రంగు, రుచి, చిక్కదనం ఈ మూడు పదాలు వినపడగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం టీ. పేదా గొప్ప తారతమ్యం లేకుండా చాలామంది రోజుని మొదలెట్టేది ఓ చారు కొట్టే. గడగడ లాడించే చలిలో ఒక్క కప్పు చారు తాగితే చాలు ఆ కిక్కే వేరనిపిస్తుంది. మనదేశంతో పాటు వివిధ దేశ సంస్కృతుల్లో భాగమవుతూ ఎంతోమంది అభిమానుల్ని పోగేసుకున్న చారు విశేషాలేంటో తెలుసుకోవాలంటే మీరూ తేనీటి ప్రపంచాన్ని రుచి చూడాల్సిందే.
టీ ఆనవాళ్లు మొదట లభించింది చైనాలోనే. క్రీ.శ, 3వ శతాబ్దంలో చాంగ్ రాజవంశుల కాలంలో నైరుతి చైనాలో తేయాకును ఒక ఔషధ పానీయంగా తీసుకునేవారు. రుచిలో చేదుగా ఉండే ఆ పానీయం పేరు 'టు'. అయితే ట్యాంగ్ వంశస్తుల ద్వారా 'టీ' అనే పదం చైనాలో వాడుకలోకి వచ్చినా చైనాలో టీకి మరికొన్ని పురాతన పేర్లున్నాయి. మ్యాండరిన్లో 'చా' అని పిలిస్తే, వు ప్రాంత చైనీయులు 'జొ', లేదా 'డిజొ' అని పిలుస్తారు. మిన్ ప్రాంతీయులు 'టా', 'టె' పదాలతో సంబోధిస్తారు. పోర్చుగీస్ మత గురువులు, వ్యాపారుల ద్వారా 16వ శతాబ్దం నాటికి చైనాలో తేయాకు ఒక వాణిజ్య పంటగా మారిపోయింది. చైనా నుండి 17వ శతాబ్దంనాటికి బ్రిటన్‌కు పరిచయమైన టీ అక్కడ అత్యంత ప్రజాదరణని పొందింది. 12వ శతాబ్దంలో భారత్‌లోని షింగ్పొ, కమ్టి తెగల్లో టీ వాడుకలో ఉన్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. తేయాకు సాగు 17వ శతాబ్దం చివరిలో డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్‌కు పరిచయమైంది. భారత్ నుండి యూరప్‌కు తేయాకు ఎగుమతికి అంగీకరించిన వారికి మాత్రమే అస్సాం ప్రాంతంలో కొంత భూమిని కేటాయించడంతోపాటు టీ విత్తనాలు, సాగు పరిచయంచేసేవారు.. తర్వాత సిక్కిమ్, డార్జెలింగ్, అస్సామ్ ప్రాంతాలకి తేయాకు సాగు విస్తరించింది. 1867లో సిలోన్ (ఇప్పటి శ్రీలంక)లో టీ సాగు మొదలైంది. ఈ తోటల్లో పనిచేసేందుకు తమిళుల్ని ఎక్కువగా తీసుకెళ్లారు.
రుచులెన్నో
సాధారణంగా టీకి ఉపయోగించే ఆకులు కెమిల్లియా సినెన్సిస్ అనే మొక్కకి చెందినవి. ఆసియా ఖండపు స్థానికతను కలిగిన ఈ మొక్కలని నేడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ, ఉపఉష్ణమండలాల్లో దాదాపు 3000 రకాలను సాగుచేస్తున్నారు. అనేక రకాల టీ రుచులు అందుబాటులోకొచ్చాయి.
టీ పొడి రూపంలో కాకుండా నేరుగా ఆకులని మరిగించి తయారుచేసే టీ మరింత సువాసన, రుచి, చిక్కదనాన్ని కలిగుంటుంది. ప్రస్తుతం వేలాది తేయాకు రకాలను సాగుచేస్తున్నా బ్లాక్ టీ, డార్క్ టీ, గ్రీన్‌టీ, వైట్ టీ, వూలాంగ్ టీ, పూయెర్ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టీ రకాలు.
పాలొద్దు.. బ్లాకే ముద్దు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడేది బ్లాక్ టీనే. కానీ మన దేశంలో పాలతో కలపి చేసే టీనే ఎక్కువ ఇష్టపడతారు. ఈ రుచిని అంటించింది బ్రిటిష్ వారు. వారికి కాస్త చేదుగా అనిపించే బ్లాక్ టీ లేదా రా టీ కన్నా పాల పరిమళం కలిసినదే నచ్చిందేమో. ఈ ప్రపంచానికి బ్లాక్ టీ రుచి చూపించింది చైనావాసులనే చెప్పాలి. 'ఫ్యుజియన్ ల్యాప్ శాంగ్ సోచింగ్', 'ఫ్యుజియాన్ మిన్హాంగ'్, 'అన్హురు కీమున్', 'యున్నాన్ దియాన్హాంగ్', 'గ్వాంగ్డాంగ్ ఇంగ్టెన్ సిచువాన్ మోబియన్', 'గుంగ్ ఫూ అక్కడ పేరొందిన బ్లాక్ టీ రకాలు. చైనాలో అత్యంత ప్రసిద్ధి పొందిన బ్లాక్ టీ రకం కీమున్. డార్జెలింగ్, అస్సామ్, సిలోన్, కీమున్ బ్లాక్ టీ ఉత్పాదనలో చైనా తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్‌లో తొలినాళ్లలో అత్యంత అధిక ధర పలకడంతో ఒక వ్యక్తి సంపద, స్థితికి సూచిగా నిలిచింది బ్లాక్ టీ. బ్రిటిషోళ్లు తప్ప మిగతా పాశ్చాత్య దేశాల్లో చిక్కటి బ్లాక్ టీనే తీసుకుంటారు. భారత్‌లో బ్లాక్ టీ ఆకులతోపాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మసాలా టీ చేస్తారు.
పచ్చగా తాగేస్తున్నారు
యూరప్ ఖండంతో పాటు జపాన్, ఇండోనేషియా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియాలో గ్రీన్ టీని ఎక్కువగా మరిగించకుండా చిక్కగా తీసుకుంటారు. రుచిలో చేదుగా ఉన్నా ఆరోగ్య పరమైన విలువలు కలిగుండటంతో గ్రీన్ టీని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. మొరాకోలో ఇదో ఆరోగ్య సూత్రం. ఇది అంతటా పాకేసి ఇప్పుడు గ్రీన్ టీ బ్యాగ్‌లు వేడి నీటిలో ముంచుతూ మాట్లాడే ఆఫీసు దృశ్యాలెన్నో మన దేశంలోను కనిపిస్తున్నాయి.
'తే'పూల సువాసన
తేయాకులని ఒక పువ్వు ఆకారంలో అమర్చి వాటిని ఎండబెడతారు. ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లేలా ప్రాసెస్ చేసే ఈ టీ రకం కూడా ప్రాచుర్యం పొందింది. రెండు మూడు సార్లు తిరగ మరగబెట్టే వూలాంగ్ తేనీటి తయారీ దృశ్యాల్ని హాలీవుడ్, చైనీస్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో చూసుంటాం. దీన్ని డికాక్షన్ రూపంలో హెంచాగా తీసుకుంటారు. చైనా, తైవాన్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేయబడుతున్న ఈ రకం బ్రిటన్‌లోను ఎక్కువ వాడకంలో ఉంది. కోల్డ్ బ్రూ, సన్ టీలలా శీతల పానీయాలుగాను తేనీరుని తీసుకుంటారు.
టీ కల్చర్
తేనీటి సంస్కృతి అంటే మరేం లేదండి చక్కగా వేడి వేడి తేనీటిని ఓ సిప్పేస్తూ చిన్న చిన్న కబుర్ల నుంచి పెద్ద పెద్ద వ్యవహారాల్ని మాట్లాడేసుకోవడం ఓ పద్ధతి. లేదా తేనీటి విందులకు పిలిచి మర్యాదలు పంచేయడం మరో సంప్రదాయం. ఇది చూడాలంటే సహోద్యోగిని చారు తాగుదాం రా అని పిలిచికెళితే సరి. టీ కల్చర్ అలవాటైపోతుంది. టీ కొట్టు ముఠాల స్థాయిని దాటేసి ఘనంగా వేడుకల్ని చేసేస్తారు జపాన్, చైనా దేశాల్లో. తేనీటిని సేవించే పద్ధతుల్లోనూ, అతిధులకి అందించడంలోనూ ఒక్కో చోట ఒక్కో వైవిధ్యం ఉట్టిపడుతుంది. ఒక్కో ప్రత్యేక తేనీటి సంస్కృతి ఒక్కో దేశానిది. ఇక గల్లీ గల్లీకి మారిపోయే స్పెషల్ టీ సంగతులెన్నో.
రుచులెన్నో
బ్రిటన్ సంస్కృతి లో భాగమైన ఈ పానీయాన్ని అతిధులు వచ్చిన వెంటనే వేడివేడిగా అందిస్తారు. గృహాలతోపాటు పనిప్రదేశాల్లో టీ తాగే అలవాటుతోపాటు మధ్యాహ్న సమయంలో టీని కేక్‌లతో కలిపి తీసుకుంటారు. ఇంగ్లాండ్‌లోని టీ కేఫ్‌లలో టీ పాత్రతోపాటు బ్రెడ్, క్రీమ్, జామ్‌లను ఉంచి సర్వ్ చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్ర సమయాల్లో ఆహారానికి బదులుగా తీసుకునే టీని ఈవెనింగ్ మీల్ అని పిలుస్తారు. టీ ఔత్సాహికుల కోసం ప్రత్యేక టీ రూమ్స్, కేఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టీ వినియోగదారులున్న దేశంగా గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌లో బ్రిటన్ టీ కంటే ఎక్కువ చిక్కగా, ఘాటుగా ఉండే తేనీటిని ఐర్లాండ్ వాసులు రోజుకు నాలుగైదు సార్లు తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ సార్లు సేవించే టీ అభిమానులూ లేకపోలేదు.
టర్కీనే టీ డ్రంకర్డ్
మధ్య ప్రాచ్య దేశాల్లో కూడా టీని ఎక్కువగా వినియోగిస్తారు. సామాజిక సమావేశాల్లో భాగంగా టీ అరబ్బుల సాంప్రదాయ పానీయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీ మార్కెట్‌ని కలిగిన దేశం టర్కీలో బ్లాక్ టీ ఎక్కువ జనాదరణ పొందింది. రష్యాలోను 82 శాతం మందికి అత్యంత ప్రియమైన పానీయం. పాకిస్తాన్లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన బ్లాక్ టీ, గ్రీన్ టీలను వారు సబ్జ్, కహ్వా చారుగా పిలుస్తారు. టీ ఉత్పత్తిలో రెండో స్థానాన్ని దక్కించుకున్న భారత్‌లో టీ ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో టీ ఒక పానీయంగానే కాక ఎంతో మంది జీవనోపాధికి మార్గమైంది. మట్టి కప్పుల్లో టీని సేవించే సాంప్రదాయం నుండి స్టార్ హోటళ్లలోనూ చారుని ఒక్కసారి రుచిచూడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.
- అద్దేపల్లి శర్వాణి



