ప్రస్తుత పోటీ వాతావరణంలో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, కొందరు తల్లిదండ్రులు కేవలం బహుమతిపై దుగ్ధతో వ్యవహరిస్తూ బాలోత్సవ్ స్ఫూర్తికే విఘాతం కల్పిస్తుంటారు. ఇది మంచిది కాదు. ఆ పద్ధతి మళ్లీ మాములు చదువుల్లాగానే పిల్లల పై ఒత్తిడి తెచ్చి పిల్లల మధ్య సహజంగా చిగురించే స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. లేత హృదయాల్లో రాగద్వేషాలు నింపుతుంది. ఉత్సవాల్లో పోటీలు ఉండాలా? ఉండకూడదా? అనేది చాలా సున్నితమైన అంశం. బాలల ఐక్యతకు, హక్కులకు దెబ్బ తగలకుండా అత్యంత జాగరుకతతో నిర్వహించడం నిర్వాహకుల బాధ్యతే!
బాలోత్సవాలకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. బాలల సమగ్ర వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి బాలోత్సవాలు ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్పొరేట్ వ్యాపార విద్యా విలువల్లో బాలలు ఒంటరివాళ్లు అయిపోతున్నారు. కుటుంబానికి ఆత్మీయ స్నేహవాతావరణానికి దూరంగా బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకులీడుస్తున్నారు. గుర్రానికి కళ్లకు గంతలు గట్టినట్టు వారికి ఐఐటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంతలను కట్టి పరిగెత్తిస్తున్నారు. నిద్రాహారాలు మాన్పించి, రేయింబవళ్లు అదే ధ్యాసలో కమ్చికర్రలతో తోలుతున్నట్లు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వారికి రవ్వంత ఊరట, ఓదార్పు దక్కడం లేదు. అందుకే దాదాపు ఈ ఏడాది అటు తెలంగాణలోనూ, ఇటు నవ్యాంధ్రప్రదేశ్లోనూ విద్యార్థుల ఆత్మహత్యలు వందకు దాటాయి. చదువులా? చావులా? అంటూ వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి.
బిడ్డల పట్ల తాము వ్యవహరిస్తున్న శైలిలో ఏదో లోపం జరుగుతున్నట్టు కొందరి తల్లిదండ్రుల్లోనూ, విద్యాసంస్థల్లోనూ కొంత ఆందోళన, ఆలోచన మొదలయ్యాయి. మీడియా, సమాజం ప్రతి స్పందించిన తీరుతో తేరుకుని సరిదిద్దుకునే దానిలో భాగంగా బాలోత్సవాలకు పరోక్షంగా కొంత ఆదరణ పెరుగుతున్నట్టు అర్థమవుతుంది.
తెలంగాణ ఖమ్మం జిల్లా 'కొత్తగూడెం క్లబ్' ఆధ్వర్యంలో గత పాతికేళ్లుగా ఈ బాలోత్సవాలు నిర్విఘ్నంగా జరిగాయి. డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు దానికి మూలకర్త. పట్టణస్థాయి నుంచి ఈ బాలోత్సవ్ ప్రారంభమై, జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగింది. గతేడాది దాదాపు 15 వేల మందికి పైగా బాలబాలికలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. చిత్రలేఖనం, శిల్పకళ, కథారచన, విశ్లేషణ, కవితారచన, విశ్లేషణ, వీధినాటిక విశ్లేషణ, ఏక పాత్ర, ఏకాంకిక నాటికలతోపాటు వ్యర్థం నుంచి అర్థం తదితర కార్యక్రమాలూ, పాటలు, నృత్యాలు, కథ చెప్పడం, క్విజ్ అంశాలతో జూనియర్లకు, సీనియర్లకు విడివిడిగా నిర్వహించారు. వివిధ వేదికలపై ఏకకాలంలో సమాంతరంగా ఈ ప్రదర్శనలు నిర్వహించడం, చూసిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఒకసారి ఈ ఉత్సవ్‌కు హాజరైనవారు మళ్లీ మళ్లీ ప్రతి ఏడాదీ పాల్గొనడం ఓ సంప్రదాయంగా మారిపోయింది. కారణం ఏ రంగంలో వారు ఆ రంగంలోని బాలల ప్రతిభను అమితోత్సాహం పొందడమే. అది నిత్యనూతనం.
పిల్లలు సమకాలీన విషయాలపై స్పందిస్తూ నాటికలు రాసుకుని ప్రదర్శించడం, తమకు తాముగానే తమ స్థాయిలో రచనా దర్శకత్వం చేసుకుని నటించడం, పాటలు, ఆటల్లో (నృత్యాల్లో) నవ్యరీతులు ప్రదర్శించడం, కవిత, కథల్లో ఊహించని రీతిలో తమ అనుభూతులను వ్యక్తం చేయడం ఎంతో సృజనాత్మకంగా, నయనానందకరంగా సాగుతుంది. అడుగడుగునా తమ విశ్లేషణకు పదును పెట్టుకోవడం, సామూహికంగా వాటి గురించే చర్చించుకోవడం, చక్కగా ప్రదర్శించిన వారు గుర్తింపు పొందడం... ఇవన్నీ బాలలకు చెప్పలేనంత ఆత్మస్థైర్యం కలగడానికి తోడ్పడుతున్నాయి.
మేం ఏడాదిపాటు మా పాఠశాలలో విద్యార్థులకు కల్పించలేని మానసిక ధైర్యాన్ని ఈ మూడు రోజుల బాలోత్సవ్‌లో కల్పించగలమని అనేకమంది ఉపాధ్యాయులు స్వానుభవంగా తెలిపారు. జీవితం అంటే కేవలం చదువు ఒక్కటే కాదని, అదీ ఐటి, ఇంజనీరింగ్ చదువే కాదని, ఎదగడానికి ఎన్నో వృత్తులు, అవకాశాలు ఉన్నాయన్న సత్యం బాలోత్సవ్ ద్వారా స్పష్టమవుతోంది.
బాలబాలికలు ఇన్ని రకాల అంశాల ప్రదర్శనల్లో పాల్గొనడమే గొప్ప విషయం. ఆత్మస్థైర్యానికి అదే తొలిమెట్టు. ఒంటరిగా పాల్గొనే బిడియం ఉంటే బృందగానాల్లో, బృంద నృత్యాల్లో, నాటికల్లో పాల్గొని రాణించవచ్చు. ఈ ప్రదర్శనల్లో పోటీ ఉంటుంది. కానీ, పోటీ కోసమే ప్రదర్శనలు కాదని నిర్వాహకులు అన్యాపదేశంగా పదేపదే చెప్తూనే ఉంటారు. పిల్లలకు కూడా ఎలాగైనాసరే బహుమతి పొందాలనే కాంక్ష పెద్దగా ఉండదు. ప్రస్తుత పోటీ వాతావరణంలో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, కొందరు తల్లిదండ్రులు కేవలం బహుమతిపై దుగ్ధతో వ్యవహరిస్తూ బాలోత్సవ్ స్ఫూర్తికే విఘాతం కల్పిస్తుంటారు. ఇది మంచిది కాదు. ఆ పద్ధతి మళ్లీ మాములు చదువుల్లాగానే పిల్లల పై ఒత్తిడి తెచ్చి పిల్లల మధ్య సహజంగా చిగురించే స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. లేత హృదయాల్లో రాగద్వేషాలు నింపుతుంది. ఉత్సవాల్లో పోటీలు ఉండాలా? ఉండకూడదా? అనేది చాలా సున్నితమైన అంశం. బాలల ఐక్యతకు, హక్కులకు దెబ్బ తగలకుండా అత్యంత జాగరుకతతో నిర్వహించడం నిర్వాహకుల బాధ్యతే!
అయితే కొన్నిచోట్ల బాలోత్సవాల్లో హంగులు ఆర్భాటాలు పెరిగిపోయి, అవి కూడా యాంత్రిక ఈవెంట్లుగా (గుర్తింపును కోరుకునే అడ్వర్టైజ్మెంట్లలా) మారిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. పిల్లలను మనస్ఫూర్తిగా నమ్మడం, పిల్లలతో కలిసిపోవడం, పిల్లలు చూపే ప్రతిభను మెచ్చుకోవడం, అదీ పదిమందితో పంచుకుని ఆనందపడటం ... ఇదంతా బాలోత్సవ్ల్లో ప్రాణప్రదమైన అంత:సూత్రంగా వర్థిల్లుతుంది.
ఇక్కడ గురుదేవ్ రబీంద్రనాథ్ టాగూర్ యుద్ధం కథలో విదూషకుడు మహారాజుతో చెప్పిన మాటలు గుర్తుకు రాకమానవు. కోసల రాజ్యం రాజు కళింగరాజ్యంపై దండెత్తుతాడు. ఆ సందర్భంలో కళింగరాజ్యం పిల్లలు యుద్ధం ఆట ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రానికి కళింగరాజు కోసల రాజ్యాన్ని జయించి, ఆ రాజును బందీగా తన వెంట తెచ్చుకుంటాడు. బాలలు అప్పుడూ అదే యుద్ధం ఆట ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కళింగరాజే గెలుస్తూ ఉంటాడు. కోసల రాజు ఆ ఆట చూసి కోపంతో ఊగిపోతూ, 'నిజయుద్ధంలో నేను గెలిచాను. ఇదిగో మీరాజు ఓడిపోయి మా వద్ద బందీగా ఉన్నాడు చూడు.' అని చూపిస్తాడు.
కానీ బాలుడు అంగీకరించక 'ఆటలో మాత్రం మా కళింగ దేశమే గెలుస్తుంది.' అని మొండికేస్తాడు. రాజుకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు పక్కన విదూషకుడు కలుగజేసుకుని 'వదిలేయండి ప్రభూ! పిల్లలు.' అని వారిస్తాడు. కొంతసేపయిన తర్వాత 'రాజ్యాలను గెలిచినంత సులభం కాదు; పిల్లల హృదయాలను గెలవడం' అని సున్నితంగా హితవు చెప్తాడు.
బాలోత్సవ్ అంటేనే పిల్లలతో కలిసి పనిచేయడం, పిల్లలకోసం పనిచేయడం, దాంతోపాటు పిల్లలనుంచి అనేక విషయాలు తెలుసుకుని, నేర్చుకుని, ఉత్సాహపడటం. ఈ విషయాలన్నీ డాక్టర్ రమేష్‌బాబు విజయవాడ ఎంబి భవన్లో సోమవారం బాలోత్సవ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్వానుభవంతో సోదాహరణంగా వివరించారు.
కారణాంతరాల వల్ల ఈ ఏడాది బాలోత్సవ్ కొత్తగూడెంలో జరగలేదు. కానీ, కొత్తగూడెం స్ఫూర్తితో గత ఐదేళ్లుగా కాకినాడ వారు బాలోత్సవ్ నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా వేలమంది పిల్లలు పాల్గొంటున్నారు. ఈ వారం నంబూరులో జరిగిన బాలోత్సవ్‌లో కూడా వేలాదిమంది బాలలు పాల్గొన్నారు. డిసెంబర్లో విజయవాడలో జరిగే అమరావతి బాలోత్సవ్‌లో కూడా వేలాదిమంది పాల్గొనబోతున్నారు. కార్యకర్తలు ప్రణాళికతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
ఇవికాక ఎక్కడక్కడ పాఠశాలల్లో తమతమ స్థాయిలో బాలల సందడి, బాలానందంపేరుతో బాలోత్సవాలు సాగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో ఇదొక శుభ పరిణామం.
బాలలు అంటే మానవజాతి భావి సంపద. దానిని వృద్ధి చేసుకోవడం మన బాధ్యత. గిజాబాయి చెప్పినట్టు- పిల్లల హక్కులను పునఃస్థాపించి వర్థిల్లచేయడం కంటే గొప్ప పని పెద్దలకు ఏముంటుంది?
- కె.శాంతారావు
99597 45723