తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' పుట్టింది 1932లోనైతే ఆ తరువాత ఓ పదేళ్లకు పైగా తెలుగు సినిమాలు పూర్తిగా రంగస్థల నాటకాల తరహాలోనే చిత్రీకరణ జరుపుకుని మూస ధోరణిలోనే ముందుకు సాగాయి. సినిమా కథ, కథనాలు, నటన, చిత్రీకరణల్లో తొలి మార్పులు తెచ్చింది బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డిలు. ఆ శైలిని దాటి ఒకడుగు ముందుకు వేసి సినిమా అనేది నాటకాల శైలిని దాటి నటన, సంభాషణల్లో సహజత్వమూ, సినిమాటిక్ పిక్చరైజేషన్ జరుపుకుని తెర మీదికి వచ్చిన తొలి సినిమా 'గృహప్రవేశం'. తెలుగు సినిమాకు సరికొత్త పోకడల్ని మలిచి నగిషీలు దిద్దిన ఎల్.వి ప్రసాద్ దర్శకునిగా తొలి సినిమా కూడా అదే. ఓ సీరియెస్ కథను తేలికగా చెప్పే 'బాంబే టెక్నిక్'ను తొలిసారి వాడి తెలుగులో విజయవంతం చేయడం అప్పట్లో సంచలనం. అదే ఏడాది 'మంగళసూత్రం' చిత్రంలో తొలిసారి ఫ్లాష్ బ్యాక్ శైలిని ఉపయోగించారు. ఒకే ఏడాది రెండు కొత్త ప్రయోగాలు తెలుగు సినిమాలో జరిగాయి. 1946లో విడుదలైన 'గృహప్రవేశం' సినిమా ఈ ఏడాది అక్టోబర్ 4న 70 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నది.
ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి ప్రత్యేక కథనం.
1938లో సారథి చిత్ర నిర్మాణ సంస్థ ఆవిర్భావం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోదగినది. ఈ సంస్థ సినిమాలు తీయడమంటే వ్యాపారం మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా అందులో ఇమిడి ఉండాలనే సదాశయంతో గొప్ప సినిమాలు తీశారు. తొలిచిత్రం 'మాలపిల్ల' (1938)లో కులం సమస్యను, రైతుబిడ్డ (1939)లో రైతుల వ్యధలను చూపితే తరువాతి 'పత్ని' (1942)లో స్త్రీ శక్తిని చాటి 'పంతులమ్మ' (1943)లో రాజకీయాలను తూర్పారబట్టారు. తరువాతి 'మాయాలోకం' (1945) జానపదం. ఈ చిత్రాలన్నింటికి అభ్యుదయ వాది గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. అయితే 1946 నాటికి కొత్త సినిమా 'గృహప్రవేశం' నిర్మాణం ప్రారంభించే నాటికి రామబ్రహ్మం అనారోగ్యం పాలు కావడంతో చల్లపల్లి రాజా (సారధి నిర్మాత) వారు తన సోదరుడు వై.శివరామప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావులకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. కె.ఎస్.ప్రకాశరావు అప్పటికే సారధీ వారి 'పత్ని'లో హీరోగా నటించి ఉన్నారు.
'గృహప్రవేశం' చిత్రానికి కథ, మాటలు రాసింది త్రిపురనేని గోపీచంద్. సారథీ సంస్థతో తొలినాటి నుండి అనుబంధం ఉన్నవాడు. 1939 నాటి రైతుబిడ్డ చిత్రానికి రచన చేయడమే గాక సహ దర్శకునిగా పని చేశారు. తరువాత వీరిదే 'మాయాలోకం' (1945) సినిమాకు కూడా రచన చేశారు. ఇక 'గృహప్రవేశం' నాటికి సినిమాను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారాయన. ఆ సినిమాకు దర్శకత్వం కూడా గోపీచంద్‌నే చేయమన్నారు. సినిమా వ్యవహారాలు చూస్తున్న కె.ఎస్. ప్రకాశరావు డైరెక్షన్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాడిని సహాయ దర్శకునిగా నియమించుకోవాలని బొంబాయి నుండి ఎల్.వి.ప్రసాద్‌ను మద్రాసుకు తీసుకువచ్చారు.
ఆంధ్ర పత్రిక 1946 అక్టోబర్ 13 నాటి సంచికలో ''గృహప్రవేశం'' సమీక్షలో ఇలా రాశారు.
'ఫిలిం ద్వారా ఈ బోధ చేసేందుకు కథకుడు శ్రీ గోపీచంద్, కాలగతిని గుర్తించక అపమార్గానపోయే పాత్ర ఒకటీ, కాలగతిని గుర్తించి, తదనుసారం నవీన భావాలతో, నవ్యాశయాల కోసం కృషి చేసే ఒక పాత్రనూ సృష్టించి, ఈ రెంటికీ ఒక దృక్పథం రీత్యా ఘర్షణ కలిగించి, తుదకు అపమార్గాన పోయే పాత్ర సవ్యమైన మార్గంలోకి వచ్చి తీరవలసిన ఆవశ్యకతను నిరూపించారు. మొదటిది నాయక పాత్ర, రెండవది నాయిక పాత్ర, ఈ రెండు పాత్రల ఘర్షణకు దోహదమిచ్చేందుకు విభిన్న ప్రకృతులు గల పాత్రలను సృష్టించి కథ రసవత్తరంగా సాగే మార్గం యేర్పాటు చేశారు'.
సినిమా అంతా టేకింగ్స్‌లో నూతన పోకడలతో సాగుతుంది. సీరియస్ విషయాన్ని కామెడిగా చెప్పడంలో సఫలీకృతుడైన ఎల్.వి.ప్రసాద్ దర్శకుడిగా తొలిచిత్రమే అయినా పరిణతి చెందిన వాడిగా నిరూపించుకున్నాడు. కానీ హీరోగా తన పాత్ర కాస్త తగ్గించుకున్నట్లుగా కనిపిస్తుంది. భానుమతి నటన శిఖర స్థాయిలో ఉంటుంది. అప్పటికే ఆమె 'స్వర్గసీ మ'లో పెద్ద స్టార్‌డమ్‌ని అందుకుని ఉన్నా, గృహ ప్రవేశంలోని నటన దానికి ఒకడుగు ముందుకే పడింది. ఇక సి.ఎస్.ఆర్. రమణారావుగా తెరపై వీర విహారమే చేస్తాడు. ''హల్లో మైడియర్ తులశమ్మక్కా'' అన్న అతని డైలాగ్ ఆ రోజుల్లో ఊతపదమై వ్యాపించింది. ఆయన సరసన లలితగా నటించిన జూనియర్ శ్రీరంజని చాలా మందికి శోకపాత్రల నాయికగానే తెలుసు. కానీ ఆమెతో చలాకీ పాత్ర చేయించి మెప్పించడం దర్శకుని ప్రతిభకు నిదర్శనం.
గృహప్రవేశం విడుదలైన 1946లో మొత్తం 10 తెలుగు సినిమాలు విడుదలైనవి. వీటిలో రెండే సాంఘికాలు. 'గృహప్రవేశం' మొదటిదైతే రెండోది కోన ప్రభాకరరావు 'మంగళసూత్రం'. 'మంగళసూత్రం'లో తొలిసారిగా ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు కనిపిస్తే, 'గృహప్రవేశం'లో బాంబే టెక్నిక్‌గా చెప్పుకునే సాంకేతికత కనిపిస్తుంది. ఇది తెలుగు సినిమాను సాంకేతికంగా మలుపు తిప్పిన పరిణామం.
సినిమాలోని 'బానిసలం బానిసలం',
'వెనుకడెదేలనోయి' స్వర్గసీమ కులుకు, అమ్మా అమ్మా, హాలాహలమెగయునో పాటల వరుసలు కర్ణ ప్రియంగా ఉంటవి. సంగీతం చేసినది బాలాంత్రపు రజనీకాంతరావు. ఆకాశవాణి ఉద్యోగి కావడం వల్ల నళినీకాంతరావు పేరుతో చేశారు. సినిమా కథనాన్ని నడిపించడంలో కొత్తరీతులు తొక్కిన ఎల్.వి.ప్రసాద్ తను తరువాత తీసిన 'పెళ్లి చేసి చూడు', 'మిస్సమ్మ' చిత్రాలకు పునాదులు 'గృహప్రవేశం'లో పడ్డాయనిపిస్తుంది. 1946 అక్టోబర్ 4న విడుదలైన గృహప్రవేశం ఆ తరువాత సింహళభాషలో కూడా విడుదలవుతుందని ప్రకటన వచ్చింది.
అయితే చివరగా రెండు మాటలు చెప్పుకోవాలి. గృహప్రవేశం సినిమాకు అనుభవం లేదన్న సాకుతో దర్శకత్వం అవకాశం రాకపోయినా 1950లో ''లక్ష్మమ్మ'' సినిమాకు దర్శకత్వం వహించి, పోటీగా వచ్చిన స్టార్స్ నటించిన ''లక్ష్మమ్మ కథ''ను వెనకవేసి విజయం సాధించిన వాడు త్రిపురనేని గోపీచంద్.
గృహప్రవేశంతో దర్శకుడైన ఎల్.వి.ప్రసాద్ ఆ తరువాత భారతదేశం గర్వించదగిన దర్శక, నిర్మాతగా ఎదిగి తెలుగు కీర్తిని ఎల్లడలా చాటారు.
అనుకోని మార్పులు
ఎల్.వి.ప్రసాద్ బొంబాయిలో తొలిటాకీతో మొదలు పలు తెలుగు హిందీ చిత్రాల్లో నటించడమే గాక ప్రొడక్షన్ వ్యవహారాల్లో మంచి అనుభవం సంపాదించి ఉన్నారు. పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీ థియేటర్స్‌లో నటునిగా, సహాయ దర్శకునిగా పని చేసి ఉన్నారు. హెచ్.ఎం.రెడ్డి వద్ద శిష్యరికం చేసి ఉండటం కూడా అదనపు అర్హతగా నిలిచింది. అసిస్టెంట్‌గానే గాకుండా హీరోగా కూడా ఎల్.వి.ప్రసాద్ ఎంపికైనారు. తనకు హెచ్.ఎం.రెడ్డి వద్ద సహచరుడుగా ఉన్న పాలవాయి రామకృష్ణను వెళ్లి హీరోయిన్గా భానుమతి నటించడానికి ఒప్పించమన్నారు. అప్పట్లో తాము తీయాలనుకున్న 'రత్నమాల'ను వాయిదా వేసి భానుమతిని 'గృహప్రవేశం' సినిమాలో నటించడానికి ఒప్పించారాయన. ఇలా అంతా సిద్ధమైన సమయంలో అప్పటి వరకూ దర్శకత్వం చేయాల్సిన గోపీచంద్ స్థానంలో ఎల్.వి.ప్రసాద్‌ను ప్రకటించాల్సి వచ్చింది. గోపీచంద్ కొత్తవాడని (దర్శకత్వానికి) అతడిని నమ్మి డబ్బు పెట్టలేమని డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గటంతో ఎల్.వి.ప్రసాద్‌ని దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. గోపీచంద్ స్క్రిప్టు రైటర్‌గానే ఉండిపోయారు.
ఈ పరిణామాల తరువాత సినిమాను చూస్తేనే అర్థమైపోతుంది. గోపీచంద్ సీరియస్‌గా రాసిన స్క్రిప్టులో ఎల్.వి.ప్రసాద్ డైరెక్టర్ కాగానే కామెడీ డామినేట్ చేసిందని, బొంబాయి శైలికి భిన్నంగా తెలుగు సినిమాలుంటాయి. కానీ ఎల్.వి.ప్రసాద్ తనదైన స్టైల్లో సినిమాను తీశారు. మెలో డ్రామాను తగ్గించడం కోసం కామెడీనీ వాడుకున్నారు. సినిమాలో ఇతివృత్తం సామాజిక సమస్యే అయినా దాన్ని హాస్యస్పోరకంగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రసాద్. అందులో ఆయన సఫలీకృతుడైనారు కూడా.
సామాజిక సమస్యను సహజంగా..
భారత స్వాతంత్య్రం సిద్ధించే సంధికాలంలో రూపొందిన సినిమా గృహప్రవేశం. హీరోయిన్ స్త్రీ వాదిగా కనిపిస్తే, హీరో లోకంలో సకల బాధలకు స్త్రీయే కారణమని ప్రచారం చేస్తుంటాడు. విద్యావంతురాలు, చైతన్యవంతురాలు అయిన జానకి (భానుమతి) స్త్రీ స్వేచ్ఛ పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రకటిస్తుంది. హీరో సోమలింగం (ఎల్.వి.ప్రసాద్) స్త్రీ ద్వేషి. అతని సభను తన స్నేహితులతో కలిసి భగం చేసి ఆ తరువాత ఆయనను అవమానించేలా వ్యంగ నృత్యనాటిక నొకదాన్ని ప్రదర్శిస్తుంది. ఇంట్లో సవతి తల్లి తులశమ్మ (హేమలత) వేదింపులు అనుభవించే జానకి ఒక దశలో ఆమె తమ్ముడు రమణారావు (సి.ఎస్.ఆర్.) రాకతో ఇంట్లో పరిస్థితులు మారతాయి. రమణారావు నాటకాల రాయుడు. అప్పటికే ఆయన ఓ నాటకాలమ్మాయి లలిత (జూనియర్ శ్రీరంజని)తో సహజీవనం చేస్తుంటాడు. కానీ తులశమ్మ జానకినిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంతకు మునుపే మోసం చేసి సోమలింగం ఒడిలో ఉన్నట్టుగా దిగిన ఫొటో ఒకటి పేపర్లో అచ్చయి అతని ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. ఈ పరిణామాలన్నీ చూసిన తులశమ్మ రమణారావుతో జానకి పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంది. ఆ రాత్రి ఇంట్లోంచి బయటపడిన జానకి తాగుబోతుల నుండి తప్పించుకోవడానికి సోమలింగం ఇంట్లోకెళ్లి తల దాచుకుంటుంది. తన ఆశయం భంగం చేయడానికే వచ్చిందనుకుంటాడు. పోలీసులకు పట్టివ్వబోతే భార్యలా నటించి తప్పించుకుంటుంది. ఇంతలో సోమలింగం శిష్యుడు ఆచారి ఇదంతా గమనించి సోమలింగంపై దాడి చేస్తాడు. విరక్తి కలిగి సన్యాసం స్వీకరిస్తాడు. కథలో చాలా మలుపులు తిరిగి సోమలింగం లలితను ప్రేమించడం మొదలుపెడతాడు. రమణారావు ఎత్తుకు పైఎత్తు వేసి లలితతో అతని పెళ్లి జరిపిస్తారు. జానకి తండ్రి సోమలింగానికి జానకినిచ్చి పెళ్లి చేసి స్త్రీ పురుషులు సమానమే. ఇరువురు కలిసి సమాజ సేవ చేయాలని ఉద్బోధ చేస్తాడు. భవ్యాశయాల 'గృహప్రవేశం' ఇదేనని సందేశమిస్తారు.
గృహప్రవేశం ఒక ట్రెండ్ సెట్టర్
''మా నాన్న గోపీచంద్ రచన చేసిన చిత్రాలలో 'రైతుబిడ్డ' తరువాత నాకు ఇష్టమైన చిత్రం 'గృహప్రవేశం'. పై రెండు చిత్రాలలో చాలా వైవిద్యం ఉంది. 'రైతుబిడ్డ'లో రైతాంగ సమస్యలు, జమిందారి వ్యవస్థపై తిరుగుబాటును చూపిస్తాడు. ఇందులో తాతగారు రామాస్వామి ప్రభావం కనిపిస్తుంది. 'గృహప్రవేశం' పూర్తిగా తనదైన ఆదర్శాలతో రాసిన రచన. స్త్రీ వాదానికి తెర తీస్తాడు. అభ్యుదయ భావంతో సామాజిక సమస్యలను వినోదాత్మకంగా చెప్పడమేగాక కథ, స్క్రీన్ ప్లే, నటన, పాటలు, సంగీతం, డైరెక్షన్ వంటి అంశాలలో కొత్త పోకడలు పోయి రూపొందిన ''గృహప్రవేశం'' ట్రెండ్ సెట్టర్.
- సాయిచంద్
@@@- హెచ్.రమేష్‌బాబు ###
94409 25814

.jpg)