రెండు దశాబ్దాలకుపైబడిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బిజెపి సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి తదితరులపై కుట్ర అభియోగాలు నమోదు చేసి పునర్విచారణ జరపాలంటూ బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అందరూ స్వాగతించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సంచలనాత్మక నిర్ణయం. సాంకేతిక కారణాలతో శిక్ష నుంచి తప్పించుకోజూసిన బిజెపి, కాషాయ పరివారానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు చెంపపెట్టు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దేశాన్నే కాదు ప్రపంచాన్నే కలచివేసింది. దేశంలో చాలా చోట్ల హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలకు కారణమైంది. వందల్లో అమాయకులు మరణించగా, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. బాబ్రీ మసీదు విధ్వంసకాండపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి. గుర్తు తెలియని కరసేవకులు మసీదును కూలగొట్టారన్నది మొదటిది కాగా, కూల్చివేతకు ముందు నేతలు ఉద్రేకపూరితంగా ప్రసంగించి అక్కడికి చేరిన వారిని రెచ్చగొట్టారన్నది రెండవ కేసు. ఇంతటి సంచలనాత్మక, సున్నిత కేసు కాంగ్రెస్, బిజెపి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ముక్కుతూ మూలుగుతూ సిబిఐ విచారణ కొనసాగిస్తూ ఏళ్లుపూళ్లుదాటించడం దారుణం. దీన్నిబట్టి దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశం ఆ రెండు పార్టీలకూ లేదన్నది స్పష్టం. బిజెపి అధి నాయకులపై నమోదు చేసిన అభియోగాలు పిక్‌పాకెట్, పిటి కేసుల వంటి సాదాసీదావేమీ కావు. భారతీయ శిక్షాస్మృతిలోని వర్గాల మధ్య శతృత్వం పెంచడం (153-ఎ), జాతీయ సమగ్రతకు హాని కలిగించే ప్రకటనలు చేయడం (153-బి), శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చెందించడం, వీటికి అనుబంధంగా నేరపూరిత కుట్ర (120-బి) వంటి తీవ్రాతి తీవ్రమైన సెక్షన్ల కింద అభియోగాలు నమోదు కాబడ్డాయి. రాయబరేలి ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు 2001లో బిజెపి నాయకులపై అభియోగాలను కొట్టేసింది. దానిపై అలహాబాద్ హైకోర్టులో సిబిఐ సవాల్ చేయగా కింది కోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆదేశాలు వచ్చాయి. తదుపరి అలహాబాద్ కోర్టు ఉత్తర్వులపై సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా బిజెపి నాయకులపై కుట్ర అభియోగాలు నమోదు చేసి విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మధ్య యుగాల నాటి కట్టడాన్ని కూల్చివేయడం నేరంగా సుప్రీంకోర్టు పరిగణించడం కేసులో ప్రైమాఫెసిగా భావించాలి. కూల్చివేత రాజ్యాంగపు లౌకిక నిర్మాణాన్ని కుదిపేసిందన్న సుప్రీం వ్యాఖ్యతోనైనా బిజెపి, సంఫ్‌ు పరివారం బుద్ధి తెచ్చుకోవాలి. రోజువారీగా విచారణ జరపాలని, రెండేళ్లల్లో పూర్తి చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశం కేసు ఇంకెంత మాత్రం జాప్యం కాకూడదన్న ఉద్దేశంతో ఇచ్చినట్లుంది. రెండు కేసులనూ కలపాలనడంతో ఇప్పటి వరకు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టడంపై సిబిఐని సుప్రీం తప్పుబట్టడాన్నిబట్టి ఆ సంస్థ నత్తను మించి పోయిందని తెలుస్తూనే ఉంది. అశోక్ సింఘాల్, బాల్ ఠాక్రే విచారణ కాకముందే చనిపోయారు కూడా. కాగా సుప్రీం ఇంతగా గడ్డి పెట్టినా బిజెపి నాయకుల్లో నదురు, బెదురు, ప్రాయశ్చిత్తం, ఆత్మపరిశీలన వంటివి ఏ కోశాన కనిపించట్లేదు. బాబ్రీ కేసులో కొత్తదనం ఏమీ లేదన్న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందన ఆ కోవలోనిదే. ఉమాభారతి అయితే కుట్ర ఏమీ లేదు, అంతా బహిరంగంగానే చేశామని మరోసారి బరితెగించారు. మామూలుగానే ప్రధాని మోడీ నోరు మెదపలేదు. అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకులు అప్పీల్‌కు వెళతారా, అక్కడ ఏమవుతుందనేది భవిష్యత్తులో తేలుతుంది.
ఇన్నేళ్లుపెండింగ్లో ఉన్న కేసు ఇప్పుడే ఎందుకు బయటికొచ్చిందనే కోణం ఉండనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సిబిఐని వాడుకోవడం సర్వసాధరణమైంది. బిజెపి నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిత్వ పోటీలో అద్వానీ మొదటి వ్యక్తి. అద్వానీని రాష్ట్రపతి కానీయకుండా అడ్డుకునేందుకు తన చేతిలో ఉన్న సిబిఐని మోడీ వాడుకుంటున్నారన్న ప్రచారాన్ని తోసిపారేయడానికి వీల్లేదు. హిందుత్వ ఎజెండాను దూకుడుగా అమలు చేస్తున్న మోడీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదు. అమిత్‌షా, మోడీ కటాక్షంతో యూపి సిఎం అయిన యోగి రామమందిర నిర్మాణమే తన ధ్యేయమంటున్నారు. దీన్నిబట్టి బాబ్రీ కేసులో దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశం మోడీ సర్కారుకు, ఆయన చెప్పుచేతల్లో ఉన్న సిబిఐకి ఎంతమాత్రం లేదు. అందుకే సిబిఐ చేతలను అద్వానీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే తన కేబినెట్లోనే ఉండి అభియోగాలు ఎదుర్కొంటున్న ఉమాభారతిని తొలగించాలి. రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్‌సింగ్‌ను బర్తరఫ్ చేయాలి. ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా సిబిఐకి స్వేచ్ఛ ఇవ్వాలి. అవేమీ లేకపోతే స్వంతపార్టీలో అధిపత్యం కోసం అద్వానీకి మోకాలడ్డటం కోసం పాత కేసును అడ్డం పెట్టుకున్నట్లు భావించాల్సిందే. పాలకులు స్వంత ప్రయోజనాల కోసం సిబిఐ వంటి అత్యున్నత సంస్థలను అడ్డగోలుగా వాడుకుంటే, వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంది.
బాబ్రీ కేసు
