'వీలైతే నాలుగు టికెట్లు, కుదిరితే ఓ కిరాయి' పంచ్లైన్లు ఆటో వెనుక కనిపించింది. అక్కడే అర్థమైపోయింది ఆ కుర్రాడికి.. మిగతా ముగ్గురు వస్తే గానీ, బండి స్టార్టవదని. జేబులు తడిమిచూసుకున్నాడు. కిరాయి అంటే.. తర్వాతి ఖర్చుకు రాయే అని కరారైంది. ఆ రూట్లో షేర్ ఆటో సర్వీసంటే... ఆటోవాలాలు చాలా పెద్ద మనసు చేసుకున్నట్టే. అరగంటపాటు నిలిపితే కానీ, నలుగురు సర్దుకోరు. కిరాయిచ్చి ఆటో ఎక్కేవాళ్లూ కానరారు. వరసగా నిలిపే నాలుగు ఆటోవాళ్లు కలసి ఒకే ఆటోలో కూర్చుని సెల్గేమ్లు ఆడుకుంటూ కనిపిస్తారు. మరో అరగంట గడిస్తే.. షేర్ మరో 5 రూపాయలు పెరుగుతుంది. ఈలోగా ఎవరన్నా వస్తే బాగుండని ఆ కుర్రాడు ఎదురుచూస్తున్నాడు. అంతదూరం నుంచి పక్కకు తప్పుకుంటున్న మెయిన్‌రోడ్డులో బస్సులు రయ్యిమని దూసుకుపోతున్నాయి గానీ, ఒక్కటీ ఆగడంలేదు. అవి ఆగితే.. ఈ పక్కదారిలో పడేందుకు ఒకడొస్తున్నాడన్న మాట..! చాలాసేపటి నుంచి నిలబడేసరికి కాస్త సహింపు తగ్గింది. మాట్లాడితే అటు ఇటు ఊగుతున్న అతణ్ని చూసి ఓ ఆటోవాలా లోపల కూర్చో అన్నట్టు చేయి కదిపాడు. కుర్రాడి ఆలోచన వేరు. ఎవరన్నా బైక్ ఆపి లిఫ్ట్ ఇస్తారేమోనని. తానక్కడికి వచ్చేసరికి ఒక పెద్దాయన అలానే దారినపడ్డాడు. అదేంటో ఆ రూట్లోకి వస్తోన్న బైక్‌లన్నీ కళకళలాడిపోతున్నాయి. మరో మనిషి కూర్చునేందుకు కాదు గదా.. ఓ బ్యాగు మధ్యలో పెట్టేందుకు కూడా జాగా లేకుండా కనిపిస్తున్నాయి. వీళ్లందరికీ ఆ రూట్ పరిస్థితి బాగా తెలుసనుకుంటా. పని మీద ఒకేసారి బయల్దేరి.. ఒకేసారి పూర్తిచేసుకుని వస్తుంటారేమో..! అని కాస్త ఆశ్చర్యపోయాడు.
అంతదూరంలో ఒక లారీ ఆగింది. నేల మీదున్న మరో రాయిని కొట్టబోయి కుర్రాడు ఆగాడు. తనలాంటి ఓ యువకుడు దిగాడు. వయస్సులో తప్పితే మిగతా విషయాల్లో తనలా ఏం లేడు. చేతిలో రెండు కవర్లు. వాటినిండా ఏవో..! ఒకదానిలో అన్నంబాక్స్ అనుకుంటా..! తనలానే బ్లాక్ టీ-షర్ట్ వేసినా అది బాగా వెలసిపోయింది. ఏమనిపించిందో..? తన టీషర్ట్ మీది గ్రాఫిక్ మరింత బాగా కనిపించేలా పోజు పెట్టి నిల్చున్నాడు. లారీ నుంచి దిగిన ఆ యువకుడు ఆటోస్టాండ్ దగ్గర ఆగకుండా నడుచుకుంటూ పోతున్నాడు. కుర్రాడు అతణ్ని ఎగాదిగా చూశాడు. అతడి కాళ్లకు చెప్పులు కూడా లేవని కుర్రాడికి అప్పుడే అర్థమైంది. ఆ రూట్లో ఇళ్లు తగిలేది చాలా దూరంలో. అంతదూరానికి అలా నడిచేస్తాడా..! కుర్రాడి ఆలోచనలకు దుమ్ము కొడుతూ ఓ టిప్పర్ వేగంగా ఆ రూట్లోకి పోయింది. ఆ ఒట్టిపాదాల యువకుడికి దాని శబ్దం ఎప్పటి నుంచో అలవాటనుకుంటా. అంతదూరం నుంచి చప్పున వెనక్కు తిరిగిచూశాడు. అక్కడే ఆగిపోయి.. చేయి పైకెత్తాడు. టిప్పర్ ఆగింది. అరే.. తానొచ్చిన దగ్గర్నుంచి ఓ నాలుగు టిప్పర్లయినా అటు వెళ్ల్లుంటాయి. బైకుల బదులు వాటిని ఆపితే బాగుంటాయని కుర్రాడు బాధపడ్డాడు. ఆ.. అయినా అతడి దగ్గరంటే ఏమీ తీసుకోరేమో గానీ, నా దగ్గర ఆటో డబ్బులు వసూలు చేయరూ..! అని తనకు తాను నచ్చచెప్పుకున్నాడు.
ఆటోవాలాలందరూ కలసి ఫోన్లో లూడో ఆడుతున్నారనుకుంటా..! ఒకడు హోమ్కెళ్లిపోయాడు. అందుకే.. చేతులిరిస్తూ ఆటో బయటకు అడుగేశాడు. అతడికది లాస్ట్ ట్రిప్పయితే బాగుండనుకున్నాడు కుర్రాడు. ఒక్కడున్నా లేకున్నా... మరీ బోర్ కొట్టేస్తే ఇంటికెళ్లిపోయే ట్రిప్పది. వాళ్ల ఇళ్లదీ అదే రూట్. కుర్రాడి అవస్థ అంతసేపటి నుంచి చూస్తున్న ఆ ఆటోవాలా వచ్చి కదిపాడు. దగ్గరే ఉంటే దింపేసొద్దామనుకున్నాడు గానీ, కుర్రాడి ఇల్లేమో రూట్లో చివరాఖర. ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ఆటోవాలా ఆలోచిస్తుండగా... మెయిన్ రోడ్డులో ఓ బస్సాగింది. కుర్రాడి, ఆటోవాలా ముఖాలు ఒకేసారి హెడ్లైట్లు వెలిగించుకున్నాయి. మరేం ఆలోచించకుండా ఆటోవాలా బండి స్టార్ట్ చేశాడు. కుర్రాడు బండి వెనుక సీట్లోకి చేరాడు. బస్సు దిగింది ముగ్గురు కావడంతో ముందుకెళ్లి కూర్చున్నాడు. వాళ్లు మామూలుగా నడుస్తున్నా.. ఎడారిలో ఎందాకటి నుంచే ఎండమావల్లె నడుస్తున్నట్టు అనిపించింది కుర్రాడికి. ఆటోవాలాకు అది మామూలే. ఈలోగా ఏ పాట పెడదామా అని ఫోన్ స్క్రీన్ స్వైప్ చేస్తున్నాడు. వచ్చినవాళ్లలో ఓ యువకుడు వేసుకున్న టీ-షర్ట్ రంగే కాదు నాణ్యం కూడా తన టీ-షర్ట్ కన్నా బాగా ఎక్కువనిపించింది కుర్రాడికి. అది అర్థమయ్యేట్టు... ఆ ముగ్గురి గ్యాంగు లీడరొకడు 'కిరాయొస్తావా...!' అని ఆటోవాలాతో కొద్దిగా బొంగురు గొంతుతో కమాండింగ్‌గా అన్నాడు. కుర్రాడికి విషయం అర్థమై ఆటో దిగిపోయాడు. ఆటోవాలా రేటు జేబుకేం తగలనట్టు ముగ్గురూ కూల్‌గా కూర్చుండిపోయారు. కుర్రాడు ఆటోవాలా వైపు కనురెప్పలు దగ్గర చేసి చూశాడు. ముందు సీట్లో కూర్చోమన్నట్టు ఆటోవాలా కన్నుగీటాడు. ఇంతలో వాళ్లలో ఒకడి ఫోను మోగింది. 'కారొద్దులేరా..! సరదాగా ఆటోలో వచ్చేస్తున్నామ'ంటూ అనడం వినబడింది. కుర్రాడికి, ఆటోవాలాకి హృదయం తేలికైంది. మధ్యలో దిగిపోతాడండి.. అని ఓపెన్‌గా కూర్చోబెట్టుకోబోయాడు ఆటోవాలా. 'కిరాయి మాట్లాడుకుందెందుకు...' అని ఇంకేదో మాట వేగంగా ముందు సీట్లోకి చేరింది.
తప్పదన్నట్టు మిగతా ఆటోవాలాలతో కలసి కూర్చున్నాడు కుర్రాడు. ఆట అయిపోయింది. మరో ఆటకు ఖాళీగా ఉన్న మిత్రుడి స్థానంలో తననూ వేలేయమంటారేమోనని, ఏదో బిజీగా తన ఫోన్ మీద వేలు గీకుతున్నాడు. ఇంతలో మరో బండిని లైన్లో పెట్టాడు ఓ ఆటోవాలా. ఎవరో ఒకామెను అక్కడ బైక్ మీద డ్రాప్ చేసి స్టయిల్‌గా చేతులూపుకుంటూ వెళ్లిపోయాడు. ఆమె ఎవర్నీ అడక్కుండానే వెళ్లి లైన్లో పెట్టిన ఆటోలో వెళ్లి కూర్చుంది. అదెప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎంతమంది ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా ఫోన్ తీసి దాంట్లో దూకేసింది. ఆటోవాలాలా ఆట గానీ, తన ఫోన్ గానీ కాలక్షేపంగా అనిపించక.. ఆ ఆటో దగ్గరకు తానూ వెళ్లాడు. కాసేపు నిలబడ్డాక ధైర్యంగా ఆటోలో ఆమె పక్కన కాస్త చోటొదిలి కూర్చున్నాడు. అలా ఓ పది నిమిషాలు గడిచిపోయాక మాట కదిపాడు. ఆ మాట కాస్త తగ్గు స్వరానిది కావడమూ, ఆమె ఫోనులో ఏదో వీడియో పెద్ద స్వరంతో అరుస్తుండటంతో అటు నుంచి స్పందన లేదు. కిరాయి కాదు గానీ, మిగతా ఇద్దరి డబ్బులూ తామే వేసుకుని ఆటోను బయల్దేరిస్తే బాగుండనేది కుర్రాడి ఆలోచన. జేబులో రోజువారి లెక్క తప్పినా... పక్కన అంత అందమైన అమ్మాయిండేసరికి అలాంటి ఏకాంత ప్రయాణం ఎప్పటికౖైెనా చేయాలనే ఆరాటం ఎప్పటి నుంచో ఉంది. అలాంటి క్షణం షేర్ చేసుకోవాలని అటూ ఉండొద్దూ...! అనుకుంటూ తనకు తానే సర్దిచెప్పుకుని.. తన ఫోనులోనూ పోస్టుల్ని ఎగాదిగా కదుపుతున్నాడు.
ఆమె వారగా మెయిన్‌రోడ్డు కొత్తగా కనిపిస్తోంది. ఫోకస్ అవ్వాల్సిన మార్గం తప్పి వేలాడుతున్న ఆమె కురుల్లో చూపుల్ని చుడుతున్నాడు. రోడ్డంతా బ్లర్‌గా కనిపిస్తున్నా.. రెండు బస్సులు ఒకేసారి ఆగిన విషయాన్ని బానే క్యాచ్చేశాడు. ఆమె కురుల్ని తప్పించుకోడానికి చూపుని అక్కడ వరకూ మరలించడానికి మనసొప్పుకోవడం లేదు. అయినా, ఫోకస్ మార్చుకున్నాడు. మరో ఆట పూర్తయ్యింది. ఈసారి ఇద్దరు ఆటోవాలాలు బయటపడ్డారు. చాలామందే వస్తున్నారని ఒకరంటే. ఒక్కరు నాకొచ్చినా వెళ్లిపోతానని మరొకరు అనుకోవడం కుర్రాడికి వినిపించింది. అప్పటివరకు ఎప్పుడు ఆటో కదులుతుందా..! అని ఎదురుచూసినవాడికి ఏదో క్లేశం కలిగింది. వచ్చేవాళ్లంతా పెద్దవారే కావడంతో ఆటోవాలా తనని ముందుసీట్లోకి మార్చేస్తాడనే బెంగ కలిగింది. తనలో ఇంత జరుగుతున్నా ఆమెకదేం పట్టదే..! అనుకుని ఉడుక్కున్నాడు. అప్పటివరకు ఆమెకు అంత దగ్గరగా కూర్చోవడమే ఎక్కువ..! అని లోలోన మెలికలు తిరిగినవాడే.. ఆమెదో లెక్కా...! అనుకుంటూ ఆటోవాలా చెప్పకుండానే ముందు సీట్లోకి సీరియెస్‌గా వెళ్లి కూర్చున్నాడు. అలాంటి విషయాలు తుచ్ఛం..! అని తనలో తాను ఓ పెద్ద లెక్చరిచ్చుకుంటూ ఆటో సైడ్ మిర్రర్‌లోకి చూశాడు. ఆమె అదోలా నవ్వుతోందని అర్థమైంది. అది భరించలేక సైడ్ మిర్రర్ని కదిపి ముఖాన్ని చూసుకున్నాడు.
రెండు ఆటోలు నిండిపోయాయి. ఇంకా ఒకళ్లు మిగిలారు. ఆ వ్యక్తి అంతకు ముందు లారీలోంచి దిగిన యువకుడికి మల్లే ఉన్నాడు. వెలసిపోయిన చొక్కానే కాదు చిరిగి, బలవంతపు అతుకులు పడిన లుంగీ కట్టి ఉన్నాడు. అందుకే, ఆటో సర్దుబాటుల్లో చివరాఖరకు మిగిలాడు. అతడూ ఇల్లు చేరాలనే విషయమే పట్టదన్నట్టు ఓ ఆటో బయల్దేరిపోయింది. కుర్రాడెక్కిన ఆటోవాలా కాస్త ఆలోచించాడు. ఒక్కరున్నా.. వెళ్లిపోతానని అన్న మిత్రుడు తనకన్నా ముందే బయల్దేరేయడంతో ఆ ఆటో వైపే చూశాడు. 'నన్ను చూసి ఏడవకురా...' అనే స్టిక్కరు తన ఆటోకు ఉందనే విషయం గుర్తొచ్చిందేమో నవ్వుకున్నాడు. 'పెద్దాయనా..! వాడూ వచ్చేస్తాడులే..' అంటూ ఒక్కడైపోయి నిల్చున్న ఆ లుంగీ వ్యక్తికి చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. మిగిలిన ఆటోవాలా బండి లైనులో పెడుతూ 'రెండు నిమిషాలు చూసి.. పోదాం రా..' అంటూ పెద్దాయన్ను పిలిచాడు. పెద్దాయన ఆటో వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నాడు. అంతసేపు చేతిలో బరువెక్కిన సంచిని కాళ్ల పక్కని స్థలంలో పెట్టి చేతులు విదుల్చుకున్నాడు. కుర్రాడు కూర్చున్న ఆటో మెల్లిగా కదిలింది. జరిగిన సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకుంటుండగా అందులోంచి కుర్రాడికి ఓ దృశ్యం కనిపించింది. అది అమ్మాయి ముఖం నుంచి కదిలి వెనుకున్న ఆటో మీదకు జరిగింది. ఎవరో ఇద్దరు స్టాండ్ దగ్గరకొచ్చారు. పెద్దాయన ఎవరూ చెప్పకుండానే ముందు సీట్లోకొచ్చి కూర్చున్నాడు... అంత బరువైన సంచీని ఒళ్లోకి పెట్టుకుంటూ. ఆ ఇద్దరు వేసుకున్న చొక్కాలు... పెద్దాయన వేసుకున్న తెల్ల చొక్కా కన్నా మెరిసిపోతున్నాయి.
- అజై
95023 95077