ఐన్‌స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్‌లను మించి ఐక్యూ స్థాయి ఉన్న వారి గురించి తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. మరయితే వారంతా ఐన్‌స్టీన్ కన్నా గొప్ప వారవుతారా? వారిలా శాస్త్ర ప్రపంచాన్ని భారీ మలుపు తిప్పుతారా? చెప్పలేం కానీ, సబ్రినా గోంజలెజ్ పాస్టెర్స్కీ అనే 22 ఏళ్ల అమ్మాయి మాత్రం నేటి తరపు ఐన్‌స్టీన్‌గా సంచలనం సృష్టిస్తోంది. విశ్వాంతరాళంపై మనకున్న జ్ఞానాన్ని సరిచేసేలా గొప్ప సిద్ధాంతాలకు ఆమె కేంద్రం కానుంది. ఈ ఏడాది స్టీఫెన్ హ్యాకింగ్ కృష్ణబిలాలపై కొత్తగా అందించిన పరిశోధన పత్రాల్లో పాస్టెర్స్కీ పరిశోధనాంశాల్ని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఆమె శాస్త్ర ప్రపంచపు చూపును తన వైపు తిప్పుకుంది.
విశ్వం పుట్టుక, ఆకారం, నిర్మాణం, వ్యాప్తి, స్థితిపై ఎన్నో సిద్ధాంతాలు, వాదనలు.. అసందిగ్ధత. కొందరు ఒకటే విశ్వం అంటారు. మరికొందరు అనేక విశ్వాల్లో మనదొకటి అంటారు. బిగ్‌బ్యాంగ్ ముందు అంతా శూన్యమనే వారున్నారు. ఏదీ లేకుండా విస్ఫోటనం ఎలా సంభవమని ప్రశ్నించే వారున్నారు. ఇవే కాదు ఈథర్‌కు చెల్లు చీటీ ఇచ్చాక, డార్క్ మేటర్ అనే సరికొత్త పదార్థాన్ని ప్రవేశపెట్టారు. కృష్ణ బిలాలను ఆహ్వానించే లోపు, శ్వేత బిలాల కాన్సెప్టులు సిద్ధమైపోతున్నాయి. కాంతి వేగం అందుకుని మనిషి ప్రయాణించడం కష్టతరమంటే, వర్మ్హోల్స్ సిద్ధాంతంతో సుదూరాలకు పక్కదార్లున్నాయని అంటున్నారు. కాలం, రోదసికి సంబంధం చెప్పి భూత, భవిష్యత్తు కాలాలను చూసి రావొచ్చనే దానిపై పరిశోధనలు ఊపందుకున్నాయి. కళాశాల స్థాయిలో భౌతిక శాస్త్ర విద్యార్థుల నిద్ర చెడగొట్టే సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ, స్పేస్ టైమ్‌ల స్వభావాలపై ఉండే థియరీల్లో అదే వయసు నాటికి సబ్రినా పాస్టెర్స్కీ అందాన్ని చూసింది. వాటిలోని అద్భుతాన్ని ఆరాధిస్తోంది. క్వాంటమ్ గ్రావిటీని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు పరిశోధనలు సాగిస్తోంది. క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా గ్రావిటీ ప్రభావాన్ని తేలిగ్గా విశదపరిచేందుకు అధ్యయనం చేస్తోంది. పాస్టెర్స్కీ పరిశోధనలు ఇప్పటి వరకు ఆ అంశాల్లో మనకున్న అవగాహనను మార్చేస్తాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త బృందాలు, అంతర్జాతీయ శాస్త్ర రంగ వేదికలు అంటున్నాయి. ఇప్పటికే ఆమె పనిని పరిశీలించిన దిగ్గజ శాస్త్రవేత్తలు ఆమె విప్లవాత్మక సిద్ధాంతాల్ని పరిచయం చేయనుందని చెబుతున్నారు. పాస్టెర్స్కీ ఎప్పుడైనా తమతో కలిసి పనిచేయొచ్చని నాసా ఎప్పుడో ప్రకటించేసింది. అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆమె సేవలకు తమ కంపెనీ ద్వారాలు ఎప్పటికీ తెరుచుకునే ఉంటాయని ఆఫర్ ఇచ్చాడు. అంతరిక్ష వాహనాలు, విమానాల రూపకల్పన, నిర్మాణ సంస్థ బ్లూ ఆరిజిన్ కూడా పాస్టెర్స్కీ ఎప్పుడు తమకు పనిచేస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ప్రస్తుతానికి పూర్తిగా కృష్ణబిలాలు, క్వాంటమ్ ఫిజిక్స్‌కే అంకితమైపోయిన ఆమెకు ఇప్పుడు 22 ఏళ్లు. తనకు కేవలం 14 ఏళ్ల వయసున్నపుడే తన తండ్రి కోసం ఓ విమానాన్ని రూపొందించి బహుమతిగా ఇచ్చేసింది ఈ మేధావి. దాన్ని పరీక్షించి, వాడుకునేందుకు అనుమతి పొందడం కోసం తొలిసారి ప్రఖ్యాత మసాచ్చుసెట్స్ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎంఐటీ) మెట్లు ఎక్కింది. సింగిల్ ఇంజిన్ ఉన్న ఆ విమానం రూపకల్పన, తయారీపై ఓ వీడియోను తీసి యూట్యూబ్‌లో కూడా పెట్టేసింది. తన తండ్రి గ్యారేజీలో 363 రోజులు కష్టపడి సొంతగా తయారుచేసి నడిపింది కూడా. దాన్ని చూసి అవాక్కయిన వారిలో ఎంఐటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పెగ్గీ ఉడ్డెన్ ఒకరు. 12 ఏళ్లకే ఎయిర్వెంచర్ వద్ద ఎఫ్ఏఏ1కు కోపైలెట్గా మారిన పాస్టెర్స్కీ ప్రతిభకు ఫిదా అయిపోయిన ఉడ్డెన్ ఆ తర్వాత కొన్నేళ్లకు పాస్టెర్స్కీ ఎంఐటీలో సీటు పొందేందుకు సాయం కూడా చేశారు. ఆమె అంచనాలకు తగ్గట్టుగా రాణించి పాస్టెర్స్కీ సంస్థలో అవకాశమున్న అత్యధిక స్కోర్ (గ్రేడ్ యావరేజ్ 5.00) సాధించింది. విశ్వవిద్యాలయంలోని మేటి ప్రొఫెసర్ల దృష్టి ఆమె ప్రతిభ మీద పడింది. ఎంఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక మరో ప్రఖ్యాత శాస్త్ర సాంకేతిక బోధనా సంస్థ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో చేరింది. అంతరిక్షం, గురుత్వాల ఆకారాలను వివరించే క్వాంటమ్ గ్రావిటీ ఎస్-మ్యాట్రిక్స్‌కు సంబంధించిన సెమీ క్లాసికల్ విరాసొరో సిమ్మెట్రీ, క్వెడ్ సిమ్మెట్రీపై వచ్చిన లోస్ సబ్లీడింగ్ సాఫ్ట్ సిద్ధాంతాలపై తొలి రెండు పరిశోధనా పత్రాలను వెలువరించి శాస్త్ర ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయినా పాస్టెర్స్కీ గురించి అంతగా తెలియకపోవడానికి కారణం సామాజిక మాధ్యమాల్లో, మిగతా మీడియాలో ఆమె అంతగా యాక్టివ్‌గా ఉండదు. తనకు ఫేస్బుక్, లింక్డ్ ఇన్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలేదు. కనీసం స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగించదు. ఫిజిక్స్గర్ల్.కామ్ అనే వెబ్సైట్ ద్వారానే తాను చేసే పరిశోధనలు, ప్రస్తుత కార్యక్రమాలపై సమాచారం ఇస్తూ ఉంటుంది. క్యూబన్ అమెరికన్ అయిన పాస్టెర్స్కీ షికాగో నగర శివారు ప్రాంతంలో పుట్టి పెరిగింది. సుమారు 20 కోట్ల రూపాయలను ఇచ్చే ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ ఆరంభ బహుమతిని అందుకున్న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రిన్స్టన్ ప్రొఫెసర్ నీమా అర్కానీ హమేద్ కూడా పాస్టెర్స్కీ పరిశోధనల్ని జాగ్రత్తగా గమనిస్తోంది. త్వరలో స్టీఫెన్ హ్యాకింగ్‌తో కలసి పరిశోధనా పత్రాలు సమర్పించనున్న హార్వర్డ్ ప్రొఫెసర్ ఆండ్రూ స్ట్రోమింగర్ ద్వారా పాస్టెర్స్కీ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆమె పరిశోధనలకు గాను లక్షల రూపాయల్ని ప్రసిద్ధి చెందిన హెర్ట్జ్ ఫౌండేషన్, స్మిత్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్లు అందిస్తున్నాయి. ఫిజిక్స్ అంటే పాస్టెర్స్కీకి ఎంత వ్యామోహమంటే మిత్రులు కూడా ఆమెకు సరిగా లేరు. ఉన్న కొద్ది మంది తమ బారుఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే అదేమీ పట్టనట్టు తన ఆలోచనలో తాను ఉంటుందట. భౌతిక శాస్త్ర రంగంలోనే స్థిరపడతావా అని ఎవరైనా అడిగితే అదేమీ 9-5 చేసుకునే ఉద్యోగం కాదు. అలసట వల్ల కాసేపు నిద్ర పోయి లేచాక మళ్లీ దానితోనే మమేకమైపోయే బంధమదని అంటోంది. ఇప్పటి వరకు బోయింగ్ ఫాంటమ్ వర్క్స్‌కు, సెర్న్ లార్జ్ హ్యాడ్రన్ కొల్లైడర్లో సీఎంఎస్ ప్రయోగం, నాసా, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (జెనీవా)కు సేవలు అందించిన ఆమె స్పిన్ మెమరీ, ట్రయాంగిల్ ద్వారా సుపరిచితమైంది. ప్రస్తుతానికి స్ట్రింగ్ థియరీ, హై ఎనర్జీ ఫిజిక్స్‌పై పరిశోధనలు చేస్తోంది. ఫోర్బ్స్, సైంటిఫిక్ అమెరికన్లు రూపొందించిన అత్యంత ప్రతిభావంతుల జాబితా (30 అండర్ 30)లో పాస్టెర్స్కీ పేరు కూడా ఉంది. రానున్న పదేళ్లలో సైంటిఫిక్ అమెరికన్ మేగజైన్ ముఖ చిత్రం కావాలనేది ఆమె లక్ష్యం.
లేడీ ఐన్‌స్టీన్!!
