డిగ్రీ చదువుకున్న ఓ యువకుడు సినిమా వ్యామోహంతో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నపట్నం చేరాడు. అక్కినేనిని కలిసి తన మనసులో మాట వినిపించాడు. ఆయన మాటలు విన్న అక్కినేని 'ముందు సినిమా నిర్మాణాన్ని గమనించు. లోటుపాట్లు తెలుసుకో. అన్ని విషయాలపై పూర్తి అవగాహన వచ్చాక నువ్వు ఏ పనిని సమర్ధవంతంగా నిర్వహించగలవో నిన్ను నువ్వు అంచనా వేసుకొని ముందడుగు వెయ్యి. అక్కినేని చెప్పిన మాటలు పదేపదే వల్లె వేసుకుంటుండేవాడు రాజేంద్రప్రసాద్. ముందు నిర్మాతయ్యాడు. అనురాధ చిత్రం తర్వాత ఆరాధన... ఇలా అన్నీ సూపర్‌హిట్ చిత్రాలే. అనతికాలంలోనే ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ మారాడు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న జగపతి సంస్థల అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రమే 'దసరా బుల్లోడు'.
వి.బి. రాజేంద్రప్రసాద్ భారీ చిత్రాల నిర్మాత. ఎవరితోనూ మాటపడడు. ఎవరికీ ఒక పైసా బకీ పడడు. ఆపదంటే ఆదుకుంటాడు. నటీనటులకు పారితోషకం కచ్చితంగా ఇచ్చేస్త్తాడు. ఇకపోతే ఎవరయినా మాట తప్పితే క్షమించలేడు. ఇది సినిమా దర్శకత్వానికి ఎంతవరకూ మేలు చేస్తుంది? ముఖ్యంగా పెద్ద నటులతో సినిమా తియ్యాలంటే లౌక్యం కావాలి. సర్దుకుపోయే మనస్తత్వం కావాలి. ఈ గుణాలు రాజేంద్రప్రసాద్‌లో లేవు. దర్శకత్వంలోకి వద్దని శ్రేయోభిలాషులు కొంతమంది సున్నితంగా మందలించారు. వి.బి ఒకసారి ముందడుగేస్తే తిరిగి వెనుతిరగడు. దర్శకుడవ్వాలనే తన ఆలోచనను అక్కినేనికి చెప్పాడు. అక్కినేని ఒకటే సలహా ఇచ్చాడు. 'అడుగు ముందుకేశావు కదా..! చావో రేవో తేల్చుకో, ఇక చెయ్యాలా వద్దా అన్న ఆలోచన విరమించుకో పనిచెయ్యడం మొదలుపెట్టు. జీవితంలో ఇదీ ఒక అనుభవంగా మిగులుతుంది!' అన్నారు.
ఆత్రేయ అండ
జగపతిసంస్థ ఆస్థాన కవి ఆత్రేయ. ఆయనకు కథ వినిపించారు వి.బి.రాజేంద్రప్రసాద్. పల్లెటూరి నేపధ్యంలో.. అందమైన మనసుల మధ్య సాగిన ప్రేమకథ 'దసరాగుల్లోడు' కథ. ఈ చిత్రంలో హారో వి.బి అభిమాన హీరో అక్కినేని. కథకు తగ్గట్టుగా అక్కినేని పాత్రను రూపొందించాలి. ట్రయాంగిల్ ప్రేమకథ గనుక గుండెలవిసిపోయె సెంటిమెంటునీ జత చెయ్యాలి దీనితోపాటు సినిమా అంతా సందడిగా ఉండాలి అంటూ నిర్మాతగా దర్శకుడిగా తన మనసులో మాట చెప్పాడు. ఆత్రేయగారు దీర్ఘాలోచన చేసి వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రసాద్‌గారి గుండెల్లో రాయి పడింది. ఆత్రేయకు కథ నచ్చలేదో తను డైరెక్షన్ చెయ్యడం నచ్చలేదో అర్థం కాలేదు. అయినా తన మొండి ప్రయత్నాన్ని విరమించుకోలేదు. రెండురోజుల తర్వాత తెల్లారు జామునే ఆత్రేయ వచ్చి 'కంగ్రాట్స్ ప్రసాదు! గొప్ప సినిమా తీస్తున్నావు. నీ కథలో క్లారిటీ ఉంది. గుండెని కదిలించింది. కనీసం వందరోజులు దర్జాగా ఆడుతుంది. నేను గ్యారంటీ నువ్వే డైరెక్షన్ చెయ్యి మాటలు నేనే రాస్తాను. పదిరోజులు టైమివ్వు' అంటూ అభయం ఇచ్చారు. ఆత్రేయలో చిత్రమైన గుణముంది. ఆయన మనసుకి నచ్చాలేకాని కవిత్వం పొంగి పొర్లుతుంది. కేరెక్టర్స్్ రూపుదిద్దుకున్నప్పుడే పాటల పల్లవులు పుట్టుకొచ్చాయి. సినిమాలో సన్నివేశాలన్నీ మనసును హత్తుకున్నాయి. చరణాల్లో పాటల మనస్తత్వాన్నే పొదిగాడు. సినిమాకి మాటలు పాటలూ సిద్ధవయ్యాయి.
పాటలన్నీ ఆణిముత్యాలే
సంగీతపరంగా సినిమాని సూపర్ హిట్ చెయ్యాలని కంకణం కట్టుకున్నారు ఆత్రేయ, కె.వి.మహదేవన్ ఇద్దరూ. కోనసీమ అందాలు గోదావరమ్మ పరవళ్ళు బంగారు జలపాతాల్లాంటి ఇసుక తిన్నెలూ దసరా బుల్లోడు సిగేచరు కారు. (వి.బి రాజేంద్రప్రసాద్ ఇష్టపడి కొనుక్కున్న కారు) వయసులో ఉన్న పాత్రల ఉరవళ్ళూ... అన్నీ కలిసొచ్చాయి. ముఖ్యంగా అక్కినేని వాణిశ్రీపై చిత్రీకరించిన పాటలన్నీ సూపర్హిట్లే. 'అరెరెరె..... ఎట్టాగ ఉంటాది ఓలమ్మీ ఏటేటో అవుతాది చిన్నమ్మీ!' ఘంటసాల సుశీల పాడిన పాట ఇది. అక్కినేని, వాణిశ్రీ పోటీపడి నటించారు. 'ఓ మల్లయ్యగారి ఎల్లయ్య గారి కల్లబొల్లి బుల్లయ్యో అయ్యా బుల్లయ్య నీ అవతారాలెన్నయ్యా...' దసరాబుల్లోడు బృందం పాడుకున్న పాట. ఘంటసాల పిఠాపురం బృందం పాడారు. 'చేతిలో చెయ్యేసి చెప్పు బావా' ట్రాజెడీ కామెడీ రెండు పాటలున్నాయి. వాణిశ్రీ అక్కినేనిపై చిత్రీకరించారు. ఈ పాటలకి అక్కినేని, వాణిశ్రీ జీవం పోశారు. 'నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే...' చంద్రకళ, వాణిశ్రీపై చిత్రీకరించిన ఈ పాట ట్రాజెడీ, కామెడీ రెండు వెర్షన్లలో ఉంటుంది. ఈ పాట వింటుంటే పాటలా ఉండదు కథ చెబుతున్నట్లు ఉంటుంది. అంతగా సందర్భానికి అతికిపోయింది. 'పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ' అని హీరో అంటే 'కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండెల్లో చిక్కుకుందేమో చూడు బుల్లోడా' ఇటువంటి పాటలు ఆత్రేయ తప్ప ఇంకెవరు రాయగలరు?. ఈ పాటలు పెళ్ళి పందిర్లలో మార్మోగి పోతుండేవి. ఈ చిత్రంలో 'తాగుబోతు నిలబడేది నేలమీద కాదు మాటమీద' అనే డైలాగ్ రాసింది ఆయనే. కె.వి.మహదేవన్ పల్లె పదాలకు గొప్ప స్వరాలతో ప్రాణం పోశారు.
ఇదీ కథ
గోపి (అక్కినేని)ని వాసు (గుమ్మడి), యశోద (అంజలి) దత్తత తీసుకుని అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దసరాబుల్లోడిగా పిలుస్తుంటారు. మేనమామ బుల్లయ్య (నాగభూషణం), భూకామందు. అతని కూతురు చంద్రకళ (నిర్మల)కు బావంటే పిచ్చిప్రేమ. దసరా బుల్లోడికి దూరపు చుట్టం రాధ (వాణిశ్రీ). ఈవిడ దసరాబుల్లోడుకి తగిన గడుసుది. ఈవిడ ప్రేమలో పడతాడు బుల్లోడు. భూకామందు బుల్లయ్య తన కూతుర్ని బుల్లోడికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. బుల్లోడు రాధకు మనసిచ్చాడని తెలిసి అతన్ని పెంచుకున్న బుల్లయ్య తన అన్నా వదినల నుంచి బుల్లోడిని వేరు చేస్తాడు. నిర్మలకు క్యాన్సర్ అనే విషయం దాచిపెడతాడు. తను పెళ్ళికి అనర్హురాలని తలచిన నిర్మల తన ప్రేమను రాధ కోసం త్యాగం చేస్తుంది. చివరికి రాధకు గోపీకి పెళ్ళవుతుంది. సినిమా ప్రథమార్ధం సాఫీగా సాగుతుంది. ద్వితీయార్ధం నుంచి ఊహించని మలుపుతో కథ క్లైమాక్సు కొచ్చేసరికి పరాకాష్టకు చేరుకుంటుంది. వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం అఖండ విజయం సాధించింది. ఎక్కడెక్కడ్నుంచో బళ్ళు కట్టుకుని పట్టణాల్లో ఈ సినిమా చూడ్డానికి వచ్చారు. ముఖ్యంగా అక్కినేనికీ వాణిశ్రీకీ స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం 'దసరా బుల్లోడు'.
అక్కినేని కంటే ఎక్కువ
ఏ చిత్ర సీమలో అయినా ఎక్కువ పారితోషికం హీరోకే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో పాత్రపరంగానే కాక అద్భుతమైన నటన కనబరిచిన వాణిశ్రీకి అక్కినేని కంటే ఎక్కువ రెమ్యునరేషను ఇచ్చారు. 'దసరా బుల్లోడు' చిత్రం తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకపోయింది.
క్లైమాక్స్‌లో ...
చిత్రం క్లైమాక్సు షూటింగ్లో అక్కినేని స్వయంగా (దసరాబుల్లోడు) కారుని డ్రైవ్ చేసుకొంటూ వచ్చి ప్రహరీ గోడకు డాష్ ఇస్తాడు. ఆ సీన్లో అక్కినేని గాయపడ్డాడు. అంటే అక్కినేని పాటల్లో ఎలా ప్రాణం పెట్టి హుషారుగా నృత్యం చేశాడో పతాక సన్నివేశంలో అంతే కష్టపడి తన పాత్రకి జీవం పోశాడు. వాణిశ్రీ, చంద్రకళ, యస్.వి.రంగారావు, నాగభూషణం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం, సూర్యకాంతం, ఛాయాదేవి, ఝాన్సీ తదితర తారాగణం అంతా చిత్రానికి జీవం పోశారు. శతదినోత్సవం చేసుకుంటుందనుకున్న ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడటం విశేషం!!
- ఇమంది రామారావు, 9010133844
దసరా బుల్లోడు
