ప్రపంచ దేశాలకు జనరిక్ మందుల ఎగుమతిలో భారత దేశానిదే అగ్రస్థానం. మొత్తం ఎగుమతుల్లో 20 శాతం మన దేశం నుంచే జరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లకు హృద్రోగం, రక్తపోటు మందులను, ఆఫ్రికా లోని పేద రోగులకు ఎయిడ్స్, క్షయ మందులను జనరిక్స్ రూపంలో భారతీయ ఫార్మా పరిశ్రమ చౌకగా సరఫరా చేస్తోంది. అంటే ప్రజారోగ్యంపై ఖర్చులు తగ్గించుకోవడానికి సంపన్న దేశాలు భారతీయ జనరిక్స్‌పై ఆధారపడుతున్నాయి. కానీ మన ప్రభుత్వం వాటిని సొంత ప్రజానీకానికి సవ్యంగా అందించలేకపోతోంది. మూడొంతుల భారతీయులు ఖరీదైన బ్రాండెడ్ మందులు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో నిర్ధారించింది. అయినా సరే, మన వైద్య శిఖామణులు అధిక ధరల బ్రాండెడ్ మందులనే రాస్తుండటంతో రోగుల ఇల్లు, ఒళ్లూ గుల్ల అవుతున్నాయని 2013లోనే 'కాగ్' ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బడా కంపెనీలు తయారు చేసే ఔషధాలను బ్రాండెడ్ మందులుగా వ్యవహరిస్తారు. ఏదైనా మందు రూపకల్పనకు పరిశోధన-అభివృద్ధి వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిశోధించే సదరు కంపెనీకి 20 ఏళ్లపాటు పేటెంటు ఇచ్చి ఖర్చులు రాబట్టుకునే అవకాశమిస్తారు. పేటెంటు గడువు తీరిపోగానే ఇతర కంపెనీలు వాటిని బాగా తక్కువ ఖర్చుకే తయారు చేసి చౌకగా విక్రయిస్తాయి. అవే జనరిక్ మందులు! బ్రాండెడ్ మందుల కన్నా ఇవి 30-80 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. మందుల చీటీలో వైద్యులు జనరిక్ మందుల పేర్లే రాయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినప్పటికీ అది ఇంతవరకూ అమలులోకి రాలేదు. భారతీయ వైద్యమండలి(ఎంసిఐ) గతంలో ఈ విషయమై నోటిఫికేషన్లు జారీ చేసినా వాటిలోని సందిగ్ధత వల్ల అమలుకు నోచుకోలేదు. ఫార్మా సంస్థలు ఇచ్చే కమీషన్లకు ఆశపడి వైద్యులు ఖరీదైన బ్రాండెడ్ మందులనే రాస్తున్నారని, మందుల దుకాణాలూ వాటి విక్రయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి.
జన ఔషధి పథకం కింద ఎనిమిది రాష్ట్రాల్లో తెరిచిన 178 జన ఔషధి దుకాణాల్లో నిరుడు జూన్‌కు 85 దుకాణాలు మూతబడ్డాయి. రాష్ట్రంలో ప్రారంభమైన జీవనధార దుకాణాలు కూడా సరిగ్గా పని చేయడం లేదు. వైద్యులు జనరిక్ మందులను సిఫార్సు చేయకపోవడం ఒక్కటే దీనికి కారణం కాదు. ఈ దుకాణాల్లో అన్ని మందులూ దొరక్కపోవడం కూడా కీలక కారణమే. జన ఔషధి దుకాణాలకు ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలు మందులను సరఫరా చేయాల్సి ఉండగా, ఆ కంపెనీలు అన్ని వ్యాధుల చికిత్సకు మందులను అందించడం లేదు.
పెరిగిపోతున్న కాలుష్యం వల్ల దేశంలో పలు రోగాలు తిష్టవేస్తున్నాయి. వీటి నుండి రోగులకు ఉపశమనం అందాలంటే వాడవాడలా జనరిక్ దుకాణాలు తెరవాలి. ప్రాణరక్షక ఔషధాలను జనరిక్స్ దుకాణాల్లో సులువుగా, చౌకగానే కాక, విరివిగా లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ముందుగా జిల్లాకు ఒకటి చొప్పున ఇలాంటి జనరిక్ ఔషధ విక్రయ దుకాణాలు తెరిచిన ప్రభుత్వం వీటి నిర్వహణను ఆయా జిల్లా కేంద్రాల్లోని మహిళా సమాఖ్యలకు అప్పగించింది. కానీ ఏడాది కాలంగా జనరిక్ మందుల షాపులు నిర్వీర్యం అవుతున్నాయి. మహిళా సమాఖ్యల తరపున వీటిని పర్యవేక్షించాల్సిన డిఆర్డిఏ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దొంగచాటుగా ఈ దుకాణాలను దెబ్బతీసి వాటిని ఇతరులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు సాగుతుండటంపై జిల్లా ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలి.
- ఎన్ కలీల్, సెల్ : 9440336771.
వాడవాడలా 'జనరిక్'
