కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి చెందిన దుర్గప్ప టీటీసీ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన డిఎస్సీలో 101 మార్కులు పొందాడు. అయితే అతనికున్న ఎస్సీ సామాజిక హోదా చేజారడంతో ఉపాధ్యాయ పోస్టు రాలేదు. ఈయన ప్రకాశం జిల్లా ఒంగోలులో పగటి వేష ధారణతో భిక్షాటన చేస్తూ 'ప్రజాశక్తి'కి తారస పడ్డాడు. ఆయన సామాజిక వర్గం బుడగజంగాలు! ఎంత చదివినా ఆయనకు ఉపాధి దక్కకపోవడానికి ఆ సామాజిక స్థితి కారణంగా నిలిచింది. ఆయన్ని ప్రశ్నిస్తే వారి సామాజిక వర్గం రాష్ట్రంలో పడుతోన్న అష్టకష్టాలను ఏకరువు పెట్టారు.
జీవో 144తో అన్యాయం!
ప్రభుత్వమే వారిని సామాజికంగా రాష్ట్రంలో లేకుండా వెలివేసింది. బుడగ జంగాలు రాష్ట్రంలో లేరని, వారంతా తెలంగాణాకే పరిమితమయ్యారంటూ 2008లో జీవో నెంబరు 144ను తీసుకువచ్చింది. ఫలితంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తరతరాలుగా ఉంటోన్న బుడగ జంగాల జీవితాల్లో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. అప్పటివరకూ వారంతా ఎస్సీలుగా పరిగణించబడ్డారు. తద్వారా వచ్చే సౌకర్యాలను పొందుతూ వచ్చారు. ఒక్క జీవోతో అవన్నీ కోల్పోయారు. నవ్యాంధ్రలోని ప్రభుత్వ రికార్డుల్లో బుడగ జంగాలన్న సామాజికవర్గమే లేకుండా పోయింది. వాస్తవానికి వారి పూర్వీకులు తెలంగాణా జిల్లాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇతర జిల్లాలకూ ఉపాధి కోసం వచ్చారు. ఎక్కడికక్కడే స్థిరపడి పోయారు. బుర్రకథలు చెబుతూ, పగటి వేషాలు వేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈతాకులతో చిన్న చిన్న వస్తువులు చేసి అమ్ముకుంటుంటారు. కర్నూలు జిల్లా వాసులకు మహబూబ్‌నగర్ జిల్లాతో బంధుత్వాలున్నాయి. పెళ్లిళ్లు రెండు జిల్లాల కుటుంబాల మధ్య ఉన్నాయి. గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ వీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్వాతంత్య్ర భారతంలోనూ వారు నాగరిక సమాజానికి దూరంగానే బతుకుతున్నారు. చదువుకున్న యువకులూ భిక్షాటనే ఆధారంగా జీవిస్తున్నారు.
కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చి భిక్షాటన
కర్నూలు జిల్లాలో పెద్ద సంఖ్యలో బుడగ జంగాలు ఉన్నారు. కౌతాళం మండలం ఉరుకుందలో వందల కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాల బుడగజంగాలు ప్రకాశం జిల్లాకు ఏటా వలస వస్తుంటారు. సీజనులో ఇక్కడ పగటివేషాలతో భిక్షాటన చేస్తుంటారు. రెండు మూడు నెలలు ఇక్కడ గడిపి తిరిగి సొంతూరుకు వెళతామని దుర్గప్ప చెప్పారు. ఉరుకుందలో బిఇడీ, టీటీసీ, డిగ్రీ, పదో తరగతి చదివిన యువకులు సుమారు పాతిక మంది వరకూ ఉన్నట్లు చెప్పారు. వారంతా ఇపుడు భిక్షాటనే చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమను బిసిలుగానైనా గుర్తించక పోవడం ఘోరమన్నారు.
అన్నీ కోల్పోయి... వీధిన పడి...
ప్రభుత్వ జీవో వల్ల చదువులకూ ఆటంకం ఏర్పడింది. గురుకుల పాఠశాలల్లోనూ, కాలేజీల్లో ఫీజు రీయింబర్సుమెంటు రావడం లేదు. ఉపకారవేతనాలనూ కోల్పోయారు. రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులున్నా ఫలితం సున్నా! ఒక్క జీవోతో అన్నీ కోల్పోయారు. రాష్ట్రంలో సుమారు 20వేల మంది బుడగ జంగాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి నుంచి పీజీ వరకూ చదువు తున్నారని అంచనా. వారెవరికీ ప్రభుత్వ సహాయం అందడం లేదు.
శాశ్వత సామాజిక బహిష్కరణకు గురై...
కులమే లేదంటూ తమను శాశ్వత సామాజిక బహిష్కరణకు గురి చేశారని బుడగ జండాలు వాపోతున్నారు. ఒంగోలులోని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ఇంటి ఎదుట భిక్షాటన చేస్తున్న దుర్గయ్య, హనుమయ్యలను కదలిస్తే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా కర్నూలు జిల్లా నుంచి వలస వస్తుంటామన్నారు.
న్యాయం చేయాల్సిందే...
బుడగ జంగాల జీవనంలో మార్పు రావాలంటే ముందుగా వారికి సామాజిక గుర్తింపు ఇవ్వాలి. 2008 ముందున్న సౌకర్యాలన్నింటినీ పునరుద్ధరించేలా జీవో తేవాలి. ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించాలని వారంతా కోరు తున్నారు. స్వేచ్ఛగా, పూర్వం మాదిరిగా జీవించే హక్కును, కనీస సౌకర్యాలను కల్పించాలని వారు కోరుతున్నారు.
- ఎస్వి బ్రహ్మం, ఒంగోలు.