నగరాల్లో జీవనం అంటే ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. అందుకే కొందరు ఇళ్లల్లో పనులు చేయడానికి పనిమనుషులను పెట్టుకుంటారు. అలా పనికి కుదిరే వారిలో చాలామంది ఆర్థిక స్థోమతలేక పిల్లలను బడికి పంపరు. అందరిలాగే వాళ్ళకూ ఓ కుటుంబం ఉంటుందనీ.. వాళ్ల పిల్లలకూ చదువు అవసరమని ఎంతమంది ఆలోచిస్తారు. అలాంటివారు ఎంత వెదికినా దొరకడం కాస్త కష్టమే అనిపిస్తుంది కదూ! కానీ, బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ సొసైటీ వారు మాత్రం అదేం పెద్ద కష్టమేం కాదు అంటున్నారు. అంతేకాదు, ఏకంగా పని మనుషుల పిల్లల్ని చదివించడమే పనిగా పెట్టుకున్నారు.
సాధారణంగా అపార్టుమెంట్లలో ఉండేవారు పని మనుషుల బాగోగుల్నే అంతగా పట్టించుకోరు. ముద్దు పేర్లు, వరసలతో పిలుస్తున్నా కూడా ఆ అనుబంధం అక్కడితో ఆగిపోతుంటుంది. ఎక్కడో ఎవరో ఒకరు కుటుంబ సమస్యలు వినే ఓపిక చేసుకుంటారు. కుదిరితే అరకొర సాయానికి ఊకొడతారు. నిత్యం ఇంటిలో మనిషిగా మెదిలే పని మనిషి పరిస్థితే అలా ఉంటే ఇక వారి పిల్లల బాగోగుల గురించి అయితే వేరేగా చెప్పాలా! కానీ వీళ్లు అలాకాదు అనేలా బెంగళూరులోని టాటా షేర్వుడ్ రెసిడెన్షియల్ సొసైటీ గృహస్తులు ఓ మంచి మార్పుకు చేతులు కలిపారు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో పనిచేసే (పనిమనిషి)వాళ్ల పిల్లలకు ప్రతి ఆదివారం సొసైటీ ఆధ్వర్యంలో రెండు గంటలు ప్రత్యేక ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు, అపార్టుమెంటులో పనిచేసే వారి పిల్లల్ని బడిబాట పట్టించేందుకు అవసరమైన డబ్బును చందా రూపంలో వసూలు చేసి మరీ వారికి అందిస్తున్నారు.
ఓ ఘటన కదిలించి..
రెండేళ్ల క్రితం నాటి దీపావళీ పండుగ ముందు రోజు జరిగిన ఓ సంఘటన ఫలితంగా ప్రారంభమైందీ మార్పు. సొసైటీలో పనిచేసే వంటవాడు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన కుటుంబం వెంటనే హస్పటల్‌కి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. అతనికేదో ప్రేగుకు సంబంధించిన సమస్య ఉందని. ఆపరేషన్ కోసం 4 లక్షలు అవుతాయని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. వారి కష్టం గురించి సొసైటీ సభ్యులకు తెలిసింది. ఇంటిదారులంతా కలసి చందా రూపంలో వసూలు చేసి సాయం చేయాలనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అంత డబ్బు సమకూరలేదు. అంతా కలసి ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్్ సెక్షన్, ప్రభుత్వ సంస్థలు ఇలా చాలామందిని సాయం అడిగారు. సొసైటీకి సంబంధించిన గూగుల్ ప్లస్ సామాజిక మాధ్యమం గ్రూప్‌కి ఓ మెయిల్ చేశారు. 96 గంటల్లో 3 లక్షల రూపాయలు సమీకరించాడు. అలా కొంతమంది స్నేహితులు, బంధువులు అంతా
కలిసి రూ. 4.5 లక్షలు పోగు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ఆ వంట మనిషి కొద్దిరోజుల్లోనే ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చారు. ఇది ఎక్కడలేని ఆనందాన్ని, తృప్తిని నివాసకుల్లో కలిగించింది. అందరూ తలోచేయి వేస్తే ఓ మనిషి ప్రాణాన్ని నిలబెట్టొచ్చనే విషయం మాటల్లో కాక చేతల్లో తెలిసింది. అదే స్ఫూర్తిగా వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. వంట మనిషితోపాటు సాటి పని మనుషుల సమస్యల గురించి కూడా అప్పుడప్పుడు విన్నవారే. అందుకే వారి సంక్షేమానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సీకర్స్‌గా మారారు. సొసైటీ వాళ్లంతా కలిసి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికే వారు సేకరించిన డబ్బులు కొంత మిగిలి ఉన్నాయి. వాటిని దేనికోసం ఉపయోగించాలా? అని బాగా ఆలోచించిన తర్వాత వారంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ పోగయిన డబ్బులను షేర్వుడ్ సోసైటీలో పనిచేసే వారి పిల్లల స్కూల్ ఫీజులకు ఇస్తే సరిపోతుంది అని, అదే వారి మొదటి ఎజెండాగా తీసుకున్నారు. అలా అప్పటి నుంచి డబ్బులు సేకరించడం, దానిని వారి పిల్లల ఫీజులకు ఉపయోగించటం అనేది వారి కార్యక్రమంగా మారిపోయింది. దీని ప్రారంభం మొదటి సంవత్సరం ఒకటి నుంచి పదోతరగతి వరకు చదివే 40 మంది పిల్లల చదువులకు సహకారం అందించారు. ఇంత చేస్తున్నా వారికి ఏ మూలో పిల్లల చదువులపై చిన్న సందేహం కలిగింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులను కలిశారు. వారితో మాట్లాడిన తర్వాత పిల్లలకు స్కూల్ ఫీజు కడితే సరిపోదని వారికి అర్థమైంది. దాంతో వారు ఓ నిర్ణయానికి వచ్చారు. పిల్లల స్కూల్ ఫీజుకు సరిపోయే డబ్బే కాకుండా వారికి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అందుకే ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 9 గంటల వరకు 40 మంది పిల్లలకు ఇంగ్లీషు, గణితం సబ్జెక్ట్‌లు ట్యూషన్ చెబుతున్నారు.
ఏటా ఈ గ్రూప్ 175 మంది పిల్లలకు చందా పోగుచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే? పదోతరగతి పిల్లలకు వారం మొత్తం స్కూళ్లు తర్వాత ట్యూషన్ చెప్పేందుకు కొంతమంది సిద్ధమైయ్యారు. ఈ ఎనిమిది మంది వాలంటీర్లు మాత్రమే కాకుండా ఇంకా ఇప్పుడు ఆ గ్రూపులో మరో ఆరుగురు చేరారు. వాళ్లకు సమయం దొరికినప్పుడల్లా పిల్లలకు ట్యూషన్ చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. వీరిలో ఎవరూ ఉపాధ్యాయులు లేరు. కానీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నైపుణ్యం సాధించి ప్రయత్నిస్తున్నారు. వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా చేస్తున్నారు. ఈ తరగతుల వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
- అమల తిలారు


