కఠినమైన పదాలతో పదప్రయోగాలతో పద్యాలు ఉండటంతో నిరక్షరాస్యులకి సాహిత్యం అందకుండా పోయింది. దీంతో గ్రామాల్లో సాహిత్యంపై ఆసక్తి చూపేవారూ కరువయ్యారు. నిరక్షరాస్యులకు కూడా తేలికగా అర్థమయ్యే రీతిలో వందల సంఖ్యలో పద్యాలు, పాటలు, రచించిన హల్దార్ నాగ్ ఇప్పుడు ఓ ప్రజాకవి. అంతకు మించి అతనో పద్మశ్రీ అవార్డు గ్రహీత. పశ్చిమ ఒడిషా స్థానిక కోస్లీ భాషలో తను రచించిన పద్యాల సంకలనాలు హల్దార్ గ్రంథావళి-2 పేరుతో సంబాల్పూర్ యూనివర్శిటీిలో పాఠ్యాంశాలుగా రానున్నాయి.
గొప్ప కవులుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది రచనా శైలికి భిన్నంగా ఉంటుంది ఇతనిశైలి. ప్రజావేదికలపై సొంత సాహిత్యంలో ఇతను పాడే పద్యాలు, పాటలు వేల సంఖ్యలో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వందలాది యువ కవులు ఇప్పుడితని శైలినే అనుకరిస్తున్నారు.
ఒడిషాలోని బర్గార్ జిల్లాలోని ఘీస్ గ్రామంలో 1950 మార్చి 31న ఓ పేద కుటుంబంలో జన్మించాడు హల్దార్. పదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికి మూడో తరగతి చదువుతున్న హల్దార్ కుటుంబ పోషణ కోసం మూడో తరగతిలోనే చదువు మానుకుని గ్రామంలోని ఒక చిన్న స్వీట్‌షాపులో పాత్రలు శుభ్రంచేసే పనిలో చేరాడు. తర్వాత ఘీస్ హైస్కూల్ల్లోని హాస్టల్ మెస్‌లో వంటవాడిగా చేరాడు. పదహారేళ్ల పాటు ఈ వృత్తిలోనే కొనసాగాడు హల్దార్. తర్వాత మాలతితో అతని వివాహం జరిగింది. అప్పటికి తన గ్రామంలో ఎన్నో స్కూళ్లు రావడంతో బ్యాంకులో వెయ్యిరూపాయలు బుణం తీసుకుని పుస్తకాలు, పెన్నులు, తినుబండారాలమ్మే ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించాడు. అప్పట్టో విద్యార్థులు ఇంకు పెన్నుల్ని వాడేవారు. పది పైసలకి వాళ్లకి ఇంకు అమ్మేవాడు హల్దార్. విద్యార్థుల కలాల్లో ఇంకు నింపిన ఆ ప్రదేశమే పునరుద్ధరింపబడి ఇప్పుడు ఎంతో మంది కళాభిమానులకు,సాహిత్య పరిశోధకులకు వేదికగా మారింది. విద్యార్థులకు ఇంకు అమ్మే రోజుల్లో అతనికి పద్యాలు రాయడంపై మక్కువ ఏర్పడింది. సాహిత్యంపై తనకున్న అభిరుచితో 1990లో తను రాసిన తొలి పద్యాల సంకలనం ధోడో బర్గాచ్ (పాత మర్రి చెట్టు). ఈ సంకలనంలో నాలుగు పద్యాలను స్థానిక మ్యాగజైన్‌కి పంపాడు హల్దార్. వాటన్నిటినీ ఆ పత్రికలో ప్రచురించటంతో తనకి మరింత ప్రేరణ లభించింది. అప్పటి నుండి తను రాసిన పద్యాలను దగ్గరలో ఉండే గ్రామాల్లో ప్రజలకి వినిపించడం మొదలుపెట్టాడు. వాళ్ల నుండి వచ్చిన స్పందనే తనను ప్రజాకవిగా మార్చిందంటాడు హల్దార్. పీడిత జనులపై జరిగే దురాక్రమాలు. సామాజిక సంస్కరణల ద్వారానే సమాజంలోని అన్ని వర్గాల వారికీ సమానగౌరవం అందాలనే అంశాలు తన రచనల్లో తేటతెల్లమౌతాయి. వీటితోపాటు, పురాణాలు, మతం, సమాజం, ప్రకృతికి సంబంధించిన వివిధ అంశాలు ఇతని పద్యాల్లో కనిపిస్తాయి. తొలి రోజుల్లో మానవ సంబంధాలు ఎలా చిత్రించబడ్డాయో చరిత్ర అధారంగా తన పద్యాల్లో చక్కగా పొందుపరిచాడు హల్దార్ నాగ్. పురాణాల్లో స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను అన ఆలోచనలతో జోడించి పద్యాల రూపంలో పొందుపరిచాడు.
ఒడిషాలోని దాదాపు 10 జిల్లాల ప్రజలు ఉపయోగించే సంభాల్పురి కోష్లి భాషలో ఇతని రచనలు ఉండటంతో ఎంతో మంది గ్రామీణులకు తన రచనలతోనే చేరువయ్యాడు హల్దార్. సరళమైన పదాలతో ఉండే ఇతని శైలి నిరక్షరాస్యులైన కవిత్వ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. దోపిడీి, అణచివేత, వివక్షలు ప్రధాన అంశాలుగా వేలాది పద్యాలు రచించారు హల్దార్. సామాజిక అసమానతలను నిగ్గదీసే ఎన్నో అంశాలు తన రచనల్లో ప్రతిబింబించడంతో గ్రామీణ ప్రజలు హల్దార్ని తమ సొంత కవిగా భావిస్తారు. గ్రామీణ ప్రజల్ని చైతన్య పరిచే హల్దార్ పాటలు ఇప్పుడు ఒడిషా గ్రామాల్లో దాదాపుగా రోజూ ఏదో ఒక వేదికపై వినిపిస్తూనే ఉంటాయి. సమాజ మార్పు కోసం తను చేస్తున్న కృషికి సంబాల్పూర్ విశ్యవిద్యాలయం గౌరవనీయమైన బ్రహ్మపుత్ర అవార్డుతో సత్కరించింది. భాషాభివృద్ధ్దికి తను చేసిన కృషికిగాను 2014లో ఒడిషా సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం హల్దార్ది. అందుకే ఎన్ని గౌరవ సన్మానాలు అందుకున్నా తన ఆహార్యం మాత్రం తన సహజత్వాన్ని ప్రతిబించేలా ఉంటుంది. పంచకట్టులో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఓ సామాన్య గ్రామీణ జీవనశైలిలో ఒదిగిపోయాడు హల్దార్. ప్రతిరోజూ ఎన్నో యూనివర్సిటీల నుండి ఆహ్వానాలు, ప్రజావేదికలపై పద్యాలు వినిపించేందుకు వందల మైళ్లు ప్రయాణాలు. మూడవ తరగతిలోనే చదువు మానుకున్న ఓ వ్యక్తి సొంత సృజనతో రాసిన పద్యాలు ఎంతో మంది పండితులకు, పరిశోధకులకు ఆధారమవుతున్నాయి. సామాన్య ప్రజలకు కూడా తన రచనలు చేరువవడంతో ఎంతోమంది రచయితలు ఇప్పుడు హల్దార్ నాగ్‌ను అనుకరిస్తున్నారు.
మూడవ తరగతిలోనే చదువు మానుకున్న ఓ వ్యక్తి సొంత సృజనతో రాసిన పద్యాలు ఎంతో మంది పండితులకు, పరిశోధకులకు ఆధారమవుతున్నాయి. సామాన్య ప్రజలకు కూడా తన రచనలు చేరువ వడంతో ఎంతోమంది రచయితలు ఇప్పుడు హల్దార్ నాగ్‌ను అనుకరిస్తున్నారు.
ప్రజాకవి హల్దార్ నాగ్
