మోతుబరి రామిరెడ్డి పొలంలో వరి కోస్తున్న ఎంకడి మనసు చేస్తున్న పని మీద లేదు. అది వాడి పెళ్లాం ముత్యాలు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా.. ఎప్పుడు ముత్యాల్ను చూద్దామా.. అని పది నిమిషాలకొకసారి పైకి చూస్తున్నాడు. ఎప్పుడు పరుగులు పెడ్తూ పరిగెత్తే సూర్యుడు మెల్లగా పెళ్లి కొడుకులాగా నడుస్తున్నట్లన్పించింది వాడికి.
'మాటి మాటికి అట్టా పొద్దు పక్కసూస్తు గొణుక్కొంటుండావ్. రత్తాలు కోసరం సూరిడ్ని బెగినా పరిగీమని సెప్తుండావా ఏందిరా?' అంటూ.. పక్కింటి పుల్లమ్మ పరాచికాలు ఆడింది.
'అదిగాదత్త ఇయ్యాలేమో సూరీడు మెల్లగా ఎళ్తునట్టుండాడు. లేకపోతేంది ఎకరన్నర కయ్య సెత్త కోసేసినా కొండకింగా బారెడు దూరంలోనే ఉండడు.' అన్నాడు వాడు సూర్యుడి మీద అక్కసు కక్కుతూ..
'గుడ్డెద్దు సేలో పడ్డట్టు తలపైకెత్తక అట్టా కోస్తునే ఉంటివి అట్టా కోస్తే ఎకరన్నరేందిరా రెండున్నర కయ్యైయినా అయిపోతాది పొద్దుకూకే కాడికి. ఇంతకి ఏంది సంగతి ముకమట్టా పెట్టి పని సెస్తుండావ్ రత్తాల్తో గొడవ పడినావా నేక దాని వొంట్లో బాగాలేదా?'
'అదేంలేదత్తా' అన్నాడే కాని, రత్తాలు అందమైన అమాయక ముఖం కళ్లముందు కదలాడుతుంటే ఛ... నేను దానితో గొడప పడేదేంది. పాపమది మోతుబరి ఇంట్లో పని సేసేదానికి బరువు పడ్తుండాదేమో అని అలోచన సేస్తుండా.. 'అసలు దాన్ని ఆడికి పంపీకుండా ఉండాల్సింది' అనుకొన్నాడు.
రత్తాల్తో ఎంకడికి పెళ్లి జరిగి ఆర్నెల్లు అయ్యింది. ఎర్రగా అందంగా ఉంటుంది రత్తాలు. రత్తాల్తో పెళ్లి సంబంధం రాగానే వాళ్ల ఊరికి పోయి రత్తాలు చూడగానే ఆమె తనకు కాకుండా ఎక్కడ పోతుందేమో అని కానికట్నం తీసుకోకుండా రత్తాల్ను మనువాడ్త్తానని అక్కడికక్కడే చెప్పాడు పెళ్లి పెద్దతో. మొదటి రాత్రి రత్తాల్తో 'నువచ్చం దొరసానిలా ఉంటవే. నీఅట్టాంటి అందమైన పెళ్లాం దొరకడం నా అదుట్టం' అని పొగిడాడు. తన వాడలో పిల్లాజెల్లా అంతా పనులకు పోతున్నా.. వాడు మాత్రం రత్తాల్నుని పనికి పంపీకూడదనుకున్నాడు. 'కొత్తపెళ్లాం కంది పోతానుకొంటావేంది.. పనికి పంపీకుండా దొరసానిలా ఇంట్లోనే పెట్టుకొంటుండావు. ఇది మూణాళ్ల ముచ్చటగా కూడదురాబ్బీ' అంటూ చుట్టపక్కల అమ్మలక్కలు అంటుంటే ... 'లా ఎప్పుడు దాన్ని పనికిపపేదిలే' అన్నాడు. అనడమే కాదు ఎప్పుడు ఈ ఆర్నెల్లో పనికి పంపలేదు కూడా. కానీ, మొదటిసారిగా రామిరెడ్డి పెళ్లాం 'పని మడిసి రాలే పని సేసుకోను కట్టంగా ఉండాది ఇయ్యాల ఒకపూట రత్తాల్ను పంపరా' అన్నప్పుడు ఆమె మాటకు ఎదురు చెప్పలేక పోయాడు 'అయినా ఒకమారైతే పంపినా మళ్లా మళ్లా పంపుతానా' అనుకుంటూ తనను తాను సముదాయించుకున్నాడు.
మరో రెండు బారలు కోసేసరికి సూరీడు కొండదిగుతుంటే, కూలీలు తట్టా బుట్టా పార పలుగు భజాలమీదేసుకుని ఇంటి దారి పట్టారు. ఎంకడు కూడా ఇంటికి పోయేందుకు సిద్ధమవుతూ నడుముకు కట్టుకున్న తుండుగుడ్డ తీసి భుజం మీదేసుకుని కొడవలిని మెలలో దోపుకొని పంపుసెట్టు దగ్గరికి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కును పోతుంటే 'ఒరే ఎంకటిగా కోసిన సెత్త కుప్పేసి పోదముండ్రా వోన ఒంగేటట్టుండాది. సెత్త తడిసిదంటే రెడ్డోరుతో సావొచ్చి పడతది' అన్నాడు ఇంకో పాలేరు ఎర్రోడు. ఎంకడు ఒకసారి పైకి
చూసాడు వాడు చెప్పింది నిజమే అన్పించింది. చేసేదిలేక తిట్టుకుంటూ గబగబా కోసిన చెత్తను వాడితో పాటు కలిసి ఒక చోటికి కుప్ప వేయసాగాడు.
గుడిసె చేరేటప్పటికి గుడిసె చూరు చూరు కింద నిలబడి తనకోసరం ఎదురు చూసే ముత్యాల్ను చూడగానే తను పొద్దున్నుంచి పడిన కష్టమంతా గాలికెగిరిపోయి ఉత్సాహం ఉరకలేస్తుంది వాడికి. అరోజు వరిచెత్తంతా కుప్పేసే సరికి చాలా చీకటిపడింది. ఎప్పుడు కనపడే రత్తాలు గుడిసె చూరు కింద కనపడకపోయేసరికి ఎంకడి మనసు అదోలా అయిపోయింది. గుడిసె ముందర కిరోసిన్ బుడ్డి వెలుగుతుండక పోవడంతో 'రత్తాలింకా రెడ్డోరింటికాడ్నే ఉండాదా? పొద్దుననగా పోయినాది సీకటి పడినా ఇంకా ఆడేం సేస్తుండాదబ్బ. దాని సేత ఇంగా పని సేయిస్తాంటా రెడ్డోరి పెళ్లాం ఆయమ్మ అట్టాంటిది కాదే.' అనుకుంటూ మొలలో ఉన్న కొడవలి చూరులో చెక్కి, భుజంమీదున్న పార గుడిసె ముందర వసారాలో వేసి, రత్తాలు ఒక్కటి చీకట్లో రాలేదని లోపలికి పోయి లైటు తీసుకునేందుకని గుడిసె తలుపు వైపు చూసాడు. తాళం తీసి ఉండటంతో రత్తాలు ఇంట్లోనే ఉందని ఆత్రంగా తలుపులు తీసాడు. గుడిసె లోపల కూడా చీకటిగా ఉండటంతో బుడ్డి గూడా ఎలిగించకుండా వోకిలి తీసి ఏం సేస్తాండాది అనుకుంటూ ఆగ్గిపుల్ల గీసాడు బుడ్డి వెలిగించేందుకు. ఆ వెలుతర్లో నులక మంచంలో ముడుచుకొని చీరనిండా కప్పుకుని పండుకున్న రత్తాల్ను చూసే సరికి వాడి మనసు కుదుటపడింది. కానీ, రత్తాలు పడుకున్న తీరుచూసి జాలివేసింది. 'పాపం ఎంత పని సెప్పినాదో రెడ్డోరి పెళ్లాం.. బాగా అలిసిపోయినట్టుండాది.' అనుకుంటూ మంచం దగ్గరికి కెళ్లి రత్తాలు తల మీద చేయివేసి లేపబోయాడు. అంతవరకు తను ఈలోకంలో లేనట్లు పడిపోయి ఉన్న రత్తాలు ఎంకిడి చేయి తగలడంతో బిత్తరపోయి లేచింది. ఎంకడ్ని చూడగానే బావురమంటూ బల్లిలా కర్చుకపోయింది. రత్తాల ఏడ్పు చూసి ఎంకడి కంట్లోనూ నీళ్లు తిరిగాయి. 'ఏడ్సమాకే.. రేపట్నుంచి నువు యాడికి ఎల్లద్దులే రెడ్డోరిపెళ్లానికిి నాను ఏదో ఒహటి సెప్తా' అన్నాడు రత్తాలు పొదివి పట్టుకొని ఓదారుస్తూ. దాంతో రత్తాలు ఏడ్పు మరింత ఎక్కువైంది. ఏదో చెప్పాలని అనుకుంటుంది కాని ఆ ఎక్కిళ్ల మధ్య మాట బైటికి రాలేదు. రత్తాలు అట్టా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంటే ఎంకడికి దు:ఖమాగడం లేదు 'జాలిగా ఏడ్సమాకే.. తప్పైనాది ఇక యవరు సెప్పినా పనికి అంపనును.' అన్నాడు అనునయంగా.
'అ...ది ...గా...దు మావా..' అంటూ ఒకో అక్షరం పలుకుతూ చెప్పలేక సెప్తుంటే అప్పుడు చూచాడు రత్తాల్ను. పూర్తిగా రత్తాలు చీర రవికలు చిరిగిపోయి ఉన్నాయి. ఎంకడికి రామిరెడ్డి ఇంటి దగ్గర ఏదో జరిగిందని అర్థమయ్యింది. 'ఇషయమేందో సెప్పకుండా అట్టా ఏడిస్తే ఏం జరిగినాదో ఎట్టా తెలస్తాదే' అన్నాడు. వాడి గొంతులో జాలి తగ్గి కోపంపెరగడం చూచి.. చెప్తే ఏమౌతుందో చెప్పక పోతే ఎలా అని భయపడుతునే జరిగింది దాచుకోలేక ఏడుస్తునే చెప్పింది రత్తాలు. రత్తాలు చెప్తుంటునే ఎంకడి రక్తం మరిగిపోయింది. పూర్తిగా వినకుండా తటాలున పైకి లేచాడు. కోపంతో బుసలు కొడుతున్న వాడి ఊపిరి, బిగుసుకున్న వాడి పిడికిలి, నిప్పులు కక్కుతున్న కళ్లలో ఎరుపు చూసి భయపడి పోయింది రత్తాలు.
'ఆవేసపడమాకు మావ. నాను సెప్పేది పూర్తిగా ఇను... వోడు ఎదవ పని సేయబోయిండు గాని నాను వోడ్ని ఇసిరిగొట్టి బయిటికి పారిబోయి వొచ్చినా దేముడి దెయఉండి ఏమి గాలే...' ఎంకడు కోపంతో ఏం చేయబోతాడో ఎలాంటి ప్రమాదం వచ్చిపడ్తుందో అని భయంతో సర్దిచెప్పబోయింది.
ఎంకడికి రత్తాలు చెప్పిన మాటలు కోపాన్ని తగ్గించలేదు. వాడికి రామిరెడ్డి పెళ్లాం మీద విపరీతమైన కోపమొచ్చింది. ఆమెనే దీనికి కారణమని బుసలు కొట్తూ 'ఆడు అట్టా సేస్తుంటే ఆడి పెళ్లాం యాడికి సచ్చినాది. తనే కందా నిన్ను రమ్మనాది' అన్నాడు.
'ఆయమ్మ సానా మంచిది మావా. సెల్లెలా సూసుకొంది. ఆయమ్మకు ఎరిక లేనట్టుండాది వాడు పసరంలాంటోడని. నేకుంటే నన్నట్టా ఒంటరిగా వొదిలి ఎందుకెల్తది. నాను పోయిటప్పటికి వోడు ఇంట్లోన లేడు. అందుకే ఆయమ్మ నన్ను వోడి కొట్టడిలోకి ఎల్లి కసువూడ్చిమని సెప్పి తానానికి పోయినాది. వాడు ఎప్పుడొచ్చినాడో ఏమో నాకు తెలవదు. ముదనష్టపోడు ఎనకనుంచి వచ్చి నోరు మూసి ఎనంగొడ్డులా వాటేసుకుని సీర రయిక లాగేయబోయిండు. నాను బెదిరిపోయిన. గట్టిగా అరుస్తామంటే నోరు మూసిండు. ఎదురుగా టూలు మీద ఏదో దొరికింది దాంతోన తల మీద మోదిన.. వోడు బాధగా పట్టు వదలంగానే విసిరిగొట్టి పారిపోయి వచ్చినా...'
ఎంకడి మనసు ఆ సంఘటన కళ్లముందు కనపడుతున్నట్లున్పించి మనసు వేడి బుగ్గలా ఉడికి పోసాగింది. పిచ్చి పట్టిన వాడిలో ఊగి పోసాగాడు. ఉన్న పళానాపోయి రామిరెడ్డి మీద పడి చావగొట్టాలని ఉంది. దాని వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా భరించేందుకు సిద్ధమవుతూ. రత్తాలు ఎంకడి కోపం చూసి భయపడతూ సర్దిచెప్తూనే ఉంది 'జరిగిపోయినేది జరిగిపోయింది.. నాకేమి గాలా గందా ఇంక నేనాడికి పనికి పోను గందా.. నువ్వు రెడ్డోరి మీదకు పోబాకు మామ. వోడు దుడ్డున్నోడు. వోడికే అంతా వత్తాసు పలుక్తారు అవమానం అయితాది మావా' అంటూ.
రత్తాలు చెప్పేది నిజమేనని వాడికి తెలుసు. తన మోతుబరి ఎదురుగా మాట్లాడటమే కట్టం. అట్టాంటిది వోడ్ని తనేం సేయగలడు. అట్టాగని వోడ్ని... తన రత్తాల్ను సెరపబోయి దాని ఒంటి మీద సెయ్యి ఏసినోన్ని అట్టాగే వదలాలా? ఒక పక్క తన రత్తాలుకు జరిగిన అవమానం కుదిపేస్తుంటే మరోపక్కవాడ్ని ఎదుర్కోలేని తన శక్తిలేమితనంతో స్తిమితంగా ఉండలేక పోయాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు 'తనకాడ కొంపలేదు గోడు లేదు తన బతుకు యాడైనా ఒహటే గాని అట్టాడప్పుడు రెడ్డోరికి ఎందుకు బెయపడాలా? వోడ్ని ఏదో ఒకటి సేసి ఈ పల్లె ఇడిసి పోతా.' అనుకొన్నాడు. రాత్రికి రాత్రే ఉన్న మూట ముల్లె తీసుకొని రత్తాల్ను వాళ్లమ్మ ఇంటికి బైలుదేరమన్నాడు. అతడు ఏం చేయబోతున్నాడో రత్తాలుకు అర్థంకాలేదు. ఎప్పుడు చూడని ఎంకడి ముఖంలోని కోపం చూచి ఎదురు చెప్పలేకపోయింది. ఏం జరగబోతుందోనని భయంతో వాడి వెంట నడిచింది.
వాళ్లలా వాడ దాటబోతుండగా ఊరిలో ఒక రైతు పలకరించాడు. 'యాడికిరా సీకటో'్ల అంటూ. ఎంకడు కోపంలో పలకకపోవడంతో 'అదిందేరా అడుగుతుంటే అట్టా బెల్లంగొట్టిన రాయిలాగ ఉలకవు పలకవు. సీకట్లోన సూసుకుని పొండ్రి. పురుగు పుట్రా ఉంటది' అని జాగర్త చెప్పాడతను. 'మడుసులకన్నా పురుగు పుట్రానే నయం. వోటిని తొక్కితే కరుస్తయి. నేకుంటే వోటి దారిన అయిపోతయి' అని గొణక్కొన్నాడు ఎంకడు.
మొలలో పిడిబాకు పెట్టుకొని, చేతిలో పిడికిలి లావు ఆరడగులు పొడుగున్న ముల్లుకర్ర పట్టుకొని అత్తగారి ఊర్లో ఎవరి కంట పడకుండా తిరుగు ప్రయాణమయ్యాడు ఎంకడు. పొద్దుననగా తిన్న సద్ది మరో సమయంలో అయిఉంటే ఆకలికి నకనకలాడే వాడే కాని ఇప్పుడువాడికి ఆకలి లేదు. వాడికి రామిరెడ్డి ముఖమే కనిపిస్తుంది. రత్తాలు చెప్పిన మాటలు.. ఏడ్పులు.. పదే పదే చెవిలో గింగుర్లు పెడ్డుతున్నాయి.
రామిరెడ్డి ఊర్లో ఉంటే తెల్లవారు జామునే పొలం దగ్గరికి పోవడం అలవాటు. పొలం దగ్గరికి పోవాలంటే చెరువు కట్ట మీదనుండే పోవల్సిఉంటుంది. రామిరెడ్డిని ఆ కట్టమీదనే కొట్టాలని ఎంకడు ఊర్లోకి పోకుండా నేరుగా కట్టదగ్గరికి బయలుదేరాడు. నిండు అమవాస్య చేతికందినంత దూరంలో కూడా ఏముందో కనపడటంలేదు. రోజు చూచే ప్రదేశమే అయినా కాలువ కట్ట మీద పాములు తేళ్లు తిరుగుతుంటాయని తెలుసు. అయినా వాడికి భయమేయలేదు. చేతిలో టార్చిలైటున్నా వేయలేదు. ఆవెలుతురు చూసి చెరువు కట్టకు కొద్ది దూరంలో చెత్తకు కాపాలా ఉన్నవాళ్లు కేకలేసి ఎవరని అడుగుతారని. కట్టకు ఆనుకొని చింత చెట్లున్నాయి. దాని మీద ఉంటున్న పక్షులు అప్పుడు కునికి పాట్లు పడుతూ నిద్రలో ఉలిక్కి పడి అరుస్తున్నాయి. ఓ చెట్టు మీద గుడ్లగూబ కర్ణకఠోరంగా అరుస్తుంది. చెరువులో కప్పలు కీచురాళ్లు ఆ అరపుకు కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్లీ అరుస్తున్నాయి. ఉన్నట్లుండి గుడ్లగూబ చెట్టుకొమ్మల్లో ఏదో పక్షిని పట్టుకొన్నట్లుంది. దాని చేత చిక్కిన పక్షి ప్రాణభయంతో అరుస్తుంటే ఎంకడు చీకట్లోనే కిందికి వంగి శబ్ధం వచ్చిన వైపు బలంగా విసిరాడు. రాయి దెబ్బ తగలడంతో ఏదో ఠb ఠపా కొట్టుకుంటూ కింద పడింది.. తర్వాత గుడ్లగూబ అరుపులు గాని పక్షి అరుపులుగాని వినపడక పోతే కింద పడింది గుడ్లగూబే అయిఉంటుదనుకుని కసిగా పళ్లు కొరుక్కొన్నాడు. ఆ రెడ్డోరు దాని మాదిరిగా దెబ్బకు నేలకు కర్సుకోవాలా అనుకొన్నాడు. దూరం నుంచి వచ్చే మనిషి కనపడేటట్టుండే ఒక చింత చెట్టు ఎంచుకుని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెడ్డోరు సీకట్లోనే కట్టమీదికి వస్తాడు. రాగానే వెనకి నించి తలమీద మోదాల. దాంతో వోడు సచ్చినా బతికినా తనకు ఏమి భయంలే. తన కచ్చతీర్తాది. నేరుగా పనిలోకి పోతా ఏమి తెలియనట్లు. తను వోడ్ని చావమోది నట్లు ఎవరు అనుకోరు. ఆ టయింలో ఆ పక్క చెఱువు కట్టమీదికి ఎవరు రారు. ఒకేల వోడి సావు కేక ఇని ఎవరన్నా వొచ్చినా వోల్లు వొచ్చేనోగ తను దాటుకొనేకి సమయముండాది అనుకొన్నాడు. పొద్దున లేచి మొదలు కొద్దిసేపు కూడా విశ్రాంతి తీసుకోక అలిసిపోయినా నిద్ర పట్టలేదు వాడికి. ఎప్పుడు తెల్లారబోతుందా అని చీకట్లోనే చూస్తుకూర్చుండి పోయాడు .
చెరువు కట్ట దగ్గర తెల్లార్లు మేలుకొన్న ఎంకడి శ్రమ వృధా అయింది. రామిరెడ్డి చెరువుగట్టుకు రాకపోవడంతో ఉస్సూరుమని నిట్టూర్పుడిచాడు. తెల్లగా తెల్లారినంత వరకు రామిరెడ్డి కోసం చూచి 'ఈ నా కొడుకు ఇయ్యాలా రానట్టున్నాడు. చావు తప్పించుకొన్నాడు. కొంపకాడేమన్నా దొరకుతడమే సూద్దాం' అని గొణుక్కొంటూ చెట్టుదిగాడు. ఇటయింలో ఇంటి కాడ వాడు, వాడి పెళ్లామే ఉంటరు. 'ఒక వేళ ఎర్రోడున్నా పశువులు కొట్టంలోన ఉంటడు. వోని కంట పడకుండా కొట్టడిలోకి పోయి సావగొట్తే... అట్టా. ఒకేలా వోడు నన్ను పట్టుకొని నల్గురిని పిలిసి నన్ను కొట్టినా పర్వాలా.. వోడు సేసిన పనికి నా సేత దెబ్బలు తింది బతికినంత కాలం గుర్తుండిపోతది' అని దారివెంబడి అనుకుంటూ వాడు ఎవరి కంట పడకుండా పక్కదారిగుండా రామిరెడ్డి ఇంటికి వచ్చాడు. వాడు వచ్చేసరికి రామిరెడ్డి ఇంట్లో ఇంకా వాకిళ్లు తెరవలేదు. కాంపౌడు గేటు వాకిలి తీసి లోపలికి వెళ్లిన ఎంకడ్ని చూచి ఇంట్లో కుక్క తోకూపుతు దగ్గరికి వచ్చింది. దాన్ని చేత్తో నిమిరి గొడ్ల సావిడ్లోలో ఎర్రోడేమన్నా ఉన్నాడేమేనని లోపలికి నడిచాడు. ఎంకడ్ని చూచి గడ్డిని తినడం ఆపి మోర ఎగబెట్టి చూచి తలలూపసాగాయి పశువులు... తమకు కుడితి తాపేందుకు వచ్చాడను కుని. గొడ్ల సావిట్లో ఎర్రోడు కనపడకపోవడంతో 'ఎర్రోడు ఇంకా రానట్టుండాది ఇదే మంన్చి టయిము. వోడికి సావు మూడింది నాసేతిలోన.. ఒకేలా వోడు ఇంట్లోన లేడేమో... వోడు లేకుంటే వోడి పెళ్లాముంటాది.
ఉంటే.... ?
మొదటి సారిగా వాడి వివేకం నశించి ఆలోచన్లు పెడదారి పట్టాయి. నా రత్తాల్ను పట్టుకొన్నట్లే వోడి పెళ్లాన్ని పట్టుకొని బలత్కారం సేస్తా.... నా రత్తాలు ఏడిసినట్టే వోడి పెళ్లాం ఏడిస్తే వోడికి బుద్దొత్తాది. నాను సేసిన పని బయిటికి సెప్పుకోలేడు. ఒకేళ అట్టాసేసినదానికి నన్ను సంపితే సంపని. నా రత్తాలు మీద సేయేసిన్దానికి నాను సేసిన బతికినంతకాలం గుర్తుండిపోతాది.' అనుకుంటునే అరుగు మీదికి ఎక్కాడు. కుక్క వాడ్ని ఒదిలిపోక చిన్నగా మొరగుతూ వాడితో ఆడబోతుంటే విస్సుగా దాని తల మీద చిన్నగా ఒక దెబ్బవేసాడు. అది గుర్రుమని చూసి పక్కకుపోయింది. చప్పుడు విని రామిరెడ్డి పెళ్లాం బైటికి వచ్చింది. ఆ సమయంలో ఎంకడ్ని చూసి ఆశ్చర్యంగా 'వచ్చిననేది ఎర్రోడనుకొన్నా. నువేంది ఇంత పెందరాలే వచ్చినవు. ఏందన్నా పనా?' అడిగింది. ఆమెను చూడగానే ఎంకడికి నోట మాట రాలేదు. లోపల చంచలమైన మనసువాడ్ని ప్రలోభ పెడ్తుంటే నసుగుతూ 'రెడ్డోరు.. రెడ్డోరు' అని మాత్రం అనగలిగాడు అతి కష్టం మీద.
'రెడ్డి రాతిరింటికి రాలేరా.. పనుండాదని పట్నంలోనే ఉండిపోయిండు. ఇప్పుడు బయలుదేరిడంటా' అంది ఆమె. రెడ్డోరు లేడు ఎర్రోడు ఇంకా రాలే. ఇప్పుడు రెడ్డోరి పెళ్లాం ఒక్కటే వుంది. పట్టుకుంటే ఎవరు లేరు తనను అడ్డుకొనేందుకు. ఆమె వైపు చూసాడు. ఆమెను చూస్తుంటే అడుగు ముందుకు పడలేదు వాడికి.
'ఏందిరా అట్టా మొద్దులా నిలబడిపోయిండావ్. ఏమన్నా లెక్కగావాలా? నీ పెళ్లాం నిన్న సెప్ప పెట్టాకుండా పోయే నాలుగు సీరలిస్తామనుకొంటి. ఉండు పట్టుకు పోతవు. అట్టాగే సద్దికూడు తినిపోతువు.. కూకో తేస్తా ...'
'వొద్దు.....అయ్యేమి వొదు'్ద అన్నాడు కోపాన్ని గొంతులోకి తెచ్చుకొంటూ. దాంతో మాటలు నంగి నంగిగా బైటకొచ్చాయి వాడలా మాట్లాడుతుంటే అర్థంకాక వాడి దగ్గరికి వచ్చింది రామిరెడ్డి పెళ్లాం.
చేతికి అందేంత దూరంలో వచ్చినామెను చూచి కట్టె కింద పడేసి. చేతులు రెండు ఆమెను పట్టుకొనేందుకు చాపాడు అతి బలవంతంగా . చేతుల్తోపాటు వళ్లంతా చెమటలు పట్టి వణకసాగింది. వాడి స్థితి ఆమెకేమి అర్థంకాలేదు. 'వొళ్లు బాగాలేందా ఏందిరా. కళ్లట్లా అగ్గినిప్పులా ఉండాయి. వొళ్లు వొనికి పోతాండది. కట్టెకూడ సేయి జారి పోయినాది. పైసలిస్తా పోయి ఆసుపతిరికి పోయి సూదిఏయించుకో. పనికి ఏమి పోవద్దులే. నాను రెడ్డికి సెప్తా' అంది రెడ్డి పెళ్లాం.
అంత దగ్గరికి వచ్చినా ఇంట్లో ఎవరు లేక పోయినా ఆమెను చూస్తుంటే వాడిలో ఇంతకు ముందు వచ్చిన కోపం కసిల్లాంటివి చచ్చుపడిపోయాయి. రామిరెడ్డి పెళ్లాంగా ఆమెను చెరచాలనుకొన్నా ఆమెలో తన అక్క అమ్మ కనపడతుంటే నిస్తేజంగా నిలబడిపోయాడు. దాంతో పాటు అభిమానంతో ఆమె మాట్లాడుతున్న మాటల్తో మరింత కృంగిపోయాడు. వాడిలో రగిలిన పగ ప్రతీకారం ఉన్నట్లుండి తగ్గిపోయాయి. తనకు అలాంటి ఆలోచన వచ్చినందుకు సిగ్గు పడ్డాడు. అదే సమయంలో రత్తాలుకు జరిగిన అన్యాయం గుర్తుకొచ్చి నిస్సహాయంగా రెడ్డోరు తప్పు సేసిండమ్మ. 'నాను ఏం దోహం సేసినానని రత్తాలు బతుకు బుగ్గిపాలు సేయబోయిండు. నీకు సాయం కోసరం పనికి పంపిదానికి రత్తాల్ని పట్టుకుని బలత్కారం సేయబోయినాడంటా. దేవుడి దెయఉండబట్టి అది బయపడినాది. వోడు పసరమయి నా పెళ్లాంలో సెల్లెల్నో కూతుర్నో సూడలేకపోయిండు.. గుండె రగిలిపోతుంటే వోడి రకతం కళ్ల సూడాలని ఒచ్చినా.... వోడు లేడని నిన్ను సూసి వోడికి బుద్ది సెప్పటానికి నిన్ను సెరపట్టాలనుకొంటి. గాని నాను ఆ పని సేయలేక పోతి. నీ మొగుడిిలా నాను పసరాన్ని గాను. అందుకే అట్టా సేయలేక పోతి. వోడు సేసిన తప్పు నాను సేయబోయినదానికి సిగ్గుపడుతుండా. వోడికి రోజులు దగ్గర పడినయి. వోడిట్టాగే సేస్తా ఉంటే నాను కాకపోతే ఇంకొకడు వోడికి బుద్ది సెప్తరు' అంటూ... రత్తాలు జరిగిన అవమానం వాడ్ని కుదిపేస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయతల మధ్య కూలబడ్డాడు.
ఎంకడి మాటలకు రామిరెడ్డి భార్య కొయ్యబారి పోయింది. క్షణం క్రితం వాడి కళ్ళలో కనిపించిన చూపులకు కారణమేమిటో తెలిసాక ఆమె వళ్లు భయంతో జలదరించింది. కోపంతో రగిలి పోయేవోడు ఏ మాత్రం గాడి తప్పి ఉండినా తన బతుకు తెల్లారి పోయి ఉండేదనుకొంది. జరగబోయిన ఘోరమేమిటో కళ్లముందు కనపడుతున్నా తన మొగుడు రత్తాలుకు చేసిన అవమానం కళ్లముందు కనపడుతుంటే ఎంకడి మీద కోపం రాక పోగా రత్తాలు మీద, వాడి మీద జాలివేస్తుంటే అలాగే నిల్చుండి పోయింది.
రామిరెడ్డి టౌనుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే బైట సూట్‌కేసుతో ఊరికి పోయేందుకు సిద్ధంగా ఆమె కనిపించింది.
'యాడకే సెప్పాపెట్టాకుండా సూటుకేసు సర్దినావు.. ఏమైనాది ఎవరో సచ్చినట్టు ఆ ఏడ్పు ముకమేంది' అన్నాడు కోపంగా .
'ఎంకడొచ్చిండు' అంది, ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా. రామిరెడ్డికి రత్తాల్ను పట్టుకొన్న విషయం బైటపడిందని తెలిసి పొగురుగా 'అయితే ఏందంటా' అన్నాడు. మొగుడి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ 'నువు రత్తాల్ను సెరసబోయినావని వోడికి నాను కావాలని వచ్చిండు.....' అంటూ ఆమె మాట పూర్తిచేయక ముందే 'ఏంది నవ్వనేది వోడు నీకాడికి వచ్చి నిన్ను ....' అంటూ పళ్లు పటపట కొరుకుతూ 'ఆ నాకొడుకును నరికిపారేస్తా ఆ వేటకొడవలిట్టియ్యి' అంటూ కోపంతో ఊగిపోయాడు.
'నువ్వు వోడి భార్యను పట్టుకోంగా లేని తప్పు వోడు నన్ను పట్టుకుంటే తప్పేంది.' రామిరెడ్డి పెళ్లాం మాటలకు కంగుతిన్నట్టై 'వోడికి వత్తాసు పలుకుతుండావ్. వోడు నేను ఒకటేనా ఏంది నా ఎంగిలి తిని నా సెప్పులకాడ పడివుండే వోడు నిన్ను.... వోడ్ని రకతం కళ్లసూడందే వదలనియ్యాలా' అంటూ లోపలకి పోబోయాడు వేటకొడవలి తెచ్చేందుకు.
'తప్పు నువ్ సేసి వోడ్ని నరకడమేంది. వోడ్ని నరక్కముందు నువ్వు నిన్ను నరుక్కో. కులంలోన డబ్బులోన పెద్దోడివైతే పసరంలా ఇంకోడి పెళ్లాం మీద సేయేస్తావా? వోడు కూటికి గుడ్డకు కులానికి పేదోడే కాని గుణంలోన నీ కంటే పెద్దోడు. నీలా పసరంలా ప్రవర్తించలా. వోడ్ని పెద్దమొగోడిలా నరకనుబోతుండావు ఎవరన్నా ఎందుకు వోడ్ని సంపబోతుండావని అడిగితే నాను వోడి పెళ్లాన్ని సెరసబోయినాని వోడు నా పెళ్లాన్ని సెరసబోయినాడని సెప్తవా' అంది ఆమె. ఆ మాటలు పుండు మీద కారం చల్లినట్లైందిరామిరెడ్డికి. తన పెళ్లాం అలా ఎంకడ్ని వెనకేసుకరావడంతో కోపంతో రెచ్చిపోయాడు. దగ్గరగా వచ్చి 'వోడు సేసినేది అంత రంజుగా ఉండినాది నీకు.....' అంటూ పచ్చిబూతులు మాట్లాడేసరికి, ఆమె తోకతొక్కిన తాచులా లేచింది. దగ్గరికి వచ్చిన రామిరెడ్డి చెంప చెళ్లుమనిపించింది. నివ్వెర పోయాడు అతడు. నిప్పులు కురిపిస్తున్న భార్యను చూసి నోటమాట రాలేదు. ఆమె ఆడపులిలా గర్జిస్తూ 'ఏంది నువ్వనేది... నువ్వు పసరంలా వోడి భార్యను పట్టుకొన్నవేమో గాని వోడు పసరంగాదు.. నేకుంటే ఈపాటికి నాను వోడి సేతిలో మానం పోగొట్టుకుని సచ్చిండేదాన్ని. ఈడనే ఉండి నీ లాంటి పసరంతో కాపురం సేయడానికి నాను పసరాన్ని కాను నేను మడిసిని. అందుకే నీ ల్లాంటి పసరానికి బుద్ధి సెప్పించి నేను నా పుట్టింటికి పోతుండా' అని గొడ్లసావిడికేసి చూస్తూ 'అరేరు ఎంకడు' అని కేకేసింది.
కాలయముడిలా కట్టె పట్టు కుని గొడ్లసావిడ్లోంచి వస్తున్న ఎంకడ్ని చూసి గొంతు తడారిపోయింది రామిరెడ్డికి !
- శేషచంద్ర
9440581463
వోడు పసరంగాదు (కథ)
