సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రపంచంలోనే నెటిజన్ల ప్రజాదరణ పొంది, సరికొత్త సాంకేతిక విప్లవాన్ని తెచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య 150కోట్లు (1.5బిలియన్). 2030నాటికి ఈ సంఖ్యను 500కోట్లకు పెంచాలన్నదే ఫేస్బుక్ సిఇవో మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యం. అయితే... తాజాగా వెల్లడైన ఓ సర్వే నెటిజన్లను ముఖ్యంగా ఫేస్బుక్ వినియోగదార్లను అమితాసక్తికి... ఓ ఉద్వేగానికి గురి చేస్తోంది. అదేమిటంటే.. మరో 82ఏళ్ల తర్వాత ఫేస్బుక్ ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాల శ్మశాన వాటికగా మారనుందనేది.
నిద్రలేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు ఫేస్‌బుక్‌ను అంటిపెట్టుకొని వుండేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే వుంది. గడచిన వందేళ్లలో ప్రపంచ ప్రజల్ని ఒకేసారి ఇంత పెద్దఎత్తున ప్రభావితం చేసిన సాంకేతిక పరిజ్ఞానం మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఫేస్బుక్ తర్వాత వాట్సాప్, ట్విట్టర్ అలాంటి సోషల్‌మీడియా సంస్థలు ఎన్ని వచ్చినా ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం. అలాంటిది 2098నాటికి ఫేస్బుక్ పరిస్థితి ఏమిటన్నది నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 150కోట్ల్ల మంది వినియోగిస్తున్న ఫేస్బుక్ 2098 నాటికి అంటే మరో 82 ఏళ్ల తర్వాత శ్మశానంగా మారనుంది. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న ఖాతాదారులు అప్పటికి చాలామంది ఉండరు. ఫేస్బుక్లో ఇప్పుడున్న వారు అప్పటికి చాలామంది మరణిస్తారు. ఈ చనిపోయిన వారి అకౌంట్ పాస్వర్డ్లు వారి కుటుంబ సభ్యులకు తెలిస్తే... వారి అకౌంట్‌ను క్లోజ్ చేయొచ్చు. అది సాధ్యపడకపోతే... శ్మశానంలోని సమాధుల మాదిరిగా మృతి చెందిన ఫేస్బుక్ అకౌంట్లు మొత్తం నిర్జీవంగా మారతాయి. పేస్బుక్ పేజీల్లో ప్రస్తుతం స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతారులు మృతి చెందితే ఆ పేజీని తొలగించే అవకాశం కనిపించడంలేదు. ఎందుకంటే ఆ ఖాతాదారుడి వివరాలు తెలిసిన వారు మరొకరుంటే తప్ప ఆ పేజీలోకి లాగిన్ అయ్యే అవకాశమే లేదు. దీంతో మరణించిన ఖాతాదారుడి పేజీని స్మృతుల పేజీగా మారుస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. కొన్నిసార్లు మృతుడి ఖాతా వివరాలు తెలిసిన వారు అప్పుడప్పుడు అతని ఖాతాను తెరుస్తుంటారు. దీంతో అతడు మృతి చెందిన తర్వాతకూడా తన ఖాతా క్రియాశీలంగా వుంటోందని అమెరికాలోని మస్సాచుసెట్స్ విశ్వవిద్యాలయం పిహెచ్డి విద్యార్థి హచెం సిదిక్కి ఈ తాజా అవగాహనకు వచ్చారు. ఇదే విధంగా కొనసాగితే ఫేస్బుక్ వృద్ధిరేటు కూడా తగ్గడం ఖాయమని ఆయన అంచనా. ఫేస్బుక్లో వినియోగదారుల సంఖ్య ఇదే రీతిలో కొనసాగితే 2098 కల్లా అదో శ్మశానంగా మారుతుందని అంటున్నారు. అయితే... ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ 'డిజిటల్ బియాండ్' సమాచారం ప్రకారం ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 9,70,000 మంది ఫేస్బుక్ ఖాతాదారులు మరణించనున్నట్లు తెలుస్తోంది. 2010లో 3,85,368 మంది, 2012లో 5,80,000 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. మృతుల ఖాతాలను స్వచ్ఛందంగా తొలగించేందుకు ఫేస్బుక్ నిరాకరిస్తోంది. ఇదే విధానం కొనసాగితే మనం ఊహించిన దానికంటే ముందుగానే బతికున్న ఖాతాదారుల సంఖ్యను మృతిచెందిన ఖాతాదారుల సంఖ్య అధిగమించే అవకాశం వుందని పలు అధ్యయనాల ద్వారా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారాన్ని కొనుగొనే దిశగా ఫేస్బుక్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలో నామినీలను పేర్కొన్న మాదిరిగానే తమ ఖాతా వివరాలు తెలిసిన మరొకరిని నియమించుకోవాలని సూచించే దిశగా ఫేస్బుక్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
2098 నాటికి అంతర్జాల శ్మశానంగా ఫేస్బుక్
