ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య రాజకీయ దుమారం చెలరేగడం రాష్ట్రాభివృద్ధి పట్ల ఆ పార్టీల బాధ్యతారాహిత్యానికి దర్పణం పడుతోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయకుండా వంచిస్తున్న కేంద్రాన్ని ఏకోన్ముఖంగా నిలదీయాల్సిన ఇరుపక్షాలు ఆ పని చేయకుండా వీధుల్లో ఇలా దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ప్రజానీకానికి ఒరిగేదేముంటుంది? అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయడం లేదని, కనీసం తాము పూర్తి చేసిన భవనాలకు సున్నాలేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసొప్పలేదని టిడిపి నేతలు దుయ్యబడుతుంటే..రాజధాని ఎంపికలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి టిడిపి నేతలు కోట్లు కొల్లగొట్టారని, నమ్మి భూములిచ్చిన రైతులను నిలువునా మోసగించారని మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఈ నెల 28న రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణాత్మక వాతావరణం పూర్తిగా అవాంఛనీయం. ఈ వ్యవహారంలో అసలు ముద్దాయి అయిన కేంద్రాన్ని వదిలిపెట్టి పరస్పర తిట్లదండకాల వల్ల టిడిపి, వైసిపి నేతల వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలు నెరవేరవచ్చునేమో కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, ప్రజా ప్రయోజనాలకు కానీ ఇసుమంతైనా మేలు జరగదు.
దేశ రాజధాని న్యూఢిల్లీని తలదన్నేలా అమరావతిని భవ్యంగా నిర్మిస్తామని, దానికి పూచీ మాది అని రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి పెద్దలు హామీనిచ్చి దానిని ఆ నాటితోనే విస్మరించి వంచనకు పాల్పడినమాట వాస్తవం. పార్లమెంటు నుంచి తీసుకొచ్చిన గుప్పెడు మట్టి, గంగానది నుంచి తీసుకొచ్చిన దోసెడు నీళ్లతో సెంటిమెంటు పండించిన నరేంద్ర మోడీ ఆ తర్వాత మొహం చాటేశారు. కేంద్ర వంచనను పసిగట్టిన ప్రజానీకం నిధుల కోసం ఒత్తిడి తీసుకురావాలని నినదించినా మిత్రలాభం కోసం టిడిపి ప్రభుత్వం నాలుగేళ్లూ నిద్ర నటించింది. గ్రాఫిక్స్ డిజైన్లతో కాలం వెల్లదీసి అమరావతా? భ్రమరావతా? అనే విమర్శలకు చోటిచ్చింది చంద్రబాబే. ఎన్నికల వేళ ప్రజాగ్రహం తప్పదని గ్రహించి ఆఖరులో బిజెపి సర్కార్ పట్ల మిత్రవైరాన్ని నటించిన చంద్రబాబుకు ప్రజలు ఎంతగా గుణపాఠం నేర్పారో చూశాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కులను, నిధులను సాధించుకోవడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ తీరు కూడా గత టిడిపి ప్రభుత్వ తీరుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ స్వాగతించిన మాట వాస్తవం. ఇప్పుడు అదే అమరావతిని గ్రామమా? శ్మశానమా అంటూ అమాత్యుల స్థాయి వ్యక్తులు గందరగోళానికి తావిచ్చేలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మిన్నకుండిపోవడం సరికాదు.
ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పాదయాత్ర సమయంలో దారిపొడువునా ప్రమాణాలు చేసిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేమిటి? ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తీర్మానం కానీ, ప్రతిపాదన కానీ ఏమైనా వచ్చిందా అని ఓ ఎంపీ అడిగితే అబ్బే అలాంటి ప్రతిపాదనేదీ తమ ముందుకు రాలేదని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మోడీ సర్కార్ కుండబద్ధలు కొట్టింది. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హోదా సాధన కోసం, హక్కుల కోసం పోరాడుతూనేవుంటానని గొప్పలు చెప్పిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు నాడు చంద్రబాబులాగే మౌనం వహించడం దేనికి సంకేతం.
జమ్ముకాశ్మీర్‌ను ముక్కలు చేసిన నేపథ్యంలో విడుదల చేసిన భారతదేశ రాజకీయ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించకుండా బిజెపి నాటకమాడినా కూడా వైసిపి నిలదీసిన పాపాన పోలేదు. వైసిపి ఫ్యాక్షన్ తరహా రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని టిడిపి, రివర్సు టెండరింగ్ వంటి చర్యలతో అవినీతిని కడిగిపారేస్తుంటే టిడిపికి ఉలికిపాటెందుకని వైసిపి పరస్పర ఆరోపణలతో కాలం గడుపుతున్నారే తప్ప కేంద్రాన్ని నిలదీసి రావాల్సిన నిధులు రాబట్టుకుందామన్న స్పృహ బొత్తిగా లేదు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సేని నిండు సభలో గొప్ప దేశభక్తునిగా బిజెపి ఎంపీ సాద్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కీర్తిస్తే ఆ దుర్మార్గాన్ని యావత్ భారతావని సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి, టిడిపి, టిఆర్ఎస్ సభ్యులు మాత్రం మౌనర వహించారు. ఇంతకంటే దౌర్భాగ్యముంటుందా? బిజెపి అనుసరిస్తున్న రాష్ట్ర వ్యతిరేక వైఖరి విషయంలో వైఎస్ఆర్సిపి మౌనం వీడాలి. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే విషయంతో బాటు, రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరించే విషయంలోనూ, హైకోర్టు అదనపు బెంచీల ఏర్పాటు విషయంలోనూ తన వైఖరిని స్పష్టం చేయాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం, న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం మోడీ సర్కార్‌ను నిగ్గదీసి అడిగి రాబట్టుకోవాలి. ఇందుకోసం ప్రతిపక్షాలను కలుపుకొని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలి.
కేంద్రాన్ని నిలదీయాలి !
