు, వారి పేరుతో కార్యకలాపాలు నిర్వహించేవారు మరింత బాధ్యతగా విధులు నిర్వహించి తీరాలి కదా! ఇదంతా ఎందుకంటే...'చేసేది ... చేయించేది అంతా నేనే' అని ఆయన చెప్పుకున్నారు కదా! పైగా సర్వజ్ఞుడు! ఆయనకు తెలియని విషయాలే లేవు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది కదా! ఇంతకు ముందంటే. ఆయనేదో అతీత శక్తిగా భావించాం కాబట్టి వదిలేశాం! ఇప్పుడు 'నాకు కూడా ...' అంటూ ముందుకొచ్చిన తరువాత లెక్కలు తేల్చాల్సిందే కదా! మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెబుతోంది? నేరం చేసే వాళ్లు కాదు, ఆ నేరాన్ని ప్రోత్సహించి న వాళ్లు, దానికి సహకరించిన వాళ్లు అందరికీ దానిలో వాటా ఉందనే అంటోంది కదా! నేరస్తుల ఆచూకీ తెలిసీ, వారిని చట్టానికి అప్పగించని వాళ్లు కూడా నేరస్తులతో సమానమే కదా! ఈ సూత్రం వర్తించదా! ఎప్పటి లెక్కలో ఎందుకు? గత నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా ఎంత మంది ఆడపడుచులు కామాంధుల కాటుకు బలయ్యారు. వారిలో అభం, శుభం తెలియని పసిమొగ్గలు కూడా ఉన్నారే! ఈ అమానుషాల పట్ల దేశమంతా కన్నీరు కార్చిందే! సర్వజ్ఞులకి ఈ రేపిస్టుల ఆచూకీ తెలియదా? తెలిస్తే ఆ సమాచారాన్ని చట్టానికి తెలియ చేయాలి కదా! తెలియచేశారా? ఇప్పటి వరకు అటువంటి ఆధారాలు లేవే! చట్ట ఉల్లంఘనకు ఏ శిక్ష విధించాలి? ఏ జైలుకు పంపాలి? ఆయనెవరో మల్లయ్య వేల కోట్ల రూపాయల దేశ ప్రజల కష్టార్జితాన్ని కాజేసి ఎక్కడికో వెళ్లిపోతే ఆయన ఆచూకీ ఎందుకు తెలియ చేయలేదు? అగ్రరాజ్యం విరుచుకుపడ్డా, ఉగ్రవాదులు చెలరేగినా, బస్సు బోల్తా కొట్టినా, రైలు పట్టాలు తప్పినా ఈ భూమి మీద జరిగే సకల నేరాలకు, అంతం లేకుండా సాగే మనిషి వేదనకు, కన్నీటికీ కారణం ఆయనే కదా? ఇన్ని కోట్ల మంది పేదలు నిరంతరం కష్టాల్లో మునిగి, అర్ధాకలితో అలమటిస్తూ 'అన్నమో రామచంద్రా!' అని పలవరిస్తున్నా పట్టించుకోని నిర్దయత్వానికి హక్కులు నిర్ధారించేటప్పుడు పాత లెక్కలు తేల్చవద్దా!
అసలు ఈ సృష్టిలో స్త్రీ జాతికి 'ఆ కర్తవ్యాన్ని' నిర్దేశించింది తనే అని ఆయనే చెప్పుకున్నారు కదా! సృష్టి ముందుకు సాగాలంటే, పరిణామ క్రమం వికసించా లంటే అది తప్పనిసరి కదా! మనుగడుకు కీలకమైన ఆ బాధ్యత తప్పెలా అవుతుంది? ఒక వేళ అది తప్పే అయితే, దానిని వారికి నిర్దేశించిన వారిదే కదా ఆ బాధ్యత! అప్పుడేమో ఇష్టమొచ్చినట్టు చేసేసి ఇప్పుడు 'నా ఇంటిలోకి రానివ్వను' అంటే ఎలా కుదురుతుంది? 'చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా' అని ఊరికే అన్నారా? ఒక వేళ తెలియక చేశానని తప్పించు కుందామన్నా కుదరదే... మన చట్టాల ప్రకారం 'తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే కదా!' మరి... ఎంత శిక్ష వేయాలి?
- పెన్నార్