- అపోహలు, మూఢనమ్మకాలు, పాలకుల నిర్లక్ష్యం ఏ కొలమాసనపల్లి
దేవాలయ అభివృద్ధికి కావల్సిన పనులన్నీ దళితులే చేయాలి. కాని పూజలు చేయడానికి మాత్రం అర్హులు కాదట..చేసినా ఆలయ గేటుబయట ఉండి మొక్కులు తీర్చుకోవాలి. కులకట్టుబాట్లు అంగీకరించవని పెత్తందారులు చెబుతారు. కట్టుబాట్లను కాదని ఒక వేల దళితులు దేవాలయ ప్రవేశం చేస్తే వారికి నష్టం జరుగుతుందని, కళ్లు కనిపించవని, అనారోగ్యంతో చనిపోతారని ప్రచారం చేశారు. ఇలా ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ కుల వివక్ష ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో జరుగుతుంది. గ్రామంలోని శ్రీ సెల్వరాయస్వామి దేవస్థానం ఒకటని చెప్పవచ్చు. ఇక్కడ దేవాలయ ప్రవేశం లేక పోవడమేకాదు. హోటళ్లలో రెండు గ్లాసుల పద్దతి కూడా కొనసాగుంది. కొలమాసనపల్లి వివక్షపై ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....
మీ ముత్తాతలు కాలంనుండి నేటి పెద్దల వరకు ఆలయ ప్రవేశం చేయాలంటే గ్రామ కట్టుబాట్లు ఒప్పుకోవు.... నేటికీ అదే కొసాగుతుంది. కట్టుబాట్లను కాదని సాహసించి ఆలయ ప్రవేశం చేసిన ఓ దళిత న్యాయవాది మునిరత్నంకు కళ్ళు కనబడకుండా పోయాయని పెత్తందారులు అపోహను సృష్టించారు. ఆయన మృతిచెంది ఏళ్ళు గడుస్తోంది. అలాగే అతని తండ్రి మునెప్ప ఆలయ సేవలో 'కొమ్ము' నాధం దళితుడిగా ఆలయానికి దూరంగా వుండి వినిపించేవాడు. అతని కుమారుడే, అలాగే మాగ్రామంలో పూర్వీకుల నుండి వస్తుంది. ఆలయంలో ఏటా జరిగే 16 రోజుల శ్రీరామనవమి ఉత్సవాలు, ఆలయ ముస్తాబుకు పనిముట్లు, సామాగ్రి సమకూర్చి డప్పులు కొట్టడం చేస్తున్నారు. ఇవన్ని చేసినా ఆలయానికి దూరంగానే వుంటున్నామని తెలిపారు. వాస్తవంగా చూస్తే న్యాయవాది మునిరత్నంకు కంటిలో శుక్లాలు ఉండటం వల్ల కళ్లద్దాలు వాడే వాడు. ఆయన చాలాకాలం ప్రజల పక్షాన న్యాయవాదిగా పని చేశారు. కిడ్నీ వ్యాధిలో ఆయన చనిపోయారని డాక్టర్లు నిర్ధాలించారు. కాని దళితుల నిరక్షరాస్యతను ఆసరాచేసుకుని ఆయన దేవాలయ ప్రవేశం వల్ల చనిపోయాడని తప్పుడు ప్రచారం చేశారు. దేవాలయంలో దళితులు ప్రవేశిస్తే కళ్ళుపోతాయి. ఇండ్లలో ప్రాణహానీ జరుగుతుంది. మలినం అయితే దేవునికి కోపం వచ్చి కష్టాలు పెరుగుతాయనే కారణాలతో వివక్ష చూపుతున్నారు.
గ్రామంలో ప్రధానంగా మనేగారు ఆస్థానం నుండి పాలేగాళ్ల ఏలుబడిలో బిసి కులాలకు చెందిన ఆ ఆలయ ధర్మకర్తలు నాటి రామదాసప్ప నాయుడుగా నేటి తరాలకు చెందిన ధర్మకర్త కులస్తులు ఈ ఆలయ నిర్వహణను కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి అర్చకులుగా స్థానిక ప్రధానాచార్యులుగా పిలువబడుతున్న అర్చకులు వున్నారు. దళితులను పని వాళ్లుగా పండుగలు, ఉత్సవాల రోజుల్లో సేవలు చేయించుకుంటారు. ఆలయానికి ఎంత పని చేసినా పూజలందుకోవడానికి మాత్రం దూరంగా ఉండాల్సిందే. గేటు బయట ఉండి పూజలందుకోవాలి. వారిచ్చే కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రిపై నీళ్లు చల్లిన తరువాత పూజకు పంపుతారు.
దళితులు రాజకీయ నాయకులుగా ఎదిగినా ఆలయ ప్రవేశాన్ని అమలుపరచలేక పోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఆయలంలోకి రానివ్వలేదు. 1975, 76లో పలమనేరు నియోజక వర్గం ఎస్సీలకు రిజర్వు అయింది. అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంఎం రత్నం, టిడిపి ఎమ్మెల్యేలుగా 1983-84లో ఇ.ఆంజనేయులు, పట్నం సుబ్బయ్య, లలితకుమారి, తిప్పేస్వామి ఎన్నికయ్యారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు హోదాలో వున్నా అంటరానితనంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామీణ దళితవాడల్లోనూ, ప్రధానంగా కొలమాసనపల్లి దేవాలయ దళితులు అడ్డుకట్టగా మారిన సంగతిపై ప్రశ్నించలేదు. దాంతో సామాన్య దళితవాడలోని ప్రజలకు ప్రవేశం దక్కని పరిస్థితి ఇప్పటికీ వుంది. ప్రస్తుతం ఎంపిటిసి, సర్పంచి,కూడా ఆలయ ప్రవేశం నోచుకోని పరిస్థితి వుంది. గ్రామంలోని హోటళ్లలో రెండు గ్లాసుల పద్దతి కూడా కొనసాగుతుంది. ఎస్సిలకు ప్రత్యేకంగా గాసులుండేవి. కొంత చర్చ జరిగాక దళితులకు ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ ఇస్తారు. ఇతరులకు గాజుగ్లాసుల్లో ఇస్తారు.
జమీందారుల కాలంనాటి నుంచి ఈ ఆలయ నిర్వహకులను పాలేగాళ్లుగా పిలువబడే వారు. వారి బంధువులు, గ్రామంలోనే వున్న అర్చకులు చేత ఇప్పటికీ నిర్వహణ కొనసాగుతుంది. ఈ ఆలయానికి జోడిమాన్యపు భూమి 150 ఎకరాల పైబడి వుంది. ఇవి గతంలో ఆలయ నిర్వహణకు, పనిబాట్ల వారికి కేటాయించారు. ఈ భూములన్నీ గ్రామ పరిధిలోని ఎరగుండేపల్లి, గుండ్లపల్లి, దొడ్డిపల్లి, కొలమాసనపల్లి ప్రాంతాల్లో అత్యంత విలువగల భూములు వున్నాయి. 24 గ్రామాల ప్రజలకు చెందిన కొలమాసనపల్లి పంచాయతీలో ప్రధానంగా మూడు దళిత వాడలు కలిపితే అధిక జనాభా గల ప్రాంతాలున్నాయి. మాదిగకళ్ళాడు, గొల్లపల్లి కోళ్ళఫారం, కూర్మాయి, గుండ్లపల్లి తదితరాలున్నాయి. జనాభాలో 1/3 వంతు బోయకులస్తులున్నారు.