కవి బండ్ల మాధవరావుది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలంలోని అనంతారం గ్రామం. మరో ప్రముఖ కవి, కథకుడు, బండ్ల మాధవరావుకి గురువు డా|| పాపినేని శివశంకర్ ఊరు నెక్కల్లు. ఇది కూడా అనంతారానికి సమీపంగా ఉండే ఊరే. ఈ ఇద్దరు ఉద్ధండ కవికథకులు రాసిన 11 కవితలు, 3 కథల సమాహారం 'మా ఊరు ఇల్లు' సంకలనం. అనంతారంలో బండ్ల మాధవరావు కుటుంబం నూతన గృహప్రవేశం సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
ఈ పుస్తకంలో కవితలూ, కథలూ గతంలో వివిధ పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ వచ్చినవే. అయితే వీటన్నింటినీ ఒక చోటకు చేర్చడంతో ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. కొన్ని రచనలు ఒకచోట చేర్చితే ఇంత మంచి ఫలితం ఉంటుందా అనేంత ఆశ్చర్యం కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. వ్యవసాయ కుటుంబాల నేపథ్యం కలిగిన ఇద్దరు సమర్థవంతమైన రచయితల కళాత్మక రచనా వ్యాసంగం ఈ సంకలనం. తమ గ్రామాల్ని గురించి చెబుతున్నట్టుగా సాగినా, ఇది మొత్తం ఆ ప్రాంత ప్రజల సామాజిక, సాంస్కృతిక పరిణామాలను, సంఘర్షణల్ని, జీవితపు లోతుల్ని, గాఢతనీ, భిన్న జీవన కోణాల్ని గుండెల్ని మెలిపెట్టేంతగా చిత్రించడంతో అవన్నీ మన అవగాహనలోకి అవలీలగా జీర్ణమైపోతాయి. ఒక వాస్తవిక వర్తమాన శిథిల గ్రామాల చరిత్రను సునాయాసంగా ఈ కథలూ, కవితలూ చెప్తాయి.
తమ కళ్ళముందే వ్యవసాయం కేంద్రంగా సాగిన గ్రామీణ జీవన సంస్క ృతులన్నీ రూపం మార్చుకుంటున్న దృశ్యాన్ని ఈ కథల్లో, కవితల్లో రచయితలు చెప్తుంటే మనం కనులు విప్పార్చుకుని చూస్తాం. బండ్ల మాధవరావు 'ఇల్లు' కవితతో సంకలనం మొదలవుతుంది- 'ఊరు నగరపు దేహాన్ని కపుకుంటూ/ పురాస్మ ృతుల కుబుసాన్ని విడుస్తోంది/ ఇప్పుడక్కడ ఇల్లు లేదు/ శిథిలమైన గోడలు/ సరికొత్త భవనంగా రూపాంతరం చెందుతున్నాయి'- తమ పాత పెంకుటింటి స్థానంలో నిర్మించుకున్న కొత్త భవనం గురించి రాసినా ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు 'అనంతారం లాంటి గ్రామాల శిథిలాల మీద నిర్మితమవుతున్న అమరావతి రాజధాని అసంకల్పితంగా పాఠకుడి మదిలో మెరుస్తుంది. నగరం జీవం పోసుకుంటే, ఊరు ఉరికంబం ఎక్కడం ఇక్కడ దృశ్యం. రాజధాని ఆవిర్భవిస్తుంటే వందల గ్రామాల్ని నగర ఆక్టోపస్లకు ఆహారంగా వేయడం ఇక్కడ దృశ్యం.- 'నగరపు చొరబాట్లకు తలవంచిన నేను/ రేపటి రాజధానిలో/ నా యిల్లు చిన్నబుచ్చుకోరాదని నా యింటిని కూలదోసుకున్నాను/ నిర్మాణం వినిర్మాణం పైనే కదా జరగాలి' అంటాడు.
అవును! నిర్మాణం వినిర్మాణం పైనే జరుగుతుంది. అయితే ఇది కేవలం భౌతిక నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యవసాయం కేంద్రంగా సాగిన గ్రామీణ జీవన సంస్క ృతిలో ఫ్యూడల్ భావజాలం పెనవేసుకుని అమానుష, అమానవీయ మానవ సంబంధాలకు పాదులు పడ్డాయి. ఆ వ్యవస్థ నేటికీ వదలని చీడలా నాగరికతనే పరిహాసం చేయడం వర్తమాన భారతంలోని విషాదం. రైతు కేంద్రంగా గ్రామంలో సకల జీవన వృత్తిదారుల, దళితుల శ్రమని నైవేద్యంగా కబళించిన అమానుష కుల సంస్క ృతిని ధ్వంసం చేసే అంకురాలు కూడా ఈ నగరాల నిర్మాణంలో ఉంటాయనే అవగాహన మన దృష్టి నుండి తప్పుకోదు.
బండ్ల మాధవరావు 'మాయమైన చేతులు' కవిత రాజధాని ప్రాంతంలో భూములమ్ముకున్న తర్వాత అక్కడ రైతులకు, కూలీలకు పనిలేకపోవడాన్ని అద్భుతంగా చెప్పిన కవిత- 'చేతులు లేకపోవడం మనిషి లేకపోవడం లాంటిదే కదా/ చెయ్యడం అనే పదం చేతుల నుండే కదా పుట్టింది'....'మట్టిని వాడికి అప్పజెప్పాక/ కనబడని చేతుల్ని / ముందుబెట్టుకు కూర్చున్నాను/ పని లేకపోవడం లోని నరకం అనుభవంలోకి వచ్చింది' అంటూ రాసిన కవిత రాజధాని ప్రాంతంలో భూసేకరణ తర్వాత దృశ్యాన్ని శక్తివంతంగా చాటుతుంది. అలాగే 'ఊరు రాజధానయ్యింది' కవితలో - 'పొట్టచేతబట్టుకొన్న ఊళ్ళు/ రాజధాని బాట పట్టేవి/ ఇప్పుడు/ దస్త్రాలు చుట్టేసుకొన్న రాజధాని/ నా గుమ్మంలో అడుగుపెట్టింది' అని ఆ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఒక విభిన్న పరిస్థితిని కవితాత్మకం చేస్తారు.
డా|| పాపినేని శివశంకర్ రాసిన 'పొలాల కల' పొలాలమ్ముకుంటున్న రైతుల స్థితిని - 'పేగుముడి తెంచుకో/ చివరిసారి పరిగే ఏరుకొంటావో పరదేశివై పోతావో/ కొంటా అమ్ముకో/ అమ్ముకొని కోటి నోట్ల చక్రాలపైన దేశదిమ్మరివై పో-/ నిలవ నీటి బతుకుల్లో పెనుగాలికి లేచిపడే అలలే అలలు/ కరెన్సీ కలలు'' అంటూ రాజధాని ప్రాంతపు వర్తమాన చిత్రాన్ని కళ్ళముందుంచుతారు.
ఈ సంకలనంలో ప్రతీ వాక్యమూ శిథిలమవుతున్న గ్రామీణ సామాజిక స్వరూపం, కనమరుగవుతున్న పంటపొలాలు, వాటి ఆధారంగా ఏర్పడిన మానవ అంతరంగ, బహిరంగ స్వభావాలూ చెదిరిపోవడం గురించిన వేదన, వాటిపట్ల ఆపేక్ష మనసులను కదిలించేటట్టుగా ఉంటుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఒక అనివార్యమైన మార్పులో భాగంగా చూస్తే సరికొత్త దృశ్యాలు కూడా కనబడతాయి. రాజధానులు, నగరాలు, భూములు వ్యాపారంగా మారిన దృశ్యం కఠినంగా కనిపిస్తున్నా దీని పరిణామాలు మరో వినిర్మాణానికి దారితీయవా అనిపిస్తాయి.
పాపినేని శివశంకర్ 'చింతలతోపు', 'సగం తెరిచిన తలుపు' కథలు కథా ప్రేమికులకు బాగా పరిచితమైనవే. తెలుగులో 'చింతలతోపు' కథ ప్రపంచీకరణ విధానాలు దేశంలో చట్టాలుగా మారుతున్న సందర్భంలో రాసింది. గుంటూరు సీమలో పొగాకు పంట ఆగిపోతూ పత్తిపంటలు విస్తృతమవుతున్న రోజులు. భూమి సాగుచేయటానికి సగటు రైతు నానా అవస్థలు పడుతున్న పరిస్థితిని సహజంగానూ, వాస్తవికంగానూ చిత్రించిన కథ. వ్యవసాయం ప్రధానంగా ఉన్నా పంటల ఫలితాల్లో స్థిరత్వం లేక గ్రామాలు ఒత్తిడికి గురవుతున్న దృశ్యం ఈ కథలో మనకు కనపడుతుంది.
'సగం తెరిచిన తలుపు' ఊరును విడిచిపెట్టిన చదువుకున్న యువకుడు నగరం చేరుకుని ఒక పత్రికలో సాహిత్యపేజీ బాధ్యుడిగా రూపొందుతాడు. గ్రామాన్ని విడిచిపెట్టినా, తనకు ఊరితో ముడిపడిన అనుభూతుల్ని తలచుకుని పరవశమై, గొప్ప మానవ అనుబంధాలను ఆస్వాదిస్తాడు. ఈ రెండూ కథలు వర్తమాన గ్రామీణ చిత్రాన్ని, కుటుంబాల్లో వచ్చిన మార్పుల్ని చాలా వాస్తవికంగా సహజంగా సజీవంగా వ్యక్తీకరిస్తాయి. అయితే కథల నిండా గ్రామాలంటే ఆపేక్ష ఆకాశమంత కనపడుతూ సుందర మయంగా, మానవతామయంగా చూపిస్తాయి. గ్రామంలో ఆధిపత్య కులాల కున్నంత ఆపేక్ష అణచివేయబడ్డ కులాలకు ఉండే అవకాశం తక్కువ. గ్రామాన్ని చూసే చూపులో గౌరవించబడే కులాలకు ఉండే చూపుకీ, అణగదొక్కబడ్డ కులాలకు ఉండే చూపుకీ తేడా ఉంటుంది. ఈ సంకలనంలోని కథలు, కవితలు పాఠకుడిలో అనేక ఆలోచనలను రేపుతాయి. భిన్న కోణాలకు తలుపులు తెరుస్తాయి.
బండ్ల మాధవరావు రాసిన కథ 'మల్లాయకుంట చేను'. రాజధాని ప్రాంత భూములకు వచ్చిన డిమాండ్ నేపథ్యంలో రాసిన కథ. ఒక రైతు అనివార్యంగా తన భూమిని అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితికి పడిన సంఘర్షణ అత్యంత సహజంగా చిత్రించారు. ఈ కథలో ఒకచోట ''నేను పుట్టి బుద్ధెరిగినాక మా వూర్లో యెవుడైనా చేను అమ్మితే ముందుగా పక్కచేనోడికి చెప్పేవాళ్ళు. పక్క చేనోడు కొనకుంటే ఊళ్ళోనే ఇంకో రైతుకో, కాదంటే పక్క ఊరు రైతుకో అమ్మేవాళ్ళు. కాని యిప్పుడు మా పొలాలు కొంటానికి యెక్కడెక్కడివాళ్ళో వత్తన్నారు. ప్లాస్టిక్ కాగితాల యాపారం చేసుకొన్నవాళ్లు, జిన్నింగ్ మిల్లులకు మధ్యవర్తులుగా ఉండి పత్తి కొనిపెట్టిన వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా అవతారం ఎత్తారు''. అంటూ రైతుల పరిస్థితులకు అద్దం పడతారు.
కేవలం తమ గ్రామాలను కథాంశాలుగా, కవితాంశాలుగా తీసుకుని రాసినట్లనిపించినా, ఒక నిర్దిష్టత నుంచి ఒక పరిణామాన్ని చెప్పటానికి ఈ రచనల్లో చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఈ రచనలను ఒకచోటకు చేర్చడంతో ఆ ప్రయత్నం రెట్టింపు ప్రయోజనాన్ని కలుగజేసింది. చిత్రకారుడు గిరిధర్ పెయింటింగ్ అందమైన ముఖచిత్రంగా పుస్తకానికి విలువను చేకూర్చింది. ఈ పుస్తకానికి బండ్ల మాధవరావు కవితా సంపుటి 'అనుపమ' ముందుమాటను దీనికి ముందుమాటగా పెట్టారు. దేవీప్రియ రాశారు. ఇది పుస్తకానికి తగినట్టుగా ఇమిడిపోయింది. అనంతారం, నెక్కల్లు గ్రామాలు తెలుగు సాహిత్యచరిత్రలో పూలరేఖలుగా నిలిచిపోతాయి. ఈ పుస్తకం దానికి మార్గం వేసింది. బండ్ల మాధవరావుకి అభినందనలు.
ఊరు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కథ
