విజయన్‌కు ఆరేళ్లపుడు... తండ్రి చేయి పట్టుకుని కేరళ చూపించాడు. అరవై ఆరేళ్లు దాటిన విజయన్ ఇపుడు తన భార్యకు ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. అదీ ఓ చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ. ఇప్పటి వరకూ 17 దేశాలను చుట్టొచ్చిన విజయన్ మోహన దంపతుల్ని ఇది సాధ్యమేనా అని అడిగితే 'సాధిక్యుమ్... సాధికిమ్... సాధిక్కిమ్' అని బదులిచ్చేపుడు ఆయన గొంతు చాలా గంభీరమౌతుంది. అందులో ప్రతిధ్వనించే ప్రపంచాన్ని చూడాలనే ఆ తీవ్ర కాంక్షే చెబుతుంది విజయన్ జీవిత యాత్ర ఎలా సాధ్యమైందో...
ఎర్నాకుళంలోని బాలాజీ కాఫీ హౌజ్ ఓ చిన్న ఇరుకు గదిలో ఉంటుంది. కానీ, అందులో వస్తువుల్ని చూస్తే దుకాణ యజమాని ఆలోచనలు ఎంత విశాలమో తెలుస్తుంది. గోడకు మూడు గడియారాలు మూడు కాలమానాల్ని చూపిస్తుంటాయి. వడల కింది అరలో ఓ గ్లోబ్.. అటు పక్కనే ఈఫిల్ టవర్ మాతృక.. కొన్ని అట్లాస్‌లు, ట్రావెల్ గైడ్లు. ఓ చిన్న విమానం బొమ్మ దారం దిండు పక్కన వేలాడుతుంటుంది. మోహన ఇడ్లీల్ని రేకుల నుంచి తీస్తే, విజయన్ పొట్లం చుట్టి ఇస్తాడు. 20-25 రూపాయలు పెడితే కడుపు నిండిపోతుంది. సరిగ్గా అపుడే విజయన్ మోహన దంపతుల ఆకలి మొదలౌతుంది. అది బొజ్జకు కాదు హృదయానికి.. ఇంకా చెప్పాలంటే పసిగట్టలేని మనసుకు. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త జీవితాలు, కొత్త అనుభూతులు, కొత్త అనుభవాలు రుచి చూడాలనే ఆకలది. అదే ఓ కొత్త ప్రయాణానికి చిల్లర పోగు చేస్తుంటుంది. ఇదీ ఆ దంపతుల రోజువారీ జీవితం.
ఏం వెనకేసుకున్నారు?
ప్రయాణాలకు 45 ఏళ్లలో లక్షలు ఖర్చయ్యాయి.. ఏం వెనుకేసుకున్నారని.. ఏ స్థలమో, బంగారమో కొనుక్కుంటే ఆస్తి మిగిలేదిగా అని అసూయతో అనే సూటిపోటి మాటలకు విజయన్ జవాబిచ్చేపుడు కాస్త నెమ్మదిస్తాడు. గుండె నిండా గాలి పీల్చి నెమ్మదిగా వదులుతూ... వెలకట్టలేని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, జీవితంపై సంపూర్ణ జ్ఞానం, ప్రపంచంపై ఓ అవగాహన అని అంటాడు. ఇవి తప్ప మిగతావేవి చివరికంటా రావని నవ్వేస్తాడు. ఇంకా చెప్పాలంటే అవే తరగని ఆస్తి అని.. దాన్ని దక్కించుకున్నందుకు తామే అత్యంత ఐశ్వర్యవంతులమని గట్టిగా చెబుతాడు. మనతో మాట్లాడుతూనే.. కస్టమర్‌కు వేడి వేడి చారు గ్లాసు చేతికందిస్తాడు. మరి మూడేళ్ల అప్పు మెల్లిగా తీరేది ఆ డబ్బుతోనే. పెనం మీద దోసెను తిప్పి.. మళ్లీ మాట కలుపుతాడు. రోజు మొదలు మనవన్నీ ప్రయాణాలే. ఒక్కో ప్రయాణంలో ఒక్కో అనుభవం. ఇంటి నుంచి బయట అడుగు పెట్టడం ఓ విలువైన ప్రయాణమే, తిరిగి ఇంటికి వెళ్లడమూ ఓ అనుభూతుల ప్రయాణమే.. అంటాడు. 'ఈ ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు పడతాం.. అలాగే ఎన్నో గొప్ప ఆనందాలు పొందుతాం. ఈ ప్రయాణాలన్నీ ముగిస్తే మన జీవితం ముగిసినట్టే. లెక్కల్లా వీటితో పరిపూర్ణ యాత్ర చేశామా లేదా అనేదే. మనం పోయాక అన్నీ పోతాయి. మనం ఎంత ప్రయత్నించినా సముద్రపు అలల్ని ఆపలేము. అలాగే జీవితంలోని బాధ్యతలు కూడా. ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. వీటిని తీర్చడం కోసం డబ్బు సంపాదన ఒక్కటే లక్ష్యమైతే ఏమీ పొందలేం, జీవితాన్ని ఆస్వాదించలేం. మరణించేంత వరకు ఒక్క రోజూ విరామం తీసుకోలేం. మనకున్నది ఒక్కటే జీవితం.. మరో దాన్ని సృష్టించుకోలేం. మిగిలి ఉన్న జీవితంలో కావాల్సినంత సమయం మన ప్రయాణాలకు ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే నేను చేస్తున్నది. ప్రయాణాల వల్ల ఏం పొందుతామో ఒక్క ప్రయాణిస్తే తప్ప అర్థం
కాదు. అది అర్థమయ్యేలా చెప్పలేను...' అని సుదీర్ఘంగా తన జీవిత యాత్ర అనుభవాల్ని, అభిప్రాయాల్ని వివరిస్తాడు. కాస్త తీరిక దొరికాక డైరీల్ని ఓ సారి తిప్పి ఆ దేశానికి, ఆ ప్రాంతానికి చేరిపోతాడు. మనమేం సాధించాం, ఏమి సాధించాలి అనే లెక్కల్ని పక్కనపెట్టి స్వేచ్ఛగా విహరించాలి. కళ్లున్న అందరూ చూస్తారు కానీ మనసు లగం చేసిన వారే అనుభూతి చెందుతారు. గుండెల్లో పదిలం చేసుకుంటారని మెరిసే కళ్లతో చెబుతాడు. నాలా విదేశాలు చుట్టొచ్చే వాళ్లు చాలా వరకు ధనవంతులే ఉంటారు. వాళ్లు వందల డాలర్లు ఖర్చు చేస్తారు. నేను పది డాలర్లు మారుస్తాను. కానీ, అవే ప్రాంతాలు, అవే విషయాలు, అవే అనుభూతులు.. ఒకే ఎరుకనిస్తాయి.. అని చిరునవ్వు చిందిస్తాడు.
హిమాలయాల్లో మలుపు...
విజయన్‌లో ఇలా ప్రపంచాన్ని చూసి రావాలనే యాత్ర కాంక్షను రగిలించింది ఆయన తండ్రి. విజయన్‌కు ఆరేళ్లపుడు కేరళ సుందర తీరమైన పళనికి తొలి ప్రయాణాన్ని కట్టించాడు. ఆ తర్వాత మధురై. జీవితం-ప్రపంచంపై బలమైన ముద్ర వేశాయా ప్రయాణాలు. చిన్నప్పుడు దగ్గరి ఊర్లు చూసి రావడానికి ఇంట్లోని ధాన్యం గింజల్ని దొంగిలించి పచారీ కొట్టులో అమ్మి ఆ డబ్బుతో ఊర్లు చుట్టొచ్చేవాడు. విజయన్ ప్రయాణాల కోరిక గమనించిన తండ్రి తనతో పాటు కేరళంతటా తిప్పాడు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర సీమల్ని చూపించాడు. విజయన్ ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే తండ్రి ఆకస్మిక మరణం ఒంటరిని చేసింది. ఇంటి బాధ్యతలన్నీ మీద పడటంతో ప్రయాణాలకు దూరమయ్యాడు. ఇంతలో వివాహమైంది.
భార్యను ఊరు దాటించాడు...
మోహన అప్పటివరకు ఎర్నాకుళం దాటి ఎప్పుడూ బయటకు అడుగు పెట్టలేదు. ప్రయాణంలోని మాధుర్యాన్ని పంచాలని తొలుత దక్షిణ భారత యాత్ర చేశాడు. ఆమెకు అదంతా ఓ కలగా తోచింది. ఆ స్వప్నం నుంచి తేరుకునే కాలంలో 1988లో విజయన్‌కు హిమాలయాల్లో యాత్ర చేసే అవకాశం వచ్చింది. ఓ డబ్బున్న యాత్రికుడికి వంట మనిషిగా తోడు ప్రయాణం సాగించాడు. ఆ ప్రయాణం మొత్తం జీవిత నడతనే మార్చేసింది. అప్పు చేసో, బ్యాంకు నుంచి రుణం పొందో పెద్ద ప్రయాణాలు కట్టాడు. భార్యకు విశాలమైన ప్రపంచాన్ని కళ్లకు కట్టేందుకు తపించాడు. ఉత్తర భారతదేశం పూర్తయ్యాక మిగిలింది మిగతా ప్రపంచం. దేశం దాటడం విజయన్‌కు కొత్తే. తొలుత ఈజిప్టు, జోర్డాన్‌ల ట్రిప్పు. రుణం తీర్చడానికి ట్రిప్పు తర్వాత మూడేళ్ల పాటు కిస్తీలు కట్టారు. మోహనకు అదో దుస్సాధ్యమైన స్వప్నం, దుస్సాహసమైన పయనం. అలా ఒక్కో దేశం చుట్టి రావడం.. ఆ తర్వాత ఇద్దరూ కష్టపడి మూడేళ్లలో రుణం తీర్చుకోవడం. పది డాలర్లకు మించకుండా ఖర్చుపెట్టడం, వీలైనంత వరకూ సర్దుకుపోయి బతకడం. అయినా కూడా దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ సారి ఇబ్బందులు తప్పలేదు. కానీ ఓ పాత పరిచయం వల్ల విమాన టిక్కెట్టుకు, ప్రయాణ ఖర్చులకు డబ్బు సాయం అందింది. కొన్ని రోజుల పాటు అతడింట్లో వసతి లభించింది. మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ, యూకే, ఫ్రాన్స్ ఇలా 16 దేశాలు చుట్టొచ్చారు.
ప్రయాణం కట్టించారు...
గతేడాది అమెరికా స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. అయితే అందుకు కాస్త ఎక్కువే ఇబ్బంది ఎదురైంది. కాస్త ఎక్కువే సాయం అందింది. వయసు పైబడటంతో బ్యాంకు వాళ్లు రుణమివ్వడానికి ఒప్పుకోలేదు. బయట అప్పు పుట్టలేదు. ఇక అమెరికా చూడాలనే భార్య కోరిక తీరుతుందో లేదోనని విజయన్ ఆదుర్దా పడ్డాడు. ఓ మీడియా సంస్థకు ఈ విషయం చేరింది. ఓ కథనం వచ్చింది. హరి మోహనన్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్‌కు విజయన్ మోహన జీవిత యాత్ర స్ఫూర్తిగా అనిపించింది. వెంటనే వారిని కలిసి ఓ డాక్యుమెంటరీ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారు. ప్రయాణాల్లో విశేషాల కన్నా విజయన్ మోహన దంపతుల యాత్ర ఫిలాసఫీనే ఎక్కువ ఆకర్షించింది. దాన్నే 'ది ఇన్విజిబుల్ వింగ్స్' పేరిట విజయన్ మోహన దంపతులకు ప్రయాణంపై ఉన్న పొయెటిక్.. రొమాంటిక్ ప్రేమను తెరకెక్కిస్తూ ఓ కళాఖండాన్ని చిత్రీకరించారు. ఆ లఘచిత్రాన్ని వీలైనంత మందికి చేరవేసే ప్రయత్నం చేశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ట్రావెల్ బగ్ కుడుతోంది. ఓ విలువైన కాలానికి ప్రయాణం కడుతోంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్‌లను కూడా కదిలించింది. క్రౌడ్ ఫండింగ్‌తో పాటు అనుపమ్ లాంటి పెద్దలు అమెరికా యానానికి సర్వం సిద్ధం చేస్తే... కాంప్లిమెంటరీ టికెట్లతో విమానయాన సంస్థ ప్రోత్సహించింది.
దూకాక రెక్కలు కట్టు...
అమెరికా యాత్ర నుంచి తిరిగొచ్చాక విజయన్ ఆ సంగతులు చెబుతూ లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ సిటీలో మనసు తప్పిపోయిందని చెప్పాడు. మోహనను యూనివర్సల్ స్టుడియోస్ కట్టిపడేసింది. ఇన్ని ప్రయాణాల్లో ఏది అద్భుతమని అడిగితే దేనికదే విలక్షణమైందని బదులిస్తూనే... నైలు నదీ పరీవాహకంలో మరోసారి తచ్చాడాలని ఉందని విజయన్ అంటాడు. 'ఇజ్రాయిల్‌లోని క్రీస్తు విగ్రహం దగ్గర కదల్లేకపోయాను.. కానీ స్విట్జర్లాండ్ నుంచి తిరిగిరాలేకపోయానని మోహన వివరిస్తారు. ఈ దంపతుల సహయాత్రలో 45 ఏళ్లు దొర్లిపోయాక గానీ, మోహనకు ఇదంతా ఎలా చేయగలిగారనే ప్రశ్న మెదిలింది. విజయన్ దగ్గర సమాధానం ఉంది. ''తొలుత నువ్వు శిఖరం నుంచి దూకేరు. కిందకు చేరే దారిలో రెక్కల్ని కట్టుకో...'' అనే అమెరికన్ ఫాంటసీ రచయిత రే బ్రాడ్బరీ మాటల్ని కాస్త అటు ఇటుగా తన సొంత దృక్కోణంలో చెబుతాడు. 17 దేశాలు చుట్టొచ్చాక.... 60 ఏళ్లు దాటాక... ఇంకా ఒక ప్రయాణం మిగిలే ఉంది. అదే రష్యా. ఏమో చెప్పలేం. రష్యా నుంచి ప్రేమతో వచ్చాక మరో ప్రయాణం మిగిలే ఉంటుందేమో. బలంగా కోరుకుందాం విజయన్ మోహనల యాత్ర కొనసాగుతూనే ఉండాలని.



