హాస్యం పండింది. అవధాన హాస్యామృతం భలే రక్తికట్టింది. ఆదివారం సాయంత్రం హాస్యప్రియ కామెడీ క్లబ్ సంయుక్త కార్యదర్శి పెసల కనక దుర్గాప్రసాద్ విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన 'అవధాన హాస్యామృతం' ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వించింది. తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి, విలువలు, సాహిత్యం పట్ల ఆసక్తి పెంపొందించేలా నిర్వహించిన ఈ వినూత్న ప్రక్రియకు క్లబ్ కార్యదర్శి ఇమంది ఈశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారు. పృచ్ఛకుడు డాక్టర్ ఎన్ఎస్ఆర్ కృష్ణారావు కమ్యూనికేషన్ స్కిల్ (సంభాషణా నైపుణ్యం/ చాతుర్య), కమ్యూనికేషన్ గ్యాప్ తేడా తెలుపమని కోరడంతో అవధాన హాస్యామృతం మొదలయింది. అందుకు సమాధానంగా పానుగంటి లక్ష్మీ నారాయణ (సాక్షి వ్యాస సంకలనకర్త) రైలు ప్రయాణంలో విశేషాల్ని చెప్పారు. అలాగే 'భువన విజయం' పద్య నాటకంలో ఒక కళాకారుడు పొరపాటున సభ 'బిగిన్' చేయాలా? అని మాట్లాడితే... సంధానకర్త మైకందుకొని, సభను 'బిగించేయాలంటే' వికటకవి తెనాలి రామకృష్ణుల వారు రావాలని మరో కళాకారుడు సముదాయించాడని ప్రస్తావించారు. ఇంతలో అప్రస్తుత ప్రసంగీకుడు మేడా మస్తాన్ రెడ్డి ప్రశ్న : అమృతం శాకాహారమా? మాంసాహారమా? అవధాని : శాకాహారమే అని వివరించడంతో హాల్లో నవ్వులూ, ఆ వెనకే చప్పట్ల వర్షం. సృష్టిలో ప్రమాదకరమైన జంతువు? జవాబు : జింక. ప్ర: జల్లికట్టుకన్నా ప్రమాదకరమైంది? జ: తాళికట్టు. ఇలా ఫక్తు హాస్యరస ప్రధానంగా 'అవధాన హాస్యామృతం' సాగింది.
ఒకసారి మాలిక్ ఇబ్రహీం అనే రాజు దగ్గరకి ఒక పేద కవి వచ్చి ఆర్థిక సాయం కోరాడు. వెంటనే రాజు 'ఆకు, ఈకు, మీకు, మాకు' ఈ నాలుగు పదాలిచ్చి ఆశువుగా ఒక పద్యం చెప్పమన్నాడు. పేద కవి ఏమాత్రం తడుంకోకుండా... 'ఆకుంటే వృక్షంబగు/ ఈకుంటే లోభియగు/ మీకుంటే మాకీయుడి/ మాకుంటే మేము రాము మల్కిభిరామ' అని చెప్పి మెప్పించారు... అని అవధాని సమాధానమిచ్చి సభలో చప్పట్ల వర్షం కురిపించారు. కార్యక్రమం మొత్తం మూడు ఆవృత్తాలుగా నిర్వహించారు. తొలి ఆవృత్తం పృచ్ఛకులు ఆయా పురాణ ఇతిహాసాల నుంచి ప్రశ్నలు సంధించారు. రెండో ఆవృత్తంలో పృచ్ఛకులు స్వేచ్ఛగా తమకు నచ్చిన అంశాలపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా నిత్యజీవితంలో తారసపడే అనేక అంశాలతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఇంటికి 'వాస్తు' ఉంది? మరి ఒంటికి? అనే ప్రశ్నకు సమాధానంగా 'దారిన పోయే అమ్మాయిని గిల్లి చూడండి' ఒళ్లు 'వాస్తుంది' అని చిలిపి సమాధానమిచ్చి.. ఆడిటోరియంలో నవ్వులు కురిపించారు. చికెన్, రమ్ము వంటి పదాలిచ్చి రామాయణ నేపథ్యంలో పూరించమన్నపుడు అవధాని... 'రుచికిను.. త్వరపడి రమ్ము' అంటూ చక్కగా పూరించి హర్షధ్వానాలం దుకున్నారు. విశేష సంఖ్యలో హాజరైన హాస్య ప్రియులతో హాలు కిక్కిరిసింది.
- రాజహంస
అలరించిన 'హాస్యామృతం'
