మండువేసవిని ఎదుర్కొనే ఆయుధాల్లో మజ్జిగది ఎప్పుడూ మొదటి స్థానమే. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, నిమ్మరసం లాంటి రుచులను చేర్చి తాగితే ఎండకు చల్లని గొడుగు పట్టినట్టే. అయితే వేసవిలో మజ్జిగని పానీయంగానే కాదు, సౌందర్యసాధనంగానూ వాడవచ్చు..మొత్తంగా ఓ పది విధాలుగా మజ్జిగ మనకు ఉపయోగపడుతుంది. అవేంటంటే...
- చర్మానికి కాంతి
మజ్జిగలో ఉన్న లాక్టిక్ యాసిడ్‌లో చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలున్నాయి. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అనే ఈ లాక్టిక్ యాసిడ్‌ని ఖరీదైన సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. ఇది చర్మాన్ని మృదువుగానూ, కాంతిమంతంగానూ చేస్తుంది. చర్మంమీద నల్లమచ్చలను, ఎండ కారణంగా కమిలిన నల్లదనాన్ని తొలగిస్తుంది. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిలో మజ్జిగ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ఈ మిశ్రమంతో చర్మానికి మర్దనా చేసుకోవాలి. అరగంటపాటు అలాగే ఉంచుకుని తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఎండవేడికి నల్లబడి, మంటపెడుతున్న చర్మానికి ఉపశమనంకోసం మజ్జిగలో టమాటా రసాన్ని కలిపి అప్లయి చేయవచ్చు. ఈ మిశ్రమంలో ఉన్న ఎ, సి విటమిన్లు చర్మంలో ఆరోగ్యకరమైన మార్పుని తెస్తాయి.
- మజ్జిగ, తేనెతో యాంటీ ఏజింగ్ క్రీమ్
మజ్జిగ, తేనె ఈ రెండింటినీ కలిపి తయారుచేసిన మిశ్రమం మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్‌గా పనిచేస్తుంది. తేనె సహజమైన క్లెన్సర్‌గానూ, మజ్జిగ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తాయి. తేనె చర్మాన్ని శుభ్రపరచాక, మజ్జిగ చర్మానికి మృదుత్వం, మరుపు తెస్తుంది. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని వాడదల్చుకుంటే ఈ మిశ్రమానికి నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
- క్లియోపాత్ర మజ్జిగ స్నానం
ఈజిప్టురాణి క్లియోపాత్ర మెరిసే చర్మం రహస్యం మజ్జిగేనట. ఆమె మజ్జిగతో స్నానం చేసేవారట. అలాంటి ప్రయోజనాన్నే మనమూ పొందాలంటే మజ్జిగ, ఓట్స్ కలిపిన మిశ్రమాన్ని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవచ్చు. నేరుగా వీటితో స్నానం చేయడం కంటే బాత్‌టబ్‌లో వేసుకుని 15నుండి 20 నిముషాలపాటు ఆ నీళ్లలో ఉండటం వలన మరింత మంచి ప్రయోజనం ఉంటుంది.
- జుట్టుకి తిరిగి జీవం
ఎండాకాలం జుట్టు జీవం కోల్పోయి ఎండిపోయినట్టుగా కనబడుతుంది. ఇలాంటపుడు మజ్జిగ మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఒక అరటిపండు, రెండు చెంచాల తేనెని ఒక కప్పు మజ్జిగకు కలిపి ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌గా వేసుకుని ముప్పావుగంటపాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత తలను కడిగేసుకుని స్నానం చేస్తే జుట్టు మెరుపులీనుతూ మృదువుగా తయారవుతుంది.
- కొవ్వు చేరదు
పాలతో పోల్చుకుంటే మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు, మజ్జిగ చాలాసేపు ఆకలి కలగకుండా చేస్తుంది. అలా బరువు తగ్గాలనుకునేవారికి సైతం చక్కని ఫుడ్‌గా చెప్పవచ్చు. అరుగుదలకు తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థలో లోపాలు సవరిస్తుంది. ఇది త్వరగా జీర్ణం కావడమే కాకుండా శరీరం ఇతర పదార్థాల నుండి పోషకాలను తీసుకునేందుకు సైతం తోడ్పడుతుంది.
- టెంపరేచర్ని నియంత్రిస్తుంది
శరీరవేడిని నియంత్రించడంలో మజ్జిగ మహాబాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఈ గుణం వలన మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో వచ్చే వేడి ఆవిర్లను తగ్గిస్తుంది.
- అరుగుదలను మెరుగుపరుస్తుంది
ఇది మన జీర్ణవ్యవస్థకు మేలుచేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. మజ్జిగ, గుండెల్లో మంట, మసాలాల కారణంగా వచ్చే ఎసిడిటి లాంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మజ్జిగ మంచి బ్యాక్టీరియాను పెంచడమే కాకుండా, శరీరంలో చేరి రోగాలను కలిగించే బ్యాక్టీరియాపై పోరాడుతుంది. అలా మనలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తుంది.
- పోషకాలు నిండుగా
ఒక పెద్ద గ్లాసుడు మజ్జిగ తాగామంటే మనకు చాలా పోషకాలు అందుతాయి. కేలరీలు తక్కువగా ఉండే మజ్జిగలో విటమిన్ బి12, క్యాల్షియం, ఫాస్పరస్, రెబోఫ్లావిన్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎముకల ఆరోగ్యం. చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తికి కృషి చేస్తాయి. భోజనం బదులుగా మజ్జిగ సరిపోదు కానీ, భోజనాలకు మధ్య ఆకలిని తట్టుకోవడానికి మజ్జిగ మంచి ఆహారమే.
సమ్మర్ టెర్రర్...'చల'్లగా పరార్!
