జుట్టంతా నీటిబొట్ల పత్తిపూలను అద్దుకుంటుంది... సాగర్ గేట్లెత్తినప్పుడు దాని దగ్గర నిలబడి చూస్తే. నీటి పరవళ్లకి గాల్లోకి లేసి మృదువైన నీటి బిందువులు చల్లగా నుదిటిని ముద్దాడుతుంటే..! మళ్లీ ఎప్పుడెళతామో..! ఎప్పుడు అనుభూతిస్తామో ఆ సమక్షాన్ని అనుకుంటూ కళ్లు మూసుకున్నాడా కుర్రాడు. అప్పుడప్పుడూ మిత్రులతో సాయంత్రాలు బ్యారేజీ మీదకు వచ్చి పచార్లు కొట్టడంలోనూ మరో తీయని అనుభూతి ఉంది. ఒకడు డీఎస్సెల్లార్ కెమెరా మెడలో వేసుకుని వస్తాడు. మరొకడు దాన్ని లాక్కుని ఏవో నాట్జియో చిత్రాల్ని తీయాలని ఆరాటపడతాడు. ఇంకొకడు ఆ ఫ్రేముల్లో బలవంతంగా బంధీ అవ్వాలని అడ్డుపడుతుంటాడు. ఈ సాయంత్రమూ అలానే వచ్చారు. అలానే తిరుగుతున్నారు. అలానే కొట్లాడుకుంటున్నారు. కానీ, కుర్రోడికి మాత్రం ఓ ఉత్సాహం మళ్లీ మళ్లీ తుళ్లింతలు కొడుతోంది. సాగర్కేమో గానీ, ఈ రోజు సాయంత్రం కొన్ని బ్యారేజీ గేట్లు ఎత్తుతారని తెలిసింది. తొలుత పారే నీటిని చూడాలనేది అతడి ఉత్సాహం. ఓ రోజున ఖాళీ పడవలో, మరో సాయంత్రం సెండాఫ్ ఇస్తున్న సూరీడు, ఇంకో రాత్రి బ్యారేజీ దీప కాంతులు... ఇలా ఎన్నో ఫొటో సెషన్లు ముగిసిపోయాయి. ఈసారి సెషన్లో మాత్రం బ్యారేజీకి అటువైపు పారుతున్న నీటితో పలకరింతలు, పలవరింతలవ్వాలి. కుర్రోడి మిత్రబృందానికి మల్లే ఇంకొన్ని బృందాలకూ బ్యారేజీ నీటిని వదిలే విషయం తెలిసిందేమో ఆనకట్టంతా జనమే. ఆ విషయం నిజమో కాదో రూఢ చేసుకోవాలని వీళ్లు, వాళ్లను.. వాళ్లు, వీళ్లనూ... అడుగుతూ కొత్త బృందాలుగా తయారవుతున్నారు.
ొొ
ఇసుక మేటలేసి.. కరువు సీమను తలపించే బ్యారేజీకి అటువైపును జలకళతో కళ్లారా చూసుకోవడం.. అరుదైన విషయంగానే ఉంటోంది. దాన్ని చూసేందుకు పై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా, లో ప్రాంతాలకు వరదలొచ్చినా... బ్యారేజీకి నీరొస్తుంది అది చాలనే మనస్తత్వాలు మాత్రం అరుదవ్వడంలేదు. గేట్లు ఎత్తేదెంత వరకు నిజమో... గానీ, ఇటువైపు రిజర్వాయర్ ఇక ఒక్క చుక్క పోసుకోలేనంత నిండుగా కనిపిస్తోంది. గేట్లు ఎత్తకుంటే.. వాటి మీద నుంచే దూకేందుకు నీరు సాహసిస్తున్నట్టే ఉంది. అప్పుడప్పుడు నీటిలోకి దూకే పక్షుల వల్ల కలిగే అలల వలయాన్ని డిస్టర్బ్ చేస్తూ మరపడవల సందడి. పెద్ద పడవ దూరానే వెళుతున్నా ఎంతోకొంత నీరు అటు తొణకుతోంది. కుర్రాడికి ఇలాంటి సాయంత్రం చూసి చాలా రోజులైంది. సరిగ్గా మాట్లాడాలంటే.. ఏళ్లే అవుతోంది. నీరెవరికి వద్దు చెప్పండి..? ఇంకా ఆకాశం మబ్బు పట్టే ఉంది. సూరీడికి దాగుడుమూతల అవకాశాన్నీ ఇవ్వడంలేదవి. అందుకే కాంతి ఓ కొత్త రంగులో సాయంత్రాన్ని మెరిపిస్తోంది. దూరానున్న కొండలు భారీవర్షానికి తలారా స్నానాలు చేస్తున్న దృశ్యం మసకమసగ్గానే కనిపిస్తున్నా ఏదో అద్భుత దృశ్యాన్ని డీఎస్సెల్లార్ బంధించే అవకాశమిస్తోంది. ఆ దృశ్యం బ్యాక్‌గ్రౌండ్‌లో కుర్రాడి మిత్రులు రకరకాల పోజులతో సెషన్ కానిస్తున్నారు. కుర్రాడిని ఆ నేపథ్యానికి అతికిస్తున్నారు. సాయంత్రం గొప్పగా ఉంది. సన్నటి చినుకులతోడి వర్షంతో తడి చేరి మరింత ఆర్ధ్రంగా ఉంది. అంతస్సేపు ఎండకు కాలిన బ్యారేజీ గోడ, రోడ్డు మీది నుంచి నులివెచ్చని నెగడు కుర్రాడి ముఖానికి తగులుతోంది. చిన్నప్పుడు తలస్నానమయ్యాక తలతుడిచే అమ్మకొంగు ముఖానికి తగిలినట్టే ఉందానుభూతి. కుర్రాడు వర్షానికి, నీటికి ఉద్వేగం పొందుతాడు. తన ఎలిమెంట్ ఏంటని అడగక్కర్లేకుండానే.. టకాల్న 'జలం' అంటూ మిత్రులకు భావోద్వేగాన్ని పంచుకున్నది చాలాసార్లే. అందుకే ఫొటో సెషన్ల కన్నా, కొత్త ముఖారవిందాల అరక్షణ పరిచయాల కన్నా, కొత్త స్నేహాల కలివిడి కన్నా ఆ పారే తొలి నీటికై బ్యారేజీ రెయిలింగ్ మీద రెండు చేతులు ఆనించి చోటు తనది చేసుకున్నాడు.
ొొ
అప్పటికే గంటన్నర గడుస్తోంది. బ్యారేజీ గేట్లు ఎత్తుతారన్న దానిపై చాలామందికి విరక్తి కలిగిందేమో...! జట్లలోంచి బొట్లు బొట్లుగా బయటపడుతున్నారు. వాళ్లు వెనుదిరుగుతున్నా.. వస్తోన్న కొత్తవారితో బ్యారేజీ నిండు కుండలానే కనిపిస్తోంది. కుర్రాడు బ్యారేజీ మీదకు వచ్చిన ప్రతి సాయంత్రం లానే స్టార్లింగ్ పిట్టల మర్మరేషన్ ఆకాశాన ఏదో మర్మ నృత్యం చేస్తోంది. ఎందుకలా... వందలాది పిట్టలు ఒకే శైలిలో, ఒకే డైరెక్షన్లో సింక్రనైజ్డ్ డ్యాన్స్ చేస్తాయనే దాని మీద మిత్రుల మధ్య చర్చ లేచింది. అదో మనుగడ కిటుకు అని సర్వైవల్ టెక్నిక్‌ని చెప్పాడో భాషాభిమాని. నాట్జియోకి ఫొటోలు తీయాలనే లక్ష్యమున్న మరో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చర్చలోకి మనస్సుని ఫోకస్ చేశాడు. కుర్రాడి బృందం ఆ విషయాన్ని అంత సీరియెస్సుగా మాట్లాడుకుంటుంటే... పక్కనున్న మరికొందరు నోరెళ్లబెట్టి ఆకాశం వైపు చూస్తున్నారు. పిట్టల నృత్యం కెరటాల కొట్లాటలానే ఉంది. మెత్తగా ముఖాన్ని తడిమి, తడిపి తప్పించుకుపోయింది చిరు వర్షం. అప్పటికే అక్కడ కొన్ని గంటలు తిరిగాక ఒక్కసారిగా మొనాటనీ ఆవరించింది. ప్రకృతి కూడా ఆవులించే సమయం కావొస్తుండటంతో ఈ రోజుకి గేట్లు తెరచే సూచనలు లేక సగం జనం ఖాళీ అయ్యారు. మిత్రబృందానిదీ అదే అసంతృప్తే. ఏ అర్ధరాత్రికో తెరిస్తే...! విజువల్స్‌ని నెట్‌లోనో, టీవీలోనో చూస్కోవాల్సిందే. అసలీ సంగతి ఇట్టే తెలిసేది.. బ్యారేజీ మీద ఉంటే కాదు, కట్టెమ్మట తలదాచుకున్న వాడ కాని వాడలోనే..! కుర్రాడికి ఆలోచన తట్టింది. ఆ కట్ట వెంబడి తాత్కాలికంగా వేసుకున్న ఇళ్ల దగ్గరకు వెళితే సంగతి తెలుస్తుంది. నీళ్లొదిలే పనైతే వీళ్లను ఖాళీ చేయిస్తారు.
ొొ
బళ్లను బ్యారేజీ దాటించి కట్టెమ్మట హుషారుగా వెళుతున్నారు మిత్రులు. దూరం నుంచే కుర్రాడికో దృశ్యం కనిపించింది. ఊరంతా చోటు ఖరీదై నెట్టేస్తే.... ఓ కునుకుపాటు కోసమని, ఓ పైపైన స్నానానికని.. కన్నబిడ్డలకో టార్పాలిన్ పట్టా గూడున్నా చాలని, తమ దేహావసరాలకు, ప్రేమానుబంధాల ఊసులకు ఇంత చాటున్నా చాలని... ఎన్నో బక్కపల్చటి బతుకులు కట్టకు ఆనుకుని సేదతీరుతాయి. బడుగు దేహాలకిప్పుడు నగరం మనస్సు మరీ ఇరుకైపోయి కట్ట కిందకూ తాటాకు పరుచుకుంటూ పోయింది. వానకాలం బతుకు ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో కట్ట దగ్గర ఓ వర్షం కురిసిన రాత్రి వచ్చి కాసేపు ఆ వాడలోకి తొంగి చూస్తే సరిపోతుంది. ఆ వద్దనుకునే అవకాశం తొలిసారి కుర్రాడికి కలిగింది. వాడంతా ఒకటే హడావిడి. వీలైనంత ఇంటిని ఎగువకు మోసుకుపోవడం.. ఏటా ఓ కసరత్తు. మిత్రులు బళ్లు చాలా దూరంలోనే ఆపేశారు. వీళ్లున్న కట్ట పైభాగం ఇంకా వెలుతుర్లలో ఉన్నా.. కట్ట కింది భాగంలో దీపాలు ముట్టాయి. అనేక మసకవెలుగులు వాడను చుట్టుముట్టాయి. కట్ట కిందే కాదు, దాదాపు నది ప్రవాహ మార్గంలో మధ్యకూ ఓ ఇల్లనలేని ఇల్లు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోంది. కుర్రాడు కళ్లు నొక్కుతూ చూశాడు. అక్కడేదో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఓ కుటుంబం ఆ ఇంటికి కట్టిన పట్టాల్ని, తడికెల్ని బలవంతాన ఊడదీస్తోంది. నిమిషాల్లోనే ఆ ఇల్లు ఖాళీ అయిపోయింది. తల్లిదండ్రులు పెద్ద బరువునేదో మీదేసుకుని కట్ట మీదకు కదులుతోంటే... వారి చిన్నారి విరిగిపోయిన ఓ పట్టా ముక్కను ఇసుకలో బలవంతాన ఈడ్చుకుంటూ వాళ్లను అనుసరిస్తున్నాడు. చెదురుమదురు ఇంటి అవశేషాలు తప్ప అక్కడ ఏం మిగల్లేదు. కుర్రాడి కళ్ల ముందే ఓ బతుకు అక్కడ ఖాళీ అయిపోయింది. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో చీకట్లు అలముకున్నాయి. కట్ట మీదున్న మిత్రుల బృందం పక్కనే విద్యుత్ స్తంభం నిద్ర మేల్కొని టపటపలాడుతూ కాంతిని ఒక్కసారిగా కుర్రాడి కళ్లలోకి విసిరికొట్టింది. ఈ హడావిడి చూస్తుంటే కచ్చితంగా బ్యారేజీ గేట్లు ఎత్తుతార్రా... అయితే, అది రేపేమో...! అని ఒకడు, డీఎస్సెల్లార్ మెమరీ చూస్కోరా..! అంటూ ఇంకోడు బైక్‌ల మీదే కూర్చుని హోషియార్ అవుతున్నారు. ఇక పదండ్రా వెళ్దామంటూ మూడోవాడు కదపంగానే రెండు బైకులూ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. వాళ్ల కబుర్లలో మునగకుండా... ఏదో ఆలోచనల ఒడ్డుకు కొట్టుకుపోయాడు కుర్రాడు. ఏం మాట్లాడకుండానే ఓ బైక్ వెనుకెక్కి మెల్లిగా కూర్చున్నాడు. బైక్ కట్ట దాటుతుందనగా.. ఓసారి వెనక్కు తిరిగి చూస్తే... ఆ కుటుంబం కట్ట దిగువ వరకు వచ్చింది కనిపించింది. బుడ్డోడు ఇంకా ఆ పట్టా ముక్కను వదలకుండానే బలంగా లాక్కొస్తున్నాడు.
- అజై
95023 95077